స్వయంవరం - తాత మోహనకృష్ణ

Swayamvaram

పూర్వకాలం.. ఒకానొక రాజ్యాన్ని దేవసేనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఎంత గొప్ప మహారాజైనా..కూతురి పెళ్ళి చెయ్యాలి కదా..! అదే అతని దిగులు. తల్లి లేని పిల్లని పెంచి పెద్ద చేసాడు. ఇప్పుడు కూతురికి వివాహం చేసే సమయం వచ్చింది. ఎలాంటి వరుడిని చూడాలో రాజుకు తెలియలేదు. అదే విషయాన్నీ రాజు తన కూతురిని అడిగి తెలుసుకున్నాడు.

ఒకరోజు మహారాజు మహామంత్రితో..

"మంత్రిగారు..! మా అమ్మాయికి పెళ్ళి చెయ్యాలి. అమ్మాయికి తగిన వరుడు కోసం చాటింపు వేయించండి. ఎవరైనా సరే, మా అమ్మాయి ఇష్టపడితే చాలు, అతనికే ఇచ్చి పెళ్ళి చేస్తాను. తొలి పరిక్షలు మీరు పెట్టి కొందరిని ఎన్నుకోండి. చివరి పరీక్షగా, అమ్మాయిని ఒకే మాటతో మెప్పించగలిగే వాడినే అమ్మాయి వరిస్తుంది..." అన్నాడు దేవసేనుడు

"అలాగే మహారాజా..! ఇప్పుడే చాటింపు వేయిస్తాను.." అన్నాడు మహామంత్రి

"మహారాజు గారి అందాల కూతురి కోసం ఇదే స్వయంవరం. ఎవరైనా యువకులు, అర్హులు రాకుమారిని మెప్పించి వివాహం చేసుకోగలరు..." అని చాటింపు వేయించాడు.

చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చారు. అందులోంచి ముగ్గురు యువకులు రాజకుమారి పెట్టే పరీక్షకు అర్హత సాధించారు. ముగ్గురు యువకులు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. అందులో మొదట వ్యక్తి రాజకుమారి దగ్గరకు వెళ్లి, ఆమె చెవిలో ఒక మాట చెప్పాడు. అలాగే రెండో వాడు ఇంకొక మాట చెప్పాడు. మూడవ వాడు కుడా వెళ్లి ఆమె వైపు చూస్తూ.. ఆమె చెవిలో ఒక చిన్న మాట చెప్పాడు.

రాజకుమారి ఎవరిని వరిస్తుందో అని, అందరూ ఎదురు చూస్తున్నారు. రాజకుమారి వరమాలను మూడవ యువకునికి వేసింది. మహారాజు ఇద్దరకి వైభవంగా పెళ్ళి చేసాడు. రాజకుమారి ఎలా తనని వరించిందో..భర్తకు అర్ధం కాలేదు. మనసు ఉండబట్టలేక, భార్యని మొదటిరాత్రి అడిగేసాడు. దానికి రాజకుమారి ఇలా బదులు ఇచ్చింది..

మొదటి వాడు నా చెవిలో.."నేను చాలా అందంగా ఉన్నానని చెప్పాడు.." అతని కళ్ళలో నా మీద ప్రేమ కనిపించలేదు. నా అందం గురించి అందరికీ తెలిసిందే. నా కోసం ఏం చేస్తాడో చెప్పలేదు. రెండో అతను.."మీ నాన్నగారు చాలా గొప్పవారు అంటూ.." చుట్టు పక్కల చాలా ఆశగా చూసాడు. మా నాన్న గొప్పవారే, కానీ అది నా మీద ప్రేమగా కనిపించలేదు.

ఇంక మీరు.."నీ మాటే నాకు వేదం" అన్నారు. అప్పుడు మీ కళ్ళలో నా మీద ప్రేమ కనిపించింది. చెప్పింది చిన్నమాటే అయినా, మీ కళ్ళతో కోటి ప్రేమ భావాలు పలికించారు. మీరు చెప్పిన ఒక్క మాటతోనే, నేను నీ వాడినే అని చెప్పేసారు..అందుకే నచ్చేసారని చెప్పింది తెలివైన రాజకుమారి..

***********

మరిన్ని కథలు

Rendu mukhalu
రెండు ముఖాలు
- భానుశ్రీ తిరుమల
Anandame anandam
అందమె ఆనందం
- వెంకటరమణ శర్మ పోడూరి
Maa aayana great
మా ఆయన గ్రేట్
- తాత మోహనకృష్ణ
Iddaroo iddare
ఇద్దరూ ఇద్దరే
- M chitti venkata subba Rao
Teerpu lekundane mugisina vyajyam
తీర్పు లేకుండానే ముగిసిన వ్యాజ్యం
- మద్దూరి నరసింహమూర్తి
Anubhavam nerpina patham
అనుభవం నేర్పిన పాఠం!
- - బోగా పురుషోత్తం
Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- M chitti venkata subba Rao