Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kandukuri veereshalingam panthulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

హంపి (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

Paryatakam - Hampi

కర్ణాటక రాష్ట్రం లో ని బళ్లారి జిల్లాలో హోస్పేట్ నగరంలో ఉన్న హంపి UNESCO వారిచే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడిన చారిత్రక ప్రదేశం. బెంగుళూరు నుండి 340 కిలోమీటర్ల దూరం లో అలాగే బళ్ళారి నుండి 65 కిలో మీటర్ల దూరం లో ఉంది. అయితే, వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 1986 లో ఈ ప్రాంతం UNESCO వారిచే గుర్తించబడినప్పటికీ 550 స్మారక చిహ్నాలలో కేవలం 58 మాత్రమే ఆ హోదాని పొందాయి.

ప్రసిద్ది చెందిన గాధ ప్రకారం,  హక్కా మరియు బుక్కా గా ప్రాచుర్యం పొందిన హరిహర మరియు బుక్కరాయల అనే   ఇద్దరు స్థానిక సామంత రాజులు వేటకి వెళ్ళినప్పుడు ఒక అనూహ్యమైన దృశ్యాన్ని చూస్తారు. ఆ దృశ్యం, కుందేలుని వేటకుక్క వేటాడుతుండగా అకస్మాత్తుగా ఆ కుందేలు సాహసోపేతంగా మారి తిరిగి ఆ వేటకుక్కను తరుముతుంది. ఆ విషయం వారి గురువుగారు అయిన విద్యారణ్యతో చెప్తారు.ఈ విషయం విన్న ఆ గురువు గారు ఆ ప్రాంతం ఎంతో విశిష్టమైనదని అందువల్ల స్థానిక రాజధానిని ఈ ప్రాంతం లో ఏర్పాటు చేసుకోమని సలహా ఇస్తారు. ఆ విధంగా ఇక్కడ సామ్రాజ్యం ఏర్పడడానికి అంకురార్పణ జరిగింది.

1336 లో హరిహర మరియు బుక్కా లు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అదే సామ్రాజ్యం రెండు శతాబ్దాల కాలం లో ఒక పెద్ద హిందూ మత సామ్రాజ్యంగా మారిపోయింది. ఇక్కడున్న రాజభవనాలలో ఎక్కువ శాతం ఆంధ్రభోజ  శ్రీకృష్ణదేవరాయుల వారిచే క్రీ.శ. 1509 నుండి 1530 ల మధ్యలో నిర్మించబడినవి. హిందూ మతం పురోభివృద్ది, కళలు మరియు నిర్మాణ కళలకి ఈ సమయం అసాధారణ స్థాయిలో పేరు తెచ్చింది. ఒక విధంగా ఈ సమయాన్ని స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు.

హంపి లో ని మార్కెట్లు ప్రపంచం నలుమూలల నుండి వర్తకులతో సందడి చేస్తూ ఉండేది. ఒకప్పుడు, ఇక్కడ రోడ్లపై విలువైన రత్నాలని అమ్మేవారని అంటారు. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత హంపి కి కూడా వర్తించింది. ఎన్నో వైభవాలని చూసిన హంపి నగరం డెక్కన్ సుల్తాన్ల దాడికి పతనమయ్యింది. బీదర్, బీజాపూర్, గోల్కొండ, ఆహ్మేద్నగర్ మరియు బేరార్ కి చెందినా అయిదుగురు డెక్కన్ సుల్తాన్లు హంపి పై దాడి చేసారు. దాదాపు ఆరు నెలల పాటు ఈ నగరం కొల్లగొట్టబడింది. ఆలయాలు మరియు మార్కెట్లు నాశనం చేయబడ్డాయి.  ఆ విధంగా బంగారపు సామ్రాజ్యం ముగింపు దశకు చేరుకుంది.

ఇప్పటికీ తన వైభవంతో వేలమంది పర్యాటకులని అలాగే భక్తులని ఏడాది పొడవునా ఆకర్షిస్తున్నది. హిందూ ఇతిహాసం అయిన రామయణం లో కూడా ఈ ప్రాంతం గురించి ప్రస్తావించబడింది. ఈ ప్రాంతం కిష్కిందగా పిలువబడిన ప్రదేశం. హంపిని సందర్శించేందుకు ఆగస్ట్ నుండి జనవరి వరకు అనువైనసమయం.

