తెలివితేటలు - కొడాలి సీతారామా రావు

తెలివితేటలు

దక్షిణామూర్తి నాకు చాలా కాలంగా తెలుసు. ఎప్పుడూ అతను చెప్పేమాట “మా ఆవిడ తెలివిగలది కాదు.ఏమాత్రం లోకజ్నానం లేదు. నా తర్వాత ఎలా బతుకుతుందొ. మీ ఆవిడ తెలివిగలది.ఏ పనైనా సొంతంగా చేయగలదు. ”

ఈ మాటలు నాకు రొజూ ఎన్నిసార్లు చెప్పివుంటాడొ చెప్పలేను. చాలా సార్లు విన్నాక చెప్పేవాణ్ణి-“ఎందుకు తెలీదు.ఇన్నాళ్ళు ఎలా చేసిందావిడ.ఇంటి విషయాలు,పిల్లల చదువులు అన్నీ బాగానే చూసుకున్నారు కదా.” ఆయనకి నచ్చేది కాదు. నేను గమనించినది ఆయన అన్నదానికి ఎవరూ ఎదురుచెప్పకూడదు. అలా చెప్పినప్పుడు కాసేపు మాట్లాడడు.కొద్ది సేపు కూచుని వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత ఎప్పుడు కలిసినా మళ్ళీ పాతపాటే. నాకు అలవాటై పోయింది. మా అవిడ కూడా చెప్తుంటుంది “ఆవిడకేమండీ అన్నీ తెలుసు. అయినా మీరు ఆవిణ్ణి పూలల్లొ పెట్టిచూసుకుంటారు.అసలు ఆవిణ్ణి మీతొ తీసుకెళ్ళి నేర్పించలేదేమో.” మా కాలనీలొ ఇరవై ఇళ్ళున్నాయి. అన్నీ ఎదురు బదురుగా వుంటాయి.సాయకాలం ఆడవాళ్ళు అందరూ బయటికొచ్చి కబుర్లు చెప్పుకుంటారు.పిల్లలు ఆడుకుంటారు.కానీ, మా దక్షిణామూర్తి భార్య అనసూయ మాత్రం బయటికి రాదు. ఆయన లేనప్పుడు మా ఆవిడ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళుతుంటుంది. అలా తెలిసిన విషయాలేంటంటే ఆవిడ పదొ తరగతి దాకా చదువుకుంది. పదహరేళ్ళ వయసులోనే పెళ్ళి అయింది. ఆయనకి ఆవిడమీద అనుమానం అని ఆవిడ మాటల్లొ చూచాయగా అర్ధం అయ్యిందిట. ఆయన ఏ విషయం లోనూ స్వంతంగా చేయనివ్వడుట.ఉదయం కూరలు ఎంపిక నుంచి అన్నీ ఆయన చెప్పిందే చెయ్యాలి. ఆఖరికి చీరలు కూడా ఆవిడ ఇష్ట౦ లేదు.

చీరలు కూడా ఆయనే కొనుక్కొస్తాడట.అన్నీ పోలిష్టర్ చీరలు తీసుకొస్తాడట.పెద్దదానినయ్యాను నేత చీరలు కట్టూకుంటానంటే వినడుట.పెళ్ళైన కొత్తలో తను ఏదైనా చెప్తే కోపంగా అరిచేవాడుట. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారొ అని తను మాట్లాడటం మానేసిందిట.ఆవిడ మాటలని బట్టి ఆవిడకి ఏమాత్రం స్వతంత్రం లెదు.ఈ రొజుల్లొ కూడా ఇలాంటి వారు వుంటారా అనిపించిం ది.

వాళ్ళ పిల్లలు ఒకరు అమెరికాలొ, ఒకరు హైద్రాబాదులొ వుంటారు. ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు.

