Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Swamy Vivekananda

ఈ సంచికలో >> శీర్షికలు >>

అన్నమయ్య 'పద' సేవ - డా. తాడేపల్లి పతంజలి

annamayya pada seva

015. అయమేవ అయమేవ ఆదిపురుషో

అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

01.అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో
ప్యయమేవ వటదళాగ్రాధి శయనః
అయమేవ దశవిధైరవతార రూపైశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి

02.అయమేవ సతతం శ్రియఃపతిర్దేవేషు
అయమేవ దుష్ట దైత్యాంతకస్తు
అయమేవ సకల భూతాంత రేష్వాక్రమ్య
ప్రియభక్త పోషణం ప్రీత్యా తోతి

03.అయమేవ శ్రీ వేంకటాద్రౌ విరాజతే
అయమేవ వరదోపి యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
ప్యయమేవ వైకుంఠాధీశ్వరస్తు (4-313)

తాత్పర్యము
ఇతడే ఇతడే (ఈ మహావిష్ణువే) సృష్టిలో మొదటి పురుషుడు. జయాన్ని ఇచ్చే అతనిని నేను శరణు కోరుచున్నాను.

1.ఇతడే పూర్వం భూమిని మోసిన వాడు. ఇతడే మర్రి ఆకు మీద పడుకొన్నవాడు. ఇతడే దశావతారాలు ధరించి , నీతి మార్గములో భూమిని , ప్రజలను రక్షించుచున్నాడు.

2.ఇతడే ఎప్పుడు దేవతలలో లక్ష్మీ పతి. ఇతడే దుష్టులైన రాక్షసులను అంతము చేసినవాడు. ఇతడే అన్ని రకాలైన జీవులలో అంతర్యామిగా ఉండి ప్రేమతో తన ప్రియ భక్తులను పోషించుచున్నాడు.

3. ఇతడే వేంకటాద్రి పర్వతంలో ప్రకాశించుచున్నాడు.  ఇతడే యాచకులకు వరములిచ్చు శ్రేష్ఠుడు. ఇతడే వేద వేదాంతములలో సూచింపబడినవాడు. ఇతడే(ఈ మహావిష్ణువే) వైకుంఠానికి అధిపతి.

విశేషాలు

ఏవ
ఏవ అంటే 'ఏ 'అని తెలుగులో అర్థం. అయమేవ అంటే 'ఇతడే' అని అర్థం. అంటే ఆది పురుషుడని ఇంకొకరిని , ఇంకొకరిని చెప్పకు. శ్రీ మహావిష్ణువే ఆదిపురుషుడు ; మిగతావాళ్లు కాదు అని చెప్పటానికి 'ఏవ' అని అన్నమయ్య వాడాడు. ఈ 'ఏవ' మీద ఒక అందమైన కథ ప్రచారంలో ఉంది.

భవభూతి అనే కవి తన ఉత్తర రామ చరిత కావ్యాన్ని కాళిదాసు దగ్గర ఒక దూత ద్వారా వినిపించాడట. దూత వినిపిస్తున్నంతసేపు కాళిదాసు చదరంగం ఆడుతున్నాడట. తను పంపిన దూత తిరిగి రాగానే భవభూతి 'కాళిదాసు ఏమన్నాడు?' అని అడిగాడు. అంటే ఏమన్నా పొగిడాడేమో అని భవభూతి ఆతృత.

"నేను కావ్యం వినిపిస్తున్నంతసేపు కాళిదాసు చదరంగం ఆడుతున్నారండి. ఆ ఆట మధ్యలో
'కిమపి కిమపి మందం మందమాసక్తి యోగా
దవిరళిత కపోలం జల్పతో రక్రమేణ
అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్'
(రాముడు ఒక చేతితో సీతను, సీతయు ఒక చేతితో రాముని మాటి మాటికి జారిపోనీయకుండా కౌగిలించుకొనుచున్నారు. ఒకరి చెక్కిలికి, మరొక చెక్కిలికి మధ్య దూరం లేకుండా పోయింది. మెల్లమెల్లగా వారు ఏమోమో మాటలాడుకొంటూనే ఉన్నారు. వారి మాటలు ముగియలేదు. రాత్రి ఈవిధంగా గడచిపోయింది.) అనేశ్లోకం వినిపిస్తున్నప్పుడు ఒక సేవకురాలు కాళిదాసుకి తమలపాకులు, వక్క, సున్నం తెచ్చి ఇచ్చింది. ఆయన వాటితో తాంబూలం వేసికొని, 'అబ్బ! సున్నం ఎక్కువయ్యింది! అన్నాడు, అంతే!' అంతకుమించి మీకావ్యం గురించి ఒక్క మాట అనలేదు" అని దూత జవాబిచ్చాడు. తను 'ఏవం' అని సున్న ఎక్కువ రాసానని, అందుకే కాళిదాసు సున్నం ఎక్కువయిందని అన్నాడని భవభూతి గ్రహించి, 'ఏవం' ను 'ఏవ' గా మార్చాడట. ఏవ అని మార్చటం వలన రాత్రియే గడిచిపోయింది అని అర్థం వచ్చింది. అంటే ఎలా గడిచిందో తెలియకుండా తెల్లవారింది అని అర్థం. ఏవం అంటే ఈ అద్భుతమైన అర్థం రాదు. ఏవ అంటేనే వస్తుంది.

బ్రహ్మర్షి పత్రిజీ సేవ అనే పదంలో స, ఏవ అని రెండు పదాలున్నాయని చమత్కరించారు. స అంటే అతడు లేక అది, ఏవ అంటే మాత్రమే. ( ఉన్నదంతా అతదు మాత్రమే )నేను అనేది లేకుండా చేసేదంతా సేవ. ఉన్నదంతా అతడే- ఆ దేవుడే అని భావించాలి. తమను తాము జీరో చేసుకోవాలి. ఇంత అర్థాన్ని సేవ అనే పదం ఇస్తుందని వారి భావన.

జయాన్ని ఇచ్చే అతనిని నేను శరణు కోరుచున్నాను
జయమంటే ఆధాత్మిక విజయం. ఇంద్రియాలమీద విజయం. ఇంద్రియాలకు తాను లొంగకుండా , తను ఇంద్రియాలను లొంగదీసుకోవడం. ఈ విజయాన్ని ప్రసాదించేవాడు మహావిష్ణువు. అందుకని విజయాన్ని ఇచ్చే అతనిని శరణు కోరుచున్నాను అని అన్నమయ్య భావన.

అవనీధర
వరాహావతారంలో భూమిని విష్ణు మూర్తి ధరించాడు.అందుకే అవనీధరుడయ్యాడు.

"ఓ విష్ణుమూర్తీ! వరాహావతారం ధరించి మహా భీకరాకారుడవై శరీరాన్ని విపరీతంగా పెంచి నీ ముట్టెతో ప్రళయసముద్రంలోని నీటిని పెళ్లగించినప్పుడు అందులోని నీళ్లు పైకి చిమ్మి వంపు తిరిగి మళ్లీ క్రిందపడుతున్నాయి. ఆ దృశ్యం ఎలా ఉందంటే, నువ్వు ప్రకృతియనే స్త్రీకి, బ్రహ్మాండమనే బంగారు ముక్కెరను అలంకరించినట్టు కనిపిస్తుంది" అని రాయలవారు వరహావతారాన్ని వర్ణించారు. ( ఆముక్త మాల్యద) ఈ రాయలవారి వర్ణనతో పొటీ పడేటట్లుగా 'తలకక నేలదవ్వెటిదొంగ' (వీడివొ యిదె వింతదొంగకీర్తన) 'కవగూడ గోరి భూకాంతముంగిటితలపు' (తలపులోపలి తలపు దైవ మితడు కీర్తన) అని వివిధ కీర్తనల్లో వరాహ స్వామిని వర్ణించిన అన్నమయ్య ఈ గీతంలో మాత్రం 'అవనీధర' అని సామాన్యంగా చెప్పాడు.

