Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
annamayya pada seva

ఈ సంచికలో >> శీర్షికలు >>

జాతీయ త్రివర్ణ పతాక నిర్మాత శ్రీ పింగళి వెంకయ్య గారు - టీవీయస్.శాస్త్రి

pingali venkayya

జాతీయ పతాక నిర్మాత శ్రీ పింగళి వెంకయ్య గారు మన ఆంధ్రుడవ్వటం, మనం చేసుకున్నఅదృష్టం. దేశం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన ఈ మహనీయుని నిత్యం మనం స్మరించుకోవాలి. ఈ మహనీయుని జీవిత చరిత్రను బాలబాలికలకు పాఠ్యాంశంగా చేయాలి. ఆ మహనీయుని గురించిన కొన్నిఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. శ్రీ పింగళి వెంకయ్యగారు 2-8-1876న కృష్ణాజిల్లా దివితాలూకా భట్లపెనుమర్రు గ్రామంలో వారి మేనమామల ఇంట్లో పుట్టారు. వీరి తండ్రిగారి పేరు హనుమంతరాయుడు గారు, తల్లి గారి పేరు శ్రీమతి వెంకటరత్నమ్మ గారు. తాతగారి పేరు అడవి వెంకటాచలం గారు(తల్లి గారి తండ్రి ). వీరి బాల్యం, ఎలిమెంటరీ విద్యాభ్యాసం అక్కడే పూర్తిచేసారు. 12 సంవత్సరాలకే లోయర్ సెకండరీ విద్య పూర్తిచేసి, కారణాంతరాలవల్ల బందరులో హైస్కూలు విద్యను పూర్తిచేసి, 19ఏండ్ల ప్రాయంలోనే యుద్ధంలో చేరాలనే కోరికతో బొంబాయి వెళ్ళి సైన్యంలో చేరి ఆఫ్రికాకు వెళ్ళారు.

అక్కడ గాంధీ గారిని కలవడం, ఆయన విధానాల పట్ల ఆకర్షితులు కావడం వలన  స్వదేశం గురించిన ఆలోచనలు పెరిగాయి. ఆఫ్రికానుండి తిరిగి వస్తూ దారిలో అరేబియా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలను కూడా సందర్శించి తిరిగి స్వదేశానికి చేరారు. మద్రాసులో అప్పట్లో ప్లేగు వ్యాధి ప్రబలటంతో వ్యాధి నివారణాధికారిగా పనిచేసారు. ఆ తరువాత రైల్వే గార్డుగా కూడా కొంతకాలం పనిచేసారు. అయితే, ఆయనకు ఉద్యోగంపై ఆసక్తి లేకపోవటం వలన, శ్రీలంకలోని కొలంబోలో 'సిటీ కాలేజి'లో రాజకీయ, ఆర్థిక శాస్త్రాలను అభ్యసించారు. దేశభక్తిగల వెంకయ్యగారు 1906లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో పాల్గొని ఆనాటి సభాధ్యక్షులు అయిన దాదాభాయి నౌరోజీ గారి మన్ననలను పొంది, కాంగ్రెస్ విధాన నిర్ణయసభ సభ్యునిగా గుర్తింపు పొందారు. అక్కడ కలిసిన మునగాల రాజా దృష్టిని ఆకర్షించిన ఆయన, వారి ఆహ్వానంమీద మునగాల సంస్థానంలో చేరారు.

అక్కడ వ్యవసాయం మీద ఆసక్తితో పనిచేయటమే కాకుండా, రాజావారి కోరిక మేరకు ఎంతో జిజ్ఞాస, పట్టుదలతో పరిశోధనలు జరిపి 'వ్యవసాయ శాస్త్రం' అనే గ్రంధాన్ని ప్రజలకు అందించారు. మునగాలలో ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. ఆకాలంలోనే గాంధీగారు ఖాధీ ఉద్యమాన్ని చేపట్టడంతో, వెంకయ్యగారు అమెరికా నుండి ప్రత్తి గింజలను తెప్పించి ఇక్కడ గింజలతో సంయోగం జరిపి ప్రాక్టికల్‌ గా వారు సన్ననూలునిచ్చే ప్రత్తిని పండించి, దేశ సౌభాగ్యానికి తోడ్పడ్డారు. వారి కార్యదక్షత, పరిశీలనాదృష్టి, పట్టుదలతో తెలివిగా ఆలోచనలు చేసి ఫలితాన్ని సాధించటం, వారి తపన నుండి ఈతరం ఎంతగానో స్ఫూర్తి పొందాలి. అందుకే ఆయన్ని'ప్రత్తి వెంకయ్య' అని పిలిచారట. ఆ రోజుల్లో వారికి లండన్‌ లోని 'రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ' వారు సభ్యత్వం ఇచ్చి గౌరవించారు.

