నేనూ, శ్రీధర్ చిన్ననాటి స్నేహితులం. స్కూల్ నుండి కాలేజీ వరకు కలిసి చదువుకోవడమే కాక, అదృష్టవశాత్తూ ఒకే కంపెనీలో ఉద్యోగం రావడంతో మా స్నేహం మరింత బలపడింది. మా ఇద్దరి వివాహాలు కొద్ది నెలల వ్యవధిలోనే కావడంతో మా పిల్లలు కూడా ఇంచుమించు ఒకే వయసు వారు. నాకు ఏడు ఏళ్ళ పాప వానియా, శ్రీధర్ కి ఎనిమిది ఏళ్ళ బాబు శౌర్య. కొంత కాలంగా మేము కుటుంబ సమేతంగా విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటున్నాము, కానీ ఏదో ఒక కారణంచేత కుదరలేదు. అయితే ఈసారి పిల్లల వేసవి సెలవులలో ఏదైనా హిల్ స్టేషన్ కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాము.
ఆ రోజు లంచ్ బ్రేక్ లో భోజనం చేస్తూ శ్రీధర్ భార్య టిఫిన్ లో పెట్టిన గుత్తి వంకాయ కూరతో అన్నం తింటూ “అయితే వంశీ, మనం వేసవిలో ఎక్కడికి వెళ్లాలో అలోచించావా?” అని ఆడగగానే నేను చపాతీ ముక్క నోట్లో పెట్టుకుంటూ “ఇంకా లేదు వంశీ, ఒక పని చేద్దాం, ఈ ఆదివారం నీ భార్య, పిల్లాడితో కలిసి మా ఇంటికి డిన్నర్ కి రా, అక్కడే అందరం కలసి మంచి ప్రదేశం నిర్ణయించుకుందాం" అనడంతో శ్రీధర్ సరే అన్నట్టు తల ఊపి భోజనం కానిచ్చాడు. ఆదివారం సాయంత్రం నా భార్య స్వప్న రుచికరమైన వంటకాలు చేసి డిన్నర్ కి టేబుల్ సర్దింది.
సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో శ్రీధర్ భార్య సీత మరియు బాబు శౌర్యతో కలిసి ఓ అందమైన పూల గుత్తిని తీసుకుని వచ్చాడు. స్వప్న గబగబా అతిథులకు కాఫీ, స్నాక్స్ ఆఫర్ చేసాక, పిల్లలు ఆటలో మేము కబుర్లలో పడ్డాము. చివరికి శ్రీధర్ వేసవిలో ఎక్కడకి వెళ్లాలన్న విషయం ఎత్తాడు. ఈ సంగతి విన్న మా భార్యలు చాలా సరదాగా ఎక్కడికి వెళితే బాగుంటుందో చర్చించుకుని, చివరికి ఊటీ ప్రోగ్రాం ఫిక్స్ చేశారు.
అనుకున్నట్టే ఇరువురం ఆఫీస్ కి రెండు వారాలు సెలవు పెట్టి, ముందుగానే ఊటీలో బుక్ చేసి ఉంచుకున్న కాటెజ్ లో దిగాము. ఊటిలో పొగమంచుతో నిండి ఉన్న చల్లని వాతావరణం, చుట్టూ ఆకుపచ్చటి నీలగిరి కొండలు, స్వచ్ఛమైన నీరు కలిగిన సరసులు, జలపాతాలు, అందమైన పూల తోటలను ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా ఆ రెండు వారాలు గడిపి, తిరుగు ప్రయాణంలో ఒక రోజు కోయింబత్తుర్ లో ఉండి అక్కడనుండి మా ఉరికి ఫ్లైట్ ఎక్కాము.
అందరం చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫ్లైట్ ఎక్కి మా సీట్స్ లో కూర్చన్న కొంత సేపటికే విమానం టేక్ ఆఫ్ అయింది. వెనువెంటనే పైలట్ కెప్టెన్ సురేందర్ అతని గంభీరమైన కంఠంతో పరిచయం చేసుకుని ప్రయాణికుల్ని ఆహ్వనించారు. కొంతసేపటికి నేను వాష్రూమ్కి వెళుతూ అక్కడే కూర్చున్న ఎయిర్ హోస్టెస్ మొహాలలో దిగులు, ఆందోళన గమనించాను. వారిలో చిరపరిచితమైన చిరునవ్వు జాడ లేదు. నాకు అది కొంచం అసహజం అనిపించినా ఏమి అడగకుండా నా సీట్ వద్దకి వచ్చి కూర్చున్నానే కానీ నా మనసు ఏదో కీడు శంకించింది. ఈ విషయం మెల్లగా పక్క కూర్చున్న భార్యకు చెప్పాను. ఆమె "ఉరుకోండి, మీకు అన్ని అనుమానాలే, ఆ ఇద్దరూ ఏదో గొడవ పడి ఉంటారు", అని అనడంతో ఇంక ఆ విషయం పెద్దగా ఆలోచించలేదు. సుమారు ఓ అరగంటలో ఫ్లైట్ ల్యాండ్ అయి మేము దిగుతున్నపుడు కూడా ద్వారం వద్ద నిలబడి ఎప్పుడూ నవ్వుతూ ధన్యవాదాలు తెలిపే ఎయిర్ హోస్టెస్ మొఖాలలో చిరునవ్వు కరువైయ్యింది, వారి ముఖములో భయం, బెదురూ స్పష్టంగా కనపడ్డాయి. మేమంతా ఫ్లైట్ దిగుతూ ఉండగా ఒక వింత దృశ్యం కనపడింది. ఫ్లైట్ చుట్టూ ఏర్పోర్ట భద్రతా దళాలు, ఫైర్ బ్రిగేడ్, రెండు మూడు అంబులెన్స్లు అప్రమత్తంగా నిల్లబడి ఉన్నాయి. మేము ఏమి జరిగిందో అని కుతూహలంగా తెలుసుకోవాలని అనుకున్నాము కానీ, మమ్మల్ని త్వరగా ఎయిర్ పోర్టు వైపు వెళ్లమని అభ్యర్థించారు సిబ్బంది. మేము ఎయిర్ పోర్టులోకి వెళ్ళేసరికి బైగజ రావడానికి ఆలస్యము అవుతుందన్న అనౌన్స్మెంట్ తో ఫ్లైట్ లో మాకు తెలియని సంఘటన ఏదో జరిగి ఉంటుంది అన్న విషయం అందరిలో బలపడింది, కానీ ఎవ్వరికీ విషయం ఏమిటో తెలియలేదు. చివరికీ బైగజ వచ్చకా రాత్రి ఆలస్యంగా ఇళ్ళకి చేరుకున్నాము.
మరునాడు నేను ప్రయాణ బడలిక తీర్చుకోడానికి ఆఫీస్ కి సెలవు పెట్టి, అలస్యంగా నిద్ర లేచి కాఫీ తాగుతూ వార్తాపత్రిక విప్పాను. మొదటి పేజీలో విమానము బొమ్మతో పెద్ద అక్షరాలలో 'కోయింబత్తుర్ నుండి వచ్చే విమానంలో కలకలం' అని రాసి ఉండడంతో ఉత్సాహంగా వార్తాపత్రిక చదవడం ప్రారంభించాను.
జరిగిన సంగతి ఏమిటంటే విమానం కొద్ది సేపట్లో ల్యాండ్ అవుతుంది అనగా పైలట్ తన సీట్ పక్క పెట్టుకున్న నీళ్ల బాటిల్ ఆందుకోవడానికి వెళితే ఆయన చేతికి ఏదో చల్లగా తగలంతో తో అయన గమనించి చూడగా ఒక త్రాచుపాము చలనం లేకుండా చుట్ట చుట్టుకొని పడుకోనివుందిట. పైలెట్ వెంటనే కోపైలెట్ కి విమాన సిబ్బందికి ఫోన్ ద్వారా ఈ విషయం మెల్లగా సూచించి, ఎట్టి పరిస్థితిలో కూడా ఎయిర్ పోర్ట్ చేరే వరకు కాక్‌పిట్ ద్వారం తెరవబడదని, యాత్రికులకు ఈ విషయం అస్సలు తెలియకూడదని సూచించాడు. అప్పటీకే కోపైలెట్ ఎయిర్ పోర్ట్ అధికారులకు కూడా విమానంలో నెలకొన్న పరిస్థితిని తెలియజేసాడు. పాము వల్ల అతనితో పాటు 180 మంది ప్రయాణికుల ప్రాణాలకి కూడా పొంచి ఉన్న ముప్పు గమనించిన కెప్టెన్ సురేందర్ అణు మాత్రం కుడా చలించకుండా, అతను ఏ నిమిషానికైనా పాము కాటుకి గురి అవచ్చు అన్న విషయం తెలిసి కూడా చాలా స్థిమితంగా, ధైర్యం కోల్పోకుండా ఫ్లైట్ ల్యాండ్ చేసాడు.
ఏ చిన్న అలికిడికి అయినా పాము లేవవచ్చని, ఫ్లైట్ ల్యాండ్ అయి యాత్రికులు, విమాన సిబ్బంది దిగినా పైలెట్స్ ని దిగవద్దని సూచించారు అక్కడికి చేరిన వన్యప్రాణి అధికారులు. వారిలో ఇద్దరు పాముని పట్టుకునే ప్రత్యేకమైన కర్ర, ఒక సంచి తీసుకుని ఫ్లైట్ ఎక్కి నిశ్శబ్దంగా కాక్‌పిట్ లో కూర్చుని ఉన్న కెప్టెన్ సురేందర్ వెనుకనుండి వెళ్లి మెల్లగా పాముని కర్రసాయంతో పట్టుకుని సంచిలో దింపుతూ వుండగా పాము కోపంతో బుస కొట్టి లేచింది, కానీ అప్పటికే దానిని సంచిలో దించేసి తాడుతో సంచిని కట్టేసాడు అందులో ఒక వ్యక్తి. పాముని పట్టుకోవడంతో ఇరువురు పైలెట్స్ ప్రశాంతంగా ఊపిరి పీల్చారు. గంట నుండి పడుతున్న వారి ఆందోళన, భయం పోయి వారికి ఉపశమనం కలిగింది. వారిని అప్పటికే సిద్ధంగా ఉన్న ఎంబులన్స్ లో ఆసుపత్రికి తీసుకొనివెళ్ళి, వైద్య పరీక్షలు నిర్వహించి ఇళ్ళకి చేర్చారు.
ఆ వార్త చదివిన నేను 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ సురేందర్ ప్రదర్శించిన ధైర్య సాహసాలను మనసులోనే అభినందించాను. అంతే కాదు విమాన సిబ్బంది, ఫ్లైట్ అటెండెంట్ కూడా అభినందనీయులు. వారు అలాంటి పరిస్థితిలో కూడా ప్రయాణికులకు విషయం తెలియనియ్యకుండా, వారు భయ భ్రాంతులకు గురి అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మా ఇరు కుటుంబాలు మమల్ని కాపాడిన ఆ దేవుడితోపాటు పాముని తనపక్కనే పెట్టుకుని మమ్మల్ని సురక్షితంగా గమ్యానికి చేర్చిన ఆ పైలెట్ కి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాము .