Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అన్నమయ్య 'పద’ సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

12. పలుమరు వుట్ల పండుగను

పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను

1. ఊళ్ళవీధుల వుట్లు కృష్ణుడు
    తాళ్ళు దెగిపడ దన్నుచును
    పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని
    పెళ్ళుగ మ్రోసె పెనురవము

2. బంగారు బిందెల బాలు బెరుగులు
   ముంగిట నెగయుచు మోదగను
   కంగు కళింగు కఠింగు ఖణింగని
   రంగు మీరు పెను రవములై

3. నిగ్గుగ వేంకట నిలయుడుట్టిపా
    లగ్గలిక బగుల నడువగను
    భగ్గు భగిల్లని పరమామృతములు
    గుగ్గిలి పదనుగ గురియగను(05-057)

తాత్పర్యము
కృష్ణాష్టమిని జానపదులు ఉట్ల పండుగ అంటారు. రేపల్లెలో జరుగుతున్న  ఉట్ల పండుగలో వెన్న, పాలతో కూడిన ఉట్టిని వేలాడదీస్తూ పైకి కిందికి  లాగుతూ ఉండగా  ఆ ఉట్ల కుండనుండి జారుతున్న పాలు వెన్న చప్పుళ్లు కింద పడుతూ చిడుక్కని మోగుతున్నాయి. (  చిడుక్కు= అల్ప ధ్వనికి అనుకరణ శబ్దం)

1. ఆ రేపల్లె ఊరులో వీథులలో శ్రీ కృష్ణుడుపైకి ఎగిరి ఉట్లకు కట్టిన తాళ్ళు  తెగిపడేటట్టు తంతూ ఉట్లను పగుల గొట్టినప్పుడు, కేకలతో , ఆనంద కోలాహలాలతో  పెద్దగా కఠిల్లుపెఠిల్లు చిఠిల్లని చప్పుళ్లు వచ్చాయి. చెవులు గింగిరాలు తిరిగేటట్టు పెద్ద శబ్దము  పెళ్లున మోగింది.

2. పాలు పెరుగులతో బంగారు బిందెలు నిండుగా ఉన్నాయి. ఉట్ట్లలో ఉన్న వాటిని కొట్టాలని పిల్లలతో కృష్ణుడు  వాటి ముందు ఎగురుచూ కొట్టుచుండగా కంగుమని, కళింగుమని, కఠింగుమని, ఖణింగని (లోహమును కొట్టునప్పుడు కలుగు ధ్వని) పెద్ద చప్పుళ్లు వాతావరణములో మోజును పెంచుతూ వినబడుతున్నాయి.

3. చక్కటి కాంతితో వేంకటేశ్వరుని అవతారమైన కృష్ణుడు పాలతో నిండిన ఉట్ల్లను చుట్టూ ఉన్న అందరికంటే ఆధిక్యముతో ఎక్కువగా పగుల గొట్టగా, పైన ఉన్న ఆ ఉట్ల నుండి ఆ పంచామృతాలలో ఒకటైన పాలు ఒక్కసారిగా భళ్లున, ధారగా కురుస్తున్నాయి.

విశేషాలు
పాత్రలుంచుకొనుటకై  ఇళ్లల్లో  తాళ్లతో వేలాడదీసిన  ఒక అల్లికను ఉట్టి అంటారు. ఉట్టి పదం ఇప్పటికీ  తెలుగు వారి వ్యవహారంలో జీవించి ఉన్న పదం. “ఉట్టిగా (ఊరికే)  మాట్లాడాను” ; “ఉట్టిగట్టుకొని వేలాడటం”   (- అంటే చావకుండా స్థిరంగా ఉండటం .) ఇలా ఉట్టి మాటలు దొర్లుతుంటాయి.

‘ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికివెళుతుందట’ అని ప్రసిద్ధమైన సామెత. కొంచెం ఎత్తులో ఉన్న ఉట్టిని ఎక్కటం చేతకానివాడు, చాల ఎత్తులో ఉన్న స్వర్గాన్ని ఎలా చేరుకొంటాడు? చిన్నపాటి పనులు చేయలేనివాడు పెద్ద పనులు ఏమి చేస్తాడు ? అని ఈ సామెతకు అర్థం. ఎగతాళి చేసే సందర్భంలో ఈ  సామెత వాడుతున్నారు . అయితే ‘ఉట్టికెక్కట’మనే పదబంధాన్ని ‘మూలబడు’ అనే అర్థంలో అన్నమయ్య వాడాడు.("ఉట్టికెక్కు నీ సిగ్గులు నో బావ." 3వ సంపు-172)

ఉట్టి కొట్టే పండుగ కొంత మార్పు తో ఈ రోజు జరుగుతోంది.  నునుపైన స్తంబం కొసలో  డబ్బులసంచి పెడతారు. స్తంబం ఎక్కి తీసి కొనగలిగిన వ్యక్తిదే ఆ సొమ్ము. కాని అతడు పైకెక్కటాన్ని చాలామంది నీళ్లు చల్లి ఆపుతుంటారు. దీనినే కొన్ని ప్రాంతాల్లో ‘ఉట్టి తిరునాళ్ల ‘అంటారు.ఉట్ల తాళ్లను తెలంగాణా ప్రాంతంలో ‘ఉట్టి శేర్లు’ అంటారు.

మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో  ఒక చిన్న కుండ లేదా బుడ్డీలో పెరుగు పోసి ఎంతో ఎత్తున కడుతున్నారు. ఉట్టిని ఇక్కడ ‘దహీహండీ’  అంటారు.   ఆ ఉట్టిని   పగులకొట్టడానికి యువకులు పోటీ పడుతుంటారు. ఎవరు పగులకొడితే వారిని విజేతలుగా ప్రకటిస్తారు. విజేతలకు లక్షల కొద్దీ  బహుమతులూ ఉంటాయి. ఇది ఉట్టి పదం చుట్టూ ఉన్న కొంత చరిత్ర.

పంచామృతములు నీళ్లు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె; వీటిలో పాలను పరమామృతంగా చెబుతూ , ఉట్లనుండి పాలు భళ్లున కారుతున్నాయని అన్నమయ్య చివరి చరణంలో పేర్కొన్నాడు.

సాధారణంగా ‘వు, వూ’  అనే అక్షరాలతో  మొదలయ్యే తెలుగు పదాలుండవు. కాని అన్నమయ్య నిరంకుశుడు. ‘ఉట్టి’ అనాలి. కాని అన్నమయ్య ‘వుట్టి’ అంటాడు. ఆయన మన ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలిచ్చే  వేంకటేశుని ఆస్థాన గురువు. అందుకే భాషా విషయికంగా ఆయన్ని ప్రశ్నించే  అధికారం ఎవరికీలేదు.

అన్నమయ్య ఈ గీతంలో వాడిన ‘పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లు’  శబ్దాలలో పెళ్లున అనే పదం మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉంది. భేరీమృదంగములు పెళ్లున మోగాయి.  అంటే పెద్దగా మోగాయని అర్థం.  చెట్టు పెళ్లున  విరిగింది. అంటే పెద్ద చప్పుడు చేస్తూ విరిగిందని అర్థం. అలాగే కృష్ణుడు కొట్టిన ఉట్టి చప్పుడు చేస్తూ పగిలిందని చెప్పటానికి పెళ్లు శబ్దంతో పాటు  ‘కఠిల్లు పెఠిల్లు చిఠిల్లు శబ్దా’లను అన్నమయ్య కలిపాడు. ఈ నాలుగు ధ్వన్యనుకరణ శబ్దాలు   వరుసగా ప్రయోగింపబడటం వల్ల గీతంలో అందమైన తూగు వచ్చింది. ఉట్టి కుండలు అనేకం ఒకేసారి పగిలిపోతున్న అనుభూతి ఈ అనుకరణ శబ్దాల సమాహారంతో  కవి కలిగించాడు.

వెన్నా పాలూ చేతికి అందకపోతే కృష్ణుడు  ఆ పాలకుండని పగులకొట్టేవాడని భాగవతంలో  ఉంది.  (సంస్కృత భాగవతం- దశమస్కంధం- ఎనిమిదవ అధ్యాయం)బహుశా ఇదే ఉట్టి కొట్టే ఆచారంగా మారి ఉంటుంది. పాల కుండ పగులకొట్టడంలో  అర్థమిది:    ఈ శరీరానికే కుండ అని పేరు. పరమాత్మ సేవ చేయకుండా స్వార్థముగా ఉంటే  ఆ కుండని (శరీరాన్ని) పగలగొట్టి పరమాత్మ  వేరే శరీరాన్నిస్తాడు.

గోపికలందరూ ఇంటి పనులలో మునిగి ఉంటే  కృష్ణుడు చీకటి గదిలోకి వచ్చేవాడు. తన చేతికి ఉన్న కంకణాలూ మణులూ రత్నాల కాంతితో కనపడే పాలూ పెరుగూ వెన్న కుండలను పగులకొట్టేవాడు.( సంస్కృత భాగవతం- దశమ స్కంధం- ఎనిమిదవ అధ్యాయం)

మనం సంసారములో పడి, దేవుని మరచిపోయి,  అజ్ఞానమనే  చీకటి గదిలోఉంటాం. పరమాత్మ యొక్క  దివ్యమైన  ఆభరణాల వెలుగులు  అన్నమయ్య లాంటి  గురువులు.  ఆగురువులు చెప్పినది విని, ఆ కాంతిలో అసలు వస్తువును కనుక్కొనే ప్రయత్నం చేస్తే , స్వామి ఈ కుండని (శరీరాన్ని ) ఖాళీ చేసి మోక్షం కలిగిస్తాడు. ఇదే కుండ పగులకొట్టడం. ఉట్టి పగులకొట్టడం. స్వస్తి.

మరిన్ని శీర్షికలు
kandukuri veereshalingam panthulu