బందరులో శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు, కోపల్లె హనుమంతరావు గారు, వీరి ప్రతిభా విశేషాలను గుర్తించి జాతీయ కళాశాలలో అధ్యాపకుడి స్థానాన్నిచ్చి గౌరవించారు. వారికి అంతర్జాతీయ దృష్టి ఉందనటానికి ఒక నిదర్శనం-చైనాలో 'సన్‌యట్‌సెన్' అనే ఆయన సాధించిన రాజకీయ విప్లవం. ఆ విప్లవ చరిత్రను రహస్యంగా సేకరించి వారి పేరన ఒక గ్రంధాన్ని వ్రాసి చైనా, మనదేశం మీదకు దండయాత్ర చేస్తుందనీ, దలైలామా మనదేశానికి వస్తారని చెప్పారట వెంకయ్యగారు. వారి మేథాసంపత్తి నుండి మనం ఎంతైనా నేర్చుకోవాల్సివుంది. అందుకే ఆయనను 'రాజకీయ ద్రష్ట' గా అభివర్ణించారు ఆనాటి పెద్దలు.

1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సభలలో ఇంగ్లీషు వారిని ఒక పక్క మన దేశాన్ని వదలి పొమ్మంటూనే మరొకపక్క వారి జెండాను ఉపయోగించడం పింగళి వెంకయ్యగారిలో సరికొత్త ఆలోచనకు నాందీ పలికింది. మనకంటూ ఒక జెండా కావలనే తపనతో 'భారతదేశ జాతీయ పతాకం' అనే గ్రంధాన్నిఆయన  1916లో మనకు అందించారు. వారిని 'జెండా వెంకయ్య' గా పిలిచారట అప్పుడు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్నిగురించి చెప్పాలి. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో,చాలాకాలం మన వారు బ్రిటిష్ దేశపు 'యూనియన్ జాక్'నే ఎగురవేసే వారు. ఇది, సహేతుకంగా లేదని వాదించి, గాంధీ గారి కోరిక మీద జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన తెలుగు తేజం శ్రీ పింగళి వెంకయ్య గారు.1921 మార్చి 31, ఏప్రియల్ 1 వ తేదీలలో బెజవాడలోని గాంధీనగరంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహాసభలలో శాంతి సౌభాగ్యాలకు చిహ్నంగా మూడు రంగులతో, మన జాతీయ జెండా గాంధీజీ సమక్షంలో ఏకగ్రీవంగా కరతాళ ధ్వనులమధ్య ఆమోదించబడింది.

మెదట పతాకం మధ్యలో రాట్నం ఉన్నా, తరువాత పెద్దలు ధర్మానికి గుర్తుగా అశోక చక్రంతో మన జాతీయ జెండాను శ్రీ వెంకయ్య గారి కోరిక మేరకు మార్పు చేసారు. ఆ పతాకమే, పింగళి వెంకయ్యగారి గుర్తుగా భారత దేశపు గగనాన విహరిస్తూ మన అందరికీ 'భారతదేశం మనది' అనే స్పూర్తినిచ్చింది. ఇంతటి విశిష్టమైన వ్యక్తి చివరిదశలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించి, నిరాడంబరంగా 1963 జూలై 4న దివికేగారు! కీర్తిశేషులైనారు!! తన జీవితాన్నిఅంతా ప్రజలకు అంకితమిచ్చిన ఈ మహనీయుని జీవితాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తలచుకోవటం ఎంతో సమంజసం! జాతీయపతాక నిర్మాతను 'భారతరత్న' బిరుదుతో సత్కరించక పోవటం, స్వాతంత్ర్య సమరయోధుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష వైఖరిగా కనిపిస్తుంది! ప్రభుత్వం కనీసం ఆ దిశగా ప్రయత్నం చేసి, ఆ మహనీయుని 'భారతరత్న' బిరుదుతో సత్కరించి, పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వారి శిలా విగ్రహం ప్రతిష్టించటమనేది ప్రభుత్వం చేపట్టవలసిన తక్షణ కర్తవ్యం! ఆయన పేరు మీద గణనీయంగా స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయటం ఎంతైనా అవసరం. ముందు తరాల వారికి వారిని గురించి తెలియచేయటం కోసం, విద్యార్ధులకు వారి జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలి. ఆ నిస్వార్ధ సేవకునికి, దేశభక్తునికి మన వంతుగా ఘనమైన నివాళి సమర్పించుకుందాం!!

దేశమాత కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహామనిషి శ్రీ వెంకయ్య గారు!

మరిన్ని శీర్షికలు
Weekly Horoscope(August 09 - August 15)