Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Navvula Jallu by Jayadev Babu

ఈ సంచికలో >> శీర్షికలు >>

'జ్యోతిష్యం' పిట్ట కథ - కె. విశాల

jotishyam small telugu story

"లాభం లేదు - బ్రతకడం కష్టం! మహా అయితే మూడు నెలలు!" పెదవి విరిచాడు భరద్వాజ.

"అంతే నంటారా! ఇంకో సారి చూడండి!" నీరసంగా అడిగాడు నరహరి.

"ఆ! నా విద్యనే సందేహిస్తున్నావా మూర్ఖుడా!" భరద్వాజ కోసం.

"కాదు - నా చెవులను నమ్మలేక పోతున్నాను." బాధగా చెప్పాడు.

"వీలైతే ఆస్తిపాస్తుల వీలునామా రాసేసుకో - నువ్వు పోయింతర్వాత మళ్ళీ ఆస్తి తగాదాలతో నీ భార్యాబిడ్డలు కోర్టు కెక్కడం బాగుండదు." సలహా.

"కానీ నాకూ అనుమానం! నాకు ఏ జబ్బూ లేదు. ఆరోగ్యం బాగుంది. చెడు అలవాట్లు లేవు - మరి మీరేమో నా ఆయుష్షు యింకా మూడు నెలలే అంటున్నారు?"

"అదే మూర్ఖత్వం! నువ్వు నాస్తికుడివా? ప్రాణం పోకడ - కడుపు రాకడ ఎప్పుడైనా కావచ్చు." చిద్విలాసంగా చెప్పాడు.

"సరే! ఎలాగూ పోతాను - మరి మీరు ఎంతకాలం బ్రతుకుతారో తెల్సుకోవచ్చా!" బాధగా అడిగాడు నరహరి. ప్యాంటు జేబు తడుముకుంటూ.

"నాకేంరా! నిండు నూరేళ్ళు జీవిస్తాను. నా జాతకం అద్భుతం! అయినా తెల్సుకుని ఏం చేస్తావు అర్భకుడా!" కోపంగా అడిగాడు భరద్వాజ.

"ఏం లేదు - ఈ మధ్యే నాటుతుపాకీ కొన్నాను. అది సరిగా పనిచేస్తుందో లేదో తెల్సుకుందామని!" అంటూ జేబులోంచి రివాల్వర్ బయటకు తీశాడు.

"మూర్ఖుడా! నా వైపు గురి ఎందుకు పెడతావురా! ఏ పిట్టనో - కుక్కని కాల్చి పరీక్షించుకో!" భయపడుతూనే కోపంగా గదమాయించాడు భరద్వాజ.

"లేదు గురూజీ! మీరైతే రెండు రుజువవుతాయి -" గుండెకు గురి పెట్టాడు.

"ఏమంటివిరా సన్నాసి!" నాలుక తడారిపోతుంటే వణికిపోతూ అరిచాడు.

"నా తుపాకి పనిచేస్తుందో లేదో - మీ జాతకం నిజమో కాదో!"

మరిన్ని శీర్షికలు
tasmath jaagratha