హంపిని సందర్శించాలనుకునే వారు హోస్పేట్ కి చేరుకొని అక్కడి నుండి హంపి కి చేరుకోవాలి. అన్ని ప్రధాన నగరాలకు హోస్పేట్ చక్కగా అనుసంధానమయి ఉంది.

పర్యాటక ఆకర్షణలు

విట్టల టెంపుల్ కాంప్లెక్స్

విజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక హంపి నగరం అయితే హంపి నగరం యొక్క వైభవానికి ప్రతీకగా ఈ విట్టల దేవాలయం గురించి చెప్పుకోవచ్చు. తుంగభద్ర నది ఒడ్డున దక్షిణం వైపున ఉన్న ఈ దేవాలయం హంపి నగరం లో ఎక్కువగా సందర్శించబడే ప్రాంతం. రెండవ దేవరాయ కాలం లో నిర్మించబడిన ఈ దేవాలయం  16 వ శతాబ్దానికి చెందినది. ఇందులో విష్ణుమూర్తి కొలువై ఉన్నారు.

ఈ ఆలయానికి ఎదురుగుండా ప్రసిద్ది చెందిన రాతి రధం కలదు. ఏకశిలతో తయారు చెయ్యబడిన ఈ రధంపైన ఊరేగింపులకి దేవతా విగ్రహాలను తీసుకువెళతారు. రాతి చక్రాలు కలిగిన ఈ రధం బరువుగా కనపడినా తేలికగా కదలిపోతుంది.

ఈ ఆలయం లో ని మరొక ఆకర్షణ సంగీతం వినిపించే స్థంబాలు. పై కప్పుకి మద్దతు నిచ్చే ప్రతి స్థంబం కూడా సంగీత వాయిద్య పరికరాన్ని ప్రతిబింబించే స్థంబం చేత మద్దతునివ్వబడి ఉంటాయి. ప్రధాన స్థంబం చుట్టూ ఏడు చిన్నపాటి స్థంబాలు ఉంటాయి. ఈ ఏడు స్థంబాలు తాకినప్పుడు సంబంధిత వాయిద్య పరికరం యొక్క సప్తవర్ణాలని పలుకుతూ ఉంటాయి.

వార్షిక పురందరదాస వేడుకలకు ఈ ఆలయం వేదికగా వ్యవహరిస్తుంది.

విరుపాక్ష టెంపుల్
హంపి లో ని ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ ఇది. తొమ్మిది మరియు పదవ శతాబ్దానికి చెందినదిగా ఈ ఆలయాన్ని భావిస్తారు. విజయనగర సామ్రాజ్యం ఏర్పడటానికి ముందు విరుపాక్ష మరియు పంపలు కొలువై ఉన్న చిన్న మందిరం ఇది. ఆ తరువాత, విజయనగర పాలకులు దీనిని పెద్ద ఆలయ సముదాయంగా మార్చారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే పంపా మరియు విరుపాక్ష ల వివాహ వేడుకలను చూసి ఆనందించడానికి  అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. ఫిబ్రవరి లో ఈ ఆలయం లో జరిగే మరొక ముఖ్య పండుగ వార్షిక రధం పండుగ.

దిగుడు తొట్టె (Stepped Tank)
క్లోరైట్ రాతి తో తయారు చేయబడిన దిగుడు తొట్టె ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం రాజ వంశస్తుల చేత ఉపయోగించబడేది. 22 చదరపు మీటర్ల  పొడవు 7 మీటర్ల లోతు ఉన్నది. అయిదు అంచెలు కలిగిన ఈ ట్యాంక్ కి అమర్చిన మెట్లు చక్కగా ఉంటాయి. ఇటీవల జరిగిన త్రవ్వకాలలో ఈ ట్యాంక్ బయటపడింది.


తులాభారం (Kings Balance)
విట్టల దేవాలయానికి సమీపం లో ఉన్న కింగ్స్ బాలన్స్ ని తులాభారం లేదా తులా పురుషధామగా కూడా పిలుస్తారు.  బంగారం, వెండి, రత్నాలు మరియు విలువైన రాళ్ళతో ఇక్కడే రాజు తన బరువును తూచుకొని వాటిని పూజారులకు పంచిపెట్టేవారని అంటారు.

చంద్ర గ్రహణం లేదా సూర్య గ్రహణం వంటి కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే దీనిని ఉపయోగించే వారని అంటారు. ఈ త్రాసు పైన మూడు ఉచ్చులని గమనించవచ్చు. వాటికి బరువుని వేలాడదీసేవారు. అలాగే ఒక స్థంబంపైన చెక్కబడిన రాజు ప్రతిమని గమనించవచ్చు.

వరాహ టెంపుల్
హిరణ్యాక్షుడనే రాక్షసుడి బారి నుండి ప్రజలను రక్షించడానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తుతాడు. ఈ ఇరువురి మధ్య మొదలైన యుద్ధం కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగింది. ఇక్కడ చిత్ర సమాహారం లో రక్షించబడిన భూగోళాన్ని నోటితో పట్టుకున్న వరాహం ప్రతిమని గమనించవచ్చు.

కానీ, ఇది వరాహ ఆలయం కాదు శివుడి ఆలయం అని వాదనలు కూడా ఉన్నాయి. హంపి శిధిలావస్థ గురించి ఉన్న అనేక భావనల లాగానే దీని గురించి కూడా కొంత వాదన ఉంది.

పురాతన వంతెన
పురందరదాస మంటపానికి దక్షిణాన విట్టల దేవాలయానికి వెనకాతల పురాతన వంతెన ఆనవాళ్ళు కలవు. ప్రస్తుతం వంతెనకి మద్దతుగా ఉన్న స్థంబాలను మాత్రమే గమనించవచ్చు. తుంగభద్రా నది రెండు భాగాలుగా విభజించబడి తిరిగి వెంటనే ఒక చిన్న రాతి ద్వీపం గా ఏర్పడిన ప్రాంతం లో ఈ వంతెన నిర్మించబడింది.

నరసింహ టెంపుల్
జైన్ టెంపుల్ గా కూడా కొన్ని సార్లు పిలువబడే ఈ దేవాలయం గంధమదన కొండకి వాలుగా నది ఎదురుగా నిర్మించబడింది. ఈ మందిరం లో దేవతా విగ్రహాలు ఉండవు. అందువల్ల ఇది ఏ దేవుడి గుడో తెలుసుకోవడం కష్టం.

హంపి బజార్
విరుపాక్ష బజార్ గా కూడా ప్రాచుర్యం చెందిన ఈ ప్రాంతం విరుపాక్ష ఆలయానికి ఎదురుగా ఉంది. మాతంగి కొండ యొక్క క్రింద కొండ వద్ద ఉన్న ఈ ప్రాంతం విరుపాక్ష టెంపుల్ కి తూర్పు నుండి ఒక కిలోమీటరు దూరం లో ఉంది. ఈ వీధికి రెండు వైపులా  పాత  దుకాణాల వరుస ఉంది. కొన్ని రెండు అంతస్తులు కలవి కూడా ఉన్నాయి.

ఈ వీధికి తూర్పు చివరన భారీ నంది విగ్రహం ఉంది. ఆ విగ్రహం పక్కనే రెండు అంతస్తులు కలిగిన ఫోటో గాలెరి ఉంది. అలెక్షాండర్ గ్రీన్ లా చేత 1856 లో తీయబడిన ఛాయాచిత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. సమీపం లో ఉన్న బహిరంగ వేదిక వార్షిక హంపి వేడుకలకు ప్రధాన వేదిక గా వ్యవహరిస్తుంది.

ఈ గాలెరి కి ఎదురుగా కొంచెం దూరం లో గ్రామం లో ని పిల్లల కోసం ఏర్పాటయిన నర్సరీ స్కూల్ ని గమనించవచ్చు. ఇది  ప్రపంచం లో నే పురాతనమైన నర్సరీ స్కూల్ అయి ఉండవచ్చునని భావిస్తారు.

ఇవే కాకుండా హంపి లో సందర్శించవలసిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. గొప్ప చారిత్రక ప్రదేశమైన హంపి లో అడుగుపెడితే ఆనాటి వైభవం మనకి కళ్ళకు కట్టినట్టుగా కనపడి టైం మెషిన్ లో మనల్ని ఆనాటి రోజులకి తీసుకోపోతుంది. హంపి సందర్శన అనిర్వచనీయమైన అనుభూతిని మిగులుస్తుంది.

హంపి ని పూర్తిగా చూడాలనుకునే వారికి కనీసం మూడు రోజుల సమయం పడుతుంది. ఘనమైన గత చరిత్రకు సాక్షిగా నిలిచిన హంపి నగరం అనేకమంది పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది.

మరిన్ని శీర్షికలు
weekly horoscope(July 19 - July 25)