Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
తారాగణం: సుధీర్‌బాబు, నందిత, గిరిబాబు, ఎంఎస్‌ నారాయణ, చిట్టిబాబు, అభిజీత్‌, కిషోర్‌ దాస్‌, ఆశాలత, ప్రగతి, చైతన్య కృష్ణ తదితరులు.
చాయాగ్రహణం: కెఎస్‌ చంద్రశేఖర్‌
సంగీతం: హరి
నిర్మాణం: రామ లక్ష్మి సినీ క్రియేషన్స్‌
దర్శకత్వం: చంద్ర
నిర్మాత: శ్వేతా లానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు
విడుదల తేదీ: 19 జూన్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈఓగా పనిచేసే కృష్ణ (సుధీర్‌బాబు) తాను చిన్నప్పుడు చదివిన స్కూల్‌ గెట్‌ టుగెదర్‌ ఫంక్షన్‌లో పాల్గొనడానికి అమెరికా నుంచి సొంతూరు కృష్ణాపురం బయల్దేరతాడు. హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయి, కృష్ణాపురం వెళుతుండగా గతాన్ని తలచుకుంటాడు కృష్ణ. స్కూల్‌ టైమ్‌లోనే రాధ (నందిత) ప్రేమలో పడ్డ కృష్ణ, కొన్ని కారణాలతో ఆ ప్రేమకు దూరమవుతాడు. తిరిగి హైదరాబాద్‌లో కృష్ణకు రాధ తారసపడుతుంది. అక్కడా అతని ప్రేమ చిగురించినట్లే చిగురించి, మళ్ళీ అతనికి చేదు జ్ఞాపకాన్ని మిగుల్చుతుంది. సొంతూళ్ళో, చిన్నప్పటి స్కూల్‌ గెట్‌ టుగెదర్‌ ఫంక్షన్‌లో రాధని కృష్ణ కలుసుకున్నాడా? వారిద్దరి ప్రేమా ఫలించిందా? అనేది మిగతా కథ. అది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
నటుడిగా ఇప్పటిదాకా చేసిన సినిమాలతో పోల్చితే సుధీర్‌బాబులో చాలా పరిణతి కనిపిస్తుంది. జీవితంలోని మూడు విభిన్నమైన దశల్ని బాడీలాంగ్వేజ్‌తో సహా పెర్‌ఫెక్ట్‌గా కనిపించడంలో సఫలమయ్యాడు సుధీర్‌బాబు. సెంటిమెంట్‌నీ పండిరచాడు. డాన్సుల్లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు.
నందిత క్యూట్‌గా కనిపించింది. నేచురల్‌ గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటన పరంగానూ పాత్రలో ఒదిగిపోయింది. క్లయిమాక్స్‌లో నందిత, సుధీర్‌బాబు పోటీపడ్డారు. ‘ప్రేమకథా చిత్రంలో కలిసి నటించిన వీద్దరి మధ్యా కెమిస్ట్రీ ఈ సినిమాలో ఇంకా బాగా పండిరది.
పోసాని కృష్ణమురళి బాగా చేశాడు. సుధీర్‌బాబు తండ్రి పాత్రలో గిరిబాబు ఆకట్టుకుంటాడు. సప్తగిరి నవ్వులు పూయించాడు. సుధ, చైతన్యకృష్ణ, ప్రగతి తదితరులంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు.
కథ కొత్తదేమీ కాకపోయినా ట్రీట్‌మెంట్‌టో దర్శకుడు సినిమాని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. డైలాగ్స్‌ బాగున్నాయి. కథనం ఆకట్టుకుంటుంది. హరి మ్యూజిక్‌ బాగుంది. పాటలు వినడానికే కాదు, చూడ్డానికీ బాగున్నాయి. సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదనపు ఆకర్షణ. సినిమాలో వున్న ఫీల్‌ని క్యాచ్‌ చేసి మంచి మ్యూజిక్‌నీ, మంచి లొకేషన్స్‌నీ సన్నివేశాల కోసం వినియోగించారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా వుంటే సినిమాలో వేగం పెరిగేది.
ఎంటర్‌టైన్‌మెంట్‌నీ, ఎమోషన్‌నీ సరిగ్గా మిక్స్‌ చేయడం అనేది కళ. అందరికీ అది సాధ్యం కాదు. దర్శకుడు ఈ సినిమాలో రెండిటినీ మిక్స్‌ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఫీల్‌గుడ్‌ మూవీ కనుక, ఎక్కువగా సెంటిమెంట్‌ ఎమోషన్స్‌ మీదనే దర్శకుడు దృష్టిపెట్టాడు. దాంతో వేగం పెరిగినట్టే పెరిగి, తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. కొన్ని సీన్స్‌ ఆడియన్స్‌ హార్ట్స్‌ని టచ్‌ చేస్తాయి. సినిమా ఎమోషనల్‌గా వెళ్తున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం కామెడీ జొప్పిస్తే హిక్కప్స్‌లా అన్పిస్తుంది. అలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నా ఓవరాల్‌గా సినిమా ఆకట్టుకుంటుంది. హీరో, దర్శకుడు మంచి అటెంప్ట్‌ చేశారు. ఆడియన్స్‌ కూడా సినిమాకి కనెక్ట్‌ అయ్యేలా ఎమోషనల్‌ సీన్స్‌ ఉన్నాయి. ప్రమోషన్‌లో నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ పెడితే, సినిమా రేంజ్‌ పెరగొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఎమోషనల్‌గా కలిపింది కృష్ణమ్మ ఆడియన్స్‌నీ, సినిమానీ

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview