దేవరకొండ బాలగంగాధరతిలక్. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

దేవరకొండ బాలగంగాధరతిలక్.

దేవరకొండ బాలగంగాధరతిలక్. పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 నరామసోదమ్మ,సత్యనారాయణ దంపతులకు వీరు జన్మించారు. తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో,సంఘదురన్యాయాలపట్ల అంతక్రోధం.తిలక్‌కు తెలుగు,ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.వచన కవితా ప్రకిృయని తనఅసమాన ప్రతిభతో ఉన్నతశిఖరాలకు తీసుకువెళ్ళారు.వచనకవితకు ధారణ లక్షణాన్ని తెచ్చిన తిలక్ కవిత్వంతోపాటు మంచి కథలు రాసి మెప్పించిన రచయిత.'ప్రభాతము-సంధ్య'-'గోరువంకలు'-'కఠినోషనిషత్తు'-'సుందరి-సుబ్బారావు'-'ఊరిచివరియిల్లు'(కథానికా సంపుటాలు) 'సుసీల పెళ్ళి'-'సాలెపురుగు'(నాటకాలు)'సుచిత్రప్రయాణం'(నాటిక)'తిలక్ లేఖలు.'సుప్తశిల'-'ఇరుగు పొరుగు' మొదలైనవి.వీరికథాసాహిత్యం 'తిలక్ కథలు'పేరున ఓసంపుటిగా వెలువడింది.వీరిమరణానంతరం ,వచన కవితా పితామహుడుగా పేరొందిన కుందుర్తు ఆంజనేయులు పీఠికతో 1968లో ముద్రణపొందిన తిలక్ కవితల సంపుటి'అమృతం కురిసిన రాత్రి'ఉత్తమ కవితాసంపుటిగా కేంద్రసాహిత్యఅకాదెమిఅవార్డు1971లో పొందింది.
"యువకవి లోక ప్రతినిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్ఛా స్పాటికా ఫలక"
మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.
మొదట దేవులపల్లికృష్ణశాస్త్రి ప్రభావంతోనూ,తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ, కవిత్వం వ్రాసినా, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేత.
తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా ఉండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన 1966 జూలై 1 న అనారోగ్యంతో తుదిశ్వాసవిడిచారు.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.