శ్రియః పతి
శ్రియః అంటే లక్ష్మీ దేవి. ఆవిడకు భర్త శ్రియః పతి.

శ్రీ సూక్తమ్ లో 'యః శుచిః ప్రయతో ...(16 వ మంత్రం …)అని ఉన్నది. ఎవరై తే లక్ష్మీ దేవి దయ కోసం ప్రార్థిస్తున్నారో వారుశుచి గా ఉండాలని చెప్పబడింది.

శుచి అంటే బాహ్యాభ్యంతర శుచిః ఇంటా బయటా శరీరం, మన మనస్సు ఇవన్నీ శుభ్రం గా ఉండాలి.అటువంటి పవిత్రమైన మనస్సుతో కొలిచేవారిని లక్ష్మి అనుగ్రహిస్తుంది. అటువంటి వారిని లక్ష్మీనాథుడు కూడా అనుగ్రహిస్తాడు. ఈ అంతర్గత భావన శ్రియఃపతి శబ్ద ప్రయోగంలో ఉంది.

ఇతడే వేద వేదాంతములలో సూచింపబడినవాడు
దేనిచేత ధర్మాధర్మములను తెలుసుకొంటామో అది వేదము., ఇవి నాల్గు- ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, 1.ఋక్‌వేదము:-, వేదము లన్నిటిలోను పురాతనమైనది, ధ్యానశ్లోకములు ఎక్కువ. 2.సామవేదము:- వేదమంత్రాలకు స్వరాలు కల్పించి గానరూపమును చూపు సంహిత. 3.యజుర్వేదము: - వైదిక తంత్రాలను గురించి చెప్పు సంహిత. 4.అధర్వణవేదము:- ఈ భూత ప్రేత మంత్రములతో చారిత్రక విషయములతో ఉన్న సంహిత.

వేదాలలో విష్ణువు
విష్ణువు, గాయత్రి మొదలయిన ఏడు ఛందస్సులతో భూమిపై పదవిన్యాసము చేసాడు. విష్ణువు పాదధూళితో ఈ సమస్త ప్రపంచం నిండి ఉంది. (ఋగ్వేదం 22వ సూక్తము 16 నుండి 21 వరకు ఉన్న మంత్రాలు) ఇలా వేదాలలో విష్ణువు సూచింపబడ్డాడు.

వేదాంతమునకే ఇంకొక పేరు ఉపనిషత్తు. మొత్తం 108 ఉపనిషత్తులు.

ఉపనిషత్తులు వేదాల చివరి భాగంలో ఉంటాయి గనుక వాటికి వేదాంతములని పేరు. అకారాది వర్ణ క్రమంలో 108 ఉపనిషత్తులు ఇవి. కుండలీకరణములలో అవి ఏవేదములో ఉన్నాయో చెప్పబడ్దాయి. 1. అక్షమాలి కోపనిషత్తు (ఋగ్వే), 2. అక్షి ఉపనిషత్తు(యజు), 3. అథర్వశిఖోపనిషత్తు (అథర్వ), 4. అథర్వశిరోపనిషత్తు (అథర్వ), 5. అద్వయతారకోపనిషత్తు (యజు), 6. అధ్యాత్మోపనిషత్తు (యజు), 7. అన్న పూర్ణోపనిషత్తు (అథ), 8. అమృత బిందూపనిషత్తు (యజు), 9. అమృతనాదో పనిషత్తు (యజు), 10. అరుణోపనిషత్తు (సామ), 11. అవధూతోపనిషత్తు (యజు), 12. అవ్యక్తోపనిషత్తు (సామ), 13. ఆత్మ బోధోపనిషత్తు (ఋగ్వే), 14. ఈశ ఉపనిషత్తు (యజు), 15. ఈశావాస్య ఉపనిషత్తు (యజు), 16. ఏకాక్షరోపనిషత్తు (యజు), 17. ఐతరేయోపనిషత్తు (ఋగ్వే), 18. కఠ రుద్రోపనిషత్తు (యజు), 19. కఠోపనిషత్తు (యజు), 20. కలిసంతరణ ఉపనిషత్తు (యజు), 21. కాలాగ్నిరుద్రో పనిషత్తు (యజు), 22. కుండినోపనిషత్తు (సామ), 23. క్షురికోపనిషత్తు (యజు), 24. కృష్ణో పనిషత్తు (అథర్వ), 25.కేనోపనిషత్తు (సామ), 26. కైవల్యోపనిషత్తు (యజు), 27. కౌషీతకీ బ్రాహ్మణ ఉపనిషత్తు (ఋగ్వే), 28. గణపతి ఉపనిషత్తు (అథ), 29. గర్భోప నిషత్తు (యజు), 30. గారుడోపనిషత్తు (అథ), 31. గోపాల తాపస్యుపనిషత్తు (అథ), 32. ఛాందోగ్యోపనిషత్తు (సామ), 33. జాబా లోపనిషత్తు (యజు), 34. జాబాలి ఉపనిషత్తు (సామ), 35. తారసారోపనిషత్తు (యజు), 36. త్రిపురాతాపస్యుపనిషత్తు (అథ), 37. త్రిపురోపనిషత్తు (ఋగ్వే), 38. త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తు (యజు), 39. తురీయాతీత అవధూత ఉపనిషత్తు (యజు), 40. తేజోబిందూపనిషత్తు (యజు), 41. తైత్తిరీయోపనిషత్తు (యజు), 42. దక్షిణామూర్తి ఉపనిషత్తు (యజు), 43. దత్తాత్రేయోపనిషత్తు (అథ), 44. దర్శనో పనిషత్తు (సామ), 45. దేవీ ఉపనిషత్తు (అథ), 46. ధ్యానబిందు ఉపనిషత్తు (యజు), 47.నాదబిందు ఉపనిషత్తు (ఋగ్వే), 48.నారద పరివ్రాజకోపనిషత్తు (అథ), 49.నారాయణోపనిషత్తు (యజు), 50.నిరాలంబోపనిషత్తు (యజు), 51.నిర్యాణోపనిషత్తు (ఋగ్వే), 52. నృసింహతాపసీయోపనిషత్తు (అథ), 53. పంచబ్రహ్మోపనిషత్తు (యజు), 54. పరబ్రహ్మోపనిషత్తు (అథ), 55. పరమ హంసపరివ్రాజకోపనిషత్తు (అథ), 56. పరమహంసోపనిషత్తు (యజు), 57.ప్రశ్నోపనిషత్తు (అథ), 58. పాశుపత బ్రహ్మోపనిషత్తు (అథ), 59. ప్రాణాగ్నిహోత్రో పనిషత్తు (యజు), 60. పైంగలోపనిషత్తు (యజు), 61. బహ్వనోపనిషత్తు (ఋగ్వే), 62. బృహత్‌ జాబాలోపనిషత్తు (అథ), 63. బృహదారణ్యకోపనిషత్తు (యజు), 64.బ్రహ్మోపనిషత్తు (యజు), 65. బ్రహ్మవిద్యోపనిషత్తు (యజు), 66. బ్రహ్మ జాబాలోపనిషత్తు (ఋగ్వే), 67. భావనోపనిషత్తు (అథ), 68. భిక్షుకోపనిషత్తు (యజు), 69. మహానారాయణోపనిషత్తు (అథ), 70. మహావాక్యోపనిషత్తు (అథ), 71. మహోపనిషత్తు (సామ), 72. మండల బ్రాహ్మణోపనిషత్తు (యజు), 73. మంత్రకో పనిషత్తు (యజు), 74. మాండూక్యోపనిషత్తు (అథ), 75. ముక్