ఈమధ్య నేను ఓ చుట్టాలింటికి కుటుంబ సమేతంగా వెళ్ళాను చుట్టాలు అంటే దూరం చుట్టాలు ఏం కాదు నా అర్ధాంగి తరపు వారు.ఒకప్పుడు బాగా చనువుగా మెలిగిన వాళ్లే. ఓ ఆరు గంటల వాహన ప్రయాణం తర్వాత వాళ్ళు ఉండే కంపార్ట్మెంట్ అదేనండి అపార్ట్మెంట్ కి చేరుకున్నాము. ఎంత ఆధునిక సౌకర్యాలు ఉన్న కారయినా అంతదూరం ప్రయాణం చేసివచ్చామేమో కాస్త చిరాగ్గా ఉంది. ఈమధ్య వాళ్లు కొత్తగా కొన్న అపార్ట్మెంట్ లోకి వెళ్లారు. కారణం ఏదైనా అప్పట్లో వాళ్ళ గృహప్రవేశ ఆహ్వానం ఏదో మొక్కుబడిగానే ఉంది . పిలుపులు సరిగా లేవని ఓ నాలుగు రోజుల పాటు నా శ్రీమతి సణుగుతోనే ఉంది అప్పట్లో.
ప్రస్తుతంలో మా అబ్బాయికి వాళ్ళు ఉండే ఊర్లో ఏదో పని ఉందని చెప్పటంతో నా శ్రీమతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. .అప్పటికీ మావాడు అంటూనే ఉన్నాడు…”నా ఆఫీసు పనికీ దీనికీ ముడివేయకే”అని. “సరేలేరా,ఎంత కాదనుకున్నా వాడు నాకు అన్న వరసయ్యే వాడు.ఆడపడుచులు ఎక్కువగా అలగకూడదు. ఇంటికి మంచిది కాదు.ఎలానూ నీవు ఆ ఊరే వెళుతున్నావు కదా..అందరమూ వెళ్ళి ఓ రోజు ఉండి వచ్చేద్దాం” అని ఓ సమర్ధించుకునే వివరణ ఇచ్చింది. ఆమె మాట కాదంటే ఏమవుతుందో తెలుసు కనుక తప్పని పరిస్థితుల్లో మేం అందరం కలిసి బయలుదేరాం. ఇంటినుండి బయలుదేరేసరికి ఉదయం ఏడు గంటలు అయిపోయింది.
ప్రయాణం ఆరు గంటలూ మా ఆవిడ వాళ్ళ గురించి ఏవో కబుర్లు (కథలు) చెపుతూనే ఉంది. ఆయన ఎంత గొప్పగా రెండు చేతులా సంపాదించిందీ, పిల్లల్ని ఆ డబ్బుతో ఎంత గొప్పగా చదివించిందీ, ఒకళ్ళని కెనడా ఒకడిని అమెరికా పంపించిందీ, వాళ్ల పెళ్లిళ్లు ఎంత వైభవంగా చేసిందీ… ఇలా అంతు దరీ లేని కబుర్లు చాలా చెప్తూనే ఉంది. కారులో నుంచి దూకి పారిపోలేం కనుక తప్పనిసరి అయి అవన్నీ వింటూ కూర్చున్నాము. అన్ని కబుర్ల సారాంశం ఒక్కటే..మేం వెళ్ళబోయేవాళ్ళు బాగా ఆస్తులూ అవీ సంపాదించారు, ఇప్పుడు చాలా గొప్పవాళ్ళు అయిపోయారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.. ఇలా ఇంకా ఏవేవో చెపుతూనే ఉంది. మాలో ఎవరికీ మా ఆవిడని ఎదిరించే సామర్థ్యం గాని , ధైర్యం కాని ,మాటకారితనం గాని లేవు. ఇంట్లో కూడా ప్రతిసారి మాఆవిడ మాటే నెగ్గుతుంది, కాబట్టి మేము ఆవిడ మాట వినటానికి అలవాటు పడిపోయాం. మొత్తానికి మా చుట్టాల అపార్ట్మెంట్ చేరుకున్నాం.