******************

ఒకరోజు రాత్రి పన్నెండింటికి సెల్ ఫొన్ మోగితే లేచి చూస్తే దక్షిణామూర్తి నుంచి. అనసూయగారు మాట్లాడుతున్నారు. ఆవిడ గొంతులొ కంగారు వుంది. ఆమె చెప్పినప్రకారం ఆయనకి ఊపిరి తీసుకోటం కష్టంగా వుంది. నా మాటలు విన్న మా ఆవిడకూడా లేచి తలుపు తీసి ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం.

ఆయన బయటే అటూఇటూ తిరుగుతూ ఊపిరి అందక బాధ పడుతున్నారు. నేను వెంటనే 104కి ఫోన్ చేసాను.వాళ్ళు దగ్గిరలో లేరు. వెంటనే ఎదురుగా వున్న క్రిష్ణగారికి ఫోన్ చేసి వివరం చెప్పాను. వారు వెంటనే కిందకి లుంగీ మీదే వచ్చి కారు తీసారు.

నేను,క్రిష్ణ గారు మూర్తి గారికి సాయం చేసి కారులొ వెనక సీట్లొ చేర్చాము.మా ఆవిడ ఆవిడతొ వాళ్ళ ఇంట్లొ ఉంది. నేను మా ఇంట్లొకి వెళ్ళి డెబిట్ కార్డులున్న పర్సు, ఇంట్లో అవసరం కోసం వుంచిన ఇరవై వేల రూపాయలు జేబులొ పెట్టుకుని పాంటు వేసుకుని బయటికి వచ్చాను.

మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. ఆవిడ ధైర్యం గానే ఉంది. “నాదగ్గిర డబ్బు ఉంది. మీరు వెంటనే బయలుదేరండి“అన్నాను. ఆవిడ తాళం వేసి బయటికి వచ్చింది.మా ఆవిడ కూడా వస్తాననటంతో మా ఇంటికి కూడా తాళం వేసి బయల్దేరాము.

కారు బయలుదేరగానే నేను ఆసుపత్రివారికి ఫోన్ చేసి చెప్పాను పేషెంటు గురించి. మధ్యలో వుండగా 104వారి నుంచి ఫోను వచ్చింది ఎక్కడవున్నారు,పెషెంట్ స్థితి ఏమిటని. అవసరం లేదు బయలుదేరి పోయామని చెప్పాను.

ఇరవై నిమిషాలు పట్టే ప్రయాణం పది నిమిషాల్లో తీసుకువెళ్ళారు క్రిష్ణ గారు. మేము ముందుగా చెప్పటం వల్ల ఆసుపత్రివారు వీల్ చైర్ తీసుకొచ్చారు కారు ఆగంగానే.

తిన్నగా ప్రధమ చికిత్సా కెంద్రంలోకి తీసుకువెళ్ళారు. ఆయనని బెడ్ మీద పడుకోబెట్టారు. వేలికి ఒక క్లిప్ పెట్టారు పల్స్ రీడింగ్ కోసం. ఒక నర్సు ఆయనకి ఇసిజి తీయటం కోసం ఆ గొట్టాలు పెడదామని వస్తే ఆయన అలాంటి పరిస్థితిలొ కూడా కసురుకున్నారు. తనకి ఆక్సిజన్ పెట్టమని అడుగుతున్నారు.

డాక్టర్, చిన్నవాడే ఆయనకి చెప్పారు.”మీరు కంగారు పడకండి. ఆక్సిజన్ తేవడానికి వెళ్ళారు.మీకు నయమయ్యేలాగా చెయ్యటానికే మేము వున్నది.ఇసిజి కూడా తియ్యాలి అవి పెట్టనీయండి.”

ఆయన అంటూండగానే ఆక్సిజన్ సిలిండర్ రావటం,ఆయనకి అమర్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ లోగా డాక్టర్ గారు ఆవిణ్ణి అడుగుతున్నారు ఇలా రావటం ఇదే మొదలా,ఇంతకుముందు కూడా వచ్చిందా అని. ఆవిడ చెప్తున్నారు . ఆవిడ పక్కన మా ఆవిడ వుంది. నేనూ,క్రిష్ణ గారు గుమ్మం దగ్గిర నుంచున్నాము.

ఆవిడ బాగులోంచి ఆయన వాడుతున్న మందులు బయట పెట్టింది. అవి చూసి ఆయన అడిగారు “సుగర్ టెస్ట్ చెయించి ఎన్నళ్ళయ్యింది” ఆవిడ చెప్పారు. ఆయన అన్నారు “రేపు సుగర్ టెస్ట్ చెయిద్దాం.”

ఈ లోగా ఇసిజి తీసుకొచ్చిఆయనకి ఇచ్చారు. అంతకుముందే మూర్తి గారికిఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చారు. ఆయన ఇసిజి చూసి ఆవిడతో అన్నారు. “కొద్దిగా తేడా వుంది.ఆసుస్పత్రి లొ చేరిస్తే మంచిది. రెండు రోజులు పరిశీలించి అప్పుడు ఇంటికి పంపిద్దాము. ఇప్పుడు వెంటనే ఐసియు లో వుంచుదాము. మరి రోజుకి ఏడు వేలవుతుంది. ఆలొచించుకుని చెప్పండి.ఇప్పుడు తగ్గిందని తీసుకెళ్ళిపోయినా మళ్ళీ తీసుకురావాలంటే ఇబ్బంది వుండొచ్చు. మీ ఇష్టం.”

ఆవిడ ఏమాత్రం ఆలోచించకుండా “చేర్పించేద్దాము” అంది.

అన్న వెంటనే ఆయనని ఐసియుకి మార్చే ప్రయత్నం చేసారు. ఆవిడ వెనక్కి తిరిగి ఒకసారి ఆయన దగ్గిరకి వెళ్ళి చూసి ఆయనకి జరిగింది చెప్పింది.ఆయన కొంత అసంత్రుప్తిగా సౌజ్నలు చేసాడు. ఆవిడ మరింత వివరంగా చెప్పి ఒప్పించింది.

వెనక్కి తిరిగి మా వేపు వచ్చి వివరించబోయింది. మేము అంతా విన్నాము అని చెప్పాము. ఈ లోగా ఒకతను వచ్చి ముందుగా పదివేలు కట్టాలన్నాడు. నేను నా జేబులోనించి పర్సు తీస్తుంటే ఆవిడ చెప్పింది తనదగ్గర డబ్బులు వున్నాయని. అవిడే డబ్బులు కట్టి రసీదు తీసుకుంది.

ఈలోగా ఆయన్ని ఐసియులోకి తీసుకుళుతున్నారు. ఆయన వెనక ఆవిడ కూడా వెళ్ళింది. నేను క్రిష్ణ గారికి థాంక్స్ చెప్పి ఆయన్ని ఇంటికి వెళ్ళమన్నాను. ఆయన చెయ్యిపట్టుకుంటే వెచ్చగా వుంది. ఏమిటంటే చెప్పాడాయన తనకి 104 జ్వరం వుందని. ఆయనకి మరోసారి క్రుతజ్నతలు చెప్పి ఆయన్ని పంపించి నేను కూడా ఐసియు వేపు వెళుతుంటే వాళ్ళిద్దరూ వస్తున్నారు.

వచ్చినప్పటికంటే బాగున్నారు అని చెప్పారు ఇద్దరూ.అయనకి కూడా బాగుందనిపించిందన్నారుట. మమ్మలినిద్దరినీ వెళ్ళిపోమన్నది ఆవిడ.తెల్లారి వస్తే చాలంది. మా ఆవిడ మాత్రం తను కూడా ఆవిడతో వుంటానంది. నేను ఇంటికి వచ్చేసాను.