మా చుట్టాలాయన కిందకి దిగి వచ్చాడు. “ఇక్కడ మీ కారు పార్కింగ్ చేయటానికి వీలు కాదండి. వాచ్మెన్ కి చెప్తాను. బయట ఎక్కడ పెట్టాలో అతను మీకు చూపిస్తాడు”అన్నాడు ఆయన. ఆ పార్కింగ్ లో వేరే వాళ్ళ కార్లు పెట్టుకుంటానికి ఇబ్బంది అవుతుందేమోనని అనుకున్నాను నేను. కానీ నేను గమనించిన అంత మటుకు అక్కడ ఇంకా ఒక ఐదు కార్లు పెట్టినా ఖాళీగానే ఉండే పార్కింగ్ ప్లేస్ ఉంది. నేను లగేజీ తీసుకొని దిగుతుంటే ఆయన ముఖంలో ఒక రకమైన ఆయిష్ట భావన గమనించాను. అది ఎందువల్లో నాకు అర్థం కాలేదు. నాకు ఆయనకి శత్రుత్వం అయితే ఎప్పుడు ఏమీ లేదు. నాకే అలా అనిపించింది ఏమో తెలియదు. “రండి.. రండి.. బావగారు బహుకాల దర్శనం” అంటూ ఎదురొచ్చి మాట్లాడతాడని అనుకున్నాను కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. “సరే పోనీలే” అని నేనే సర్దుకుని లిఫ్ట్ లో వాళ్ళ అపార్ట్మెంట్ లోకి వెళ్లాం.
“పంకజం మీ అన్నయ్యగారు వాళ్లకి మంచినీళ్లు ఏమన్నా కావాలి ఏమో చూడు” అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న చెల్లెలు వరస పంకజం “ఏమీ అనుకోకండి అన్నయ్య గారూ,ఆయనకి రాత్రి నుంచి ఒంట్లో బాగాలేదు అందుకని ఆయన అలా ఉన్నారు”అంది. “అరెరే ఏమైంది అమ్మా” అని అడిగాను. “ఎప్పటినుంచో ఉన్న సమస్యే.. కాళ్లవాపులు, మంటలు, ఏ పని చేయాలన్నా అనాసక్తి. కాసేపు పడుకుంటే గాని ఆయన మళ్ళీ మామూలు మనిషి అవరు. మీరు ఏమీ అనుకోకండి” ఉంటూ సంజాయిషీ ఇచ్చినట్టుగా మాట్లాడింది పంకజం. “అయ్యో దానిదేముందిలే అమ్మా ,మనిషిన్నాక రోగాలు రొష్టులు రాకుండా ఉంటాయా” అన్నాను నేను అనునయంగా. ఇంట్లో ఉన్న పనిమనిషి కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది.
అందరం కాఫీలు తాగి కాస్త స్థిమిత పడ్డాం. అప్పటికే మధ్యాహ్నం రెండున్నర అవుతూంది. ఆకలి దంచేస్తుంది, కానీ వాళ్ళు భోజనం ఏర్పాట్లు ఏమీ చేసినట్లుగా నాకు కనపడలేదు. మా ఆవిడ వాళ్ళు వదిన గారితో చాలా లౌక్యంగా భోజనం గురించి అడిగింది. అందుకు ఆవిడ “అరెరే.. మీరు ముందరగా చెప్పలేదు కదా, ఎలాగూ భోజనం వేళ దాటిపోయి వస్తున్నారు కదా, బయటే తినేసి వస్తారు అని మేము ఏమీ ఏర్పాటు చేయలేదు . సారీ ఏమనుకోవద్దు” అని ఒక ముక్కలో తేల్చి పారేసింది. మా ఆవిడ పిచ్చి నవ్వు ఒకటి నవ్వుతూ “ఒరేయ్ శ్రీకాంత్ నువ్వు తొందరగా చొమోటోలో ఆర్డర్ పెట్టి కొద్దిగా భోజనాలు తెప్పించు నాయనా !ఈ పూటకి ఎలాగోలా సర్దుకుందాం”అంటూ ఆర్డర్ ఒకటి పాస్ చేసింది మా అబ్బాయికి. నాకు ఒంటి మీద తేలు జర్రులు పాకుతున్నట్లుగా అనిపించింది. నేను మా వాడి వంక చూస్తే వాడు కూడా అదే భావన లో ఉన్నట్టు నాకు అనిపించింది. మావాడు మరి చేసేది ఏమీ లేదు కనుక భోజనాలు తెప్పించాడు. మేమందరం ఆ పూటకి ఆ భోజనాలు తిని సర్దుకున్నాం. ఆ ఇంటి యజమాని ఇటు తొంగి చూస్తే ఒట్టు. ఆయన తలుపు వేసుకొని పడుకున్నాడు. వాళ్ళ ఆవిడ ముందుగానే చెప్పింది కాబట్టి మేము కూడా పెద్దగా ఏమీ బాధపడలేదు. మాకు అందరికీ కలిపి ఒక గదిఇచ్చారు. దాంట్లో ఒకటే కింగ్ సైజు మంచం ఉంది. గదులు లేవా అంటే అదేమీ లేదు… వాళ్లది నాలుగు బెడ్ రూమ్ లో ఉన్న అపార్ట్మెంట్. మాకు తల ఒక గది ఇచ్చినాగానీ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ నాకు కనపడలేదు. ఆ గదిలో ఎలా సర్దుకోవాలో నాకు మా వాడికి అర్థం కావడం లేదు. నా శ్రీమతి అదేమీ పట్టించుకున్నట్టుగా నాకు కనపడలేదు.
మావాడు మెల్లగా “మనం కాసేపు ఆగి బయలు దేరదాం నాన్నా. ఇక్కడ నాకు తెలిసిన హోటల్లో రూములు తీసుకుందాం. అక్కడ రూములు బాగానే ఉంటాయి”అన్నాడు. “సరేలేరా స్నానాలు చేసి సాయంకాలం బయలుదేరి వెళదాం” అన్నాను నేను. అప్పటికి సాయంత్రం నాలుగు గంటలు అయింది. మేము వెళ్లి అక్కడే ఉన్న హాల్లో కూర్చున్నాం. ఆసరికి మా చుట్టాలాయన లేచి వచ్చి కూర్చుని టీవీ లో గోవింద నామాలు పెట్టుకుని చూస్తున్నాడు. నేను ఉన్న వాడిని ఉండకుండా “కాస్త వార్తలు పెట్టండి బావగారు చూద్దాం” అన్నాను. “ఈటీవీలో న్యూస్ చానల్స్ ఏమీ రావండి.. ఇది యూట్యూబ్లో పెట్టుకుని చూస్తున్నాను. మాకు కేబుల్ కనెక్షన్ లేదు”అన్నాడాయన. “పోనీలెండి యూట్యూబ్ లోనే న్యూస్ ఛానల్ పెట్టండి చూద్దాం” అన్నాను. “నాకు వార్తలు అంటే పెద్దగా ఇష్టం ఉండదండి” అన్నాడు ఆయన నిర్మొహమాటంగా. నాకు వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది. కాని అలా చేయడం మర్యాదగా ఉండదు అనుకొని ఆగిపోయాను. “బావగారు మేము స్నానాలు చేసి బయలుదేరుతామండి” అన్నాను నేను ఆయనతో. “ అలాగే అండి” అన్నాడు ఆయన. మాటవరసకు కూడా భోజనం చేసి వెళ్లండి బావగారు అని అనలేదు, ఎక్కడ ఉంటారు అడగలేదు. మా ఆవిడని పిలిచి గీజర్ ఆన్ చేయమని చెప్పాను. ఆయన వెంటనే “గీజర్ ఎక్కువసేపు ఆన్ చేసి పెట్టకండి రెడ్ లైట్ ఆరిపోగానే మీరు స్విచ్ ఆఫ్ చేయండి. వాడుకునేటప్పుడు గీజరు ఆన్ చేసి పెట్టకండి. ఎక్కువసేపు ఆన్ చేసి పెడితే గీజర్ పాడైపోతుంది మరి” అంటూ ఒక క్లాస్ పీకాడు. నేను ఒక వెర్రి నవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్లిపోయాను. నావంక మావాడు చూసిన చూపు నాకు చాలా రోజులు గుర్తుండిపోతుంది.
“సామాన్లన్నీ సర్దేశాను బయలుదేరుదామా?” అని అడిగాడు మా అబ్బాయి ఓ పావుగంట తర్వాత. “అదేంట్రా స్నానాలు చేసిన తర్వాత బయలుదేరుదాం అన్నావు కదా” అంది మా ఆవిడ. “అమ్మ నీకేమన్నా అర్థం అవుతున్నదా?” అని అడిగాడు చాలా కోపంగా మా అబ్బాయి. మా ఆవిడ అయోమయంగా నన్ను మా అబ్బాయిని మార్చి మార్చి చూసింది. “మనం బయలుదేరుదాంలే శాంతా, విషయాలన్నీ తరువాత చెప్తా నీకు” అన్నాను నేను ప్రశాంతంగా. ఓ పావుగంట తర్వాత సామాను తీసుకొని బయలుదేరాం. బయలుదేరేటప్పుడు కూడా మా చుట్టాలాయన మాటవరసకైనా ఉండండి అనే మాట అనలేదు. పైగా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు రా నాయనా అన్నట్టుగానే ఆయన ప్రవర్తన ఉంది. మా చుట్టాల ఆవిడ మా శ్రీమతికి జాకెట్ ముక్క బొట్టు పెట్టి ఇచ్చింది. ఆవిడ కూడా ఇక్కడే ఉండమని చెప్పలేదు, ఎన్ని రోజులు ఉంటామో అనే వివరాలు కూడా అడగలేదు. ఏదో అంటి ముట్టనట్టుగానే ప్రవర్తించింది. మా ఆవిడ వెర్రి చూపులు ఇంకా తగ్గలేదు. ఓ అరగంట ప్రయాణం తర్వాత మా అబ్బాయి తీసుకున్న హోటల్ రూమ్ కి వెళ్ళాం. తాళం తీసి లోపలకు వెళ్ల్తుఉంటే ఏదో స్వర్గంలోకి వెళుతున్నట్లు అనిపించింది నాకు. పంజరం నుంచి బయట పడ్డాం స్వేచ్ఛావిహంగంలా అనిపించింది. ఉక్కపోతగా ఉన్నప్పుడు శరీరాన్ని స్పృశించిన పిల్ల తెమ్మెరలాంటి సుఖంలా అనిపించింది. అక్కడ లేనిది, ఇక్కడ ఉన్నది ఒకటే.. అది…స్వేచ్ఛ!! స్వేచ్ఛ…..చాలా చిన్న మాట. కానీ చాలా అర్థం ఉన్న మాట. మన స్వేచ్ఛ అపహరణకు గురి అయినప్పుడు మనం అనుభవించే భావోద్వేగాలు , అనుభూతులు చాలానే ఉంటాయి . మా చుట్టాల దంపతుల స్వేచ్ఛ లోకి మేము అనవసరంగా అడుగుపెట్టామేమో అని అనిపించింది నాకు. అందువల్లే వాళ్ళు అలా ఉన్నారేమో అని కూడా అనిపించింది. ఏది ఏమైనా వాళ్ళ ఇంటి నుంచి రావడం మంచి పనే అనిపించింది. మా జీవితాల్లో ఇది ఒక మరిచిపోలేని అనుభవం అవుతుంది.