@

ఉదయం ఏడు గంటలకు ఆసుపత్రికి వెళ్ళాను. అప్పుడే ఆవిడ ఆయనకి ఇడ్లి తినిపించటానికి లోపలకు వెళ్ళినట్టు చెప్పింది మా ఆవిడ.కాసేపటికి ఆవిడ బయటికి వచ్చింది. ఆయన బాగానే వున్నట్టు చెప్పారు. వాళ్ళీద్దరినీ ఇంటికి వెళ్ళి, స్నానం చేసి డాక్టర్ వచ్ఛేటప్పటికి రావచ్చు అని చెప్పా.

డాక్టర్ గారు వచ్చేక తను ఇంటికి వెళతానంది. సరే మా అవిడ వెళ్ళిపోయింది. నేను పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాను. తొమ్మిది గంటలకి కార్డియాలజిస్ట్ వచ్చారు. ఆయన ఐసియు లోంచి బయటికి వచ్చేటప్పుడు ఇద్దరం ఆయన దగ్గిరకి వెళ్ళాం. “ఈ రోజు బ్లడ్ టెస్ట్ లు చేయిద్దాం. మిగతా అన్నీ బాగానే వున్నాయి. అయితే ఈ రోజు చూసి రేపు ఇంటికి పంపేద్దామన్నారు.”

ఆవిడ అడిగిన ప్రశ్నలన్నిటికి ఓపికగా నిలబడే సమాధానం చెప్పారు. వాళ్ళే బ్లడ్ శాంపిల్స్ తీసుకువెళ్ళారు. మూడు గంటల తర్వాత ఫలితాలు వచ్చాయి. మళ్ళీ డాక్టర్ దగ్గిరకి వెళ్ళాము. ఆయన అవి చూసి, “సుగరు యెక్కువ ఉంది.ఫరవాలేదు. మందులతో తగ్గిపోతుంది. రేపు ఇంటికి పంపేద్దాము “ అన్నారు. ఆహారం తేలికగా జీర్ణమయ్యేవి ఏవైనా పెట్టొచ్చు అన్నారు. నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పి వంట చేసి ఆవిడతో పంపమన్నాను.ఆవిడని బయటికి తీసుకెళ్ళి ఆటొ ఎక్కించి లోపలికి వచ్చాను.ఒకసారి ఐసియు లోకి వెళ్ళి చూసి వచ్చాను. ఆయన్ రాత్రికన్నా చాలా నయం. ముఖంలో కూడా మార్పు కనపడింది. ఆయనకూడా సంజ్నలతో బాగున్నట్టు చెప్పారు.

ఆవిడ వచ్చాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. సాయంత్రం ఆరింటికి వచ్చి ఒక గంట కూచుని వెళ్ళిపోయాను. ఆవిడ రాత్రి తనే ఉంటాననటంతో.

తెల్లారి నేను ఏడింటికి వెళ్ళాను. పది గంటలకి వచ్చి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళచ్చు అని రాసారు. బిల్లులు ఆవిడే చెల్లించింది తనదగ్గిరున్న డబ్బులతో. అంతా అయ్యి బయటికి వచ్చేసరికి పన్నెండు అయ్యింది.

***

మరునాడు సాయంత్రం మాయింటికి వచ్చారు ఇద్దరూ. ఆయన నాకూ మావిడకి క్రుతజ్నతలు చెప్పారు. నేనన్నాను “మీ ఆవిడ చాలా ధైర్యవంతురాలు. ఆవిడ కంగారు పడితే మేము ఏమీ చెయ్యలేము. అసలు మమ్మల్ని ఏ విషయంలొనూ కల్పించుకొనివ్వలేదు. అన్నీ ఆవిడే చూసుకోవటమే కాక డాక్టర్లని అడిగి ఆవిడ సందేహాలన్నీ తీర్చుకున్నారు. ఆవిడ మీద మీకున్న అభిప్రాయం మీరు మర్చుకోవాలికనైనా.” అన్నా.

ఆయన ఏం మాట్లాడకుండా కూచున్నాడు.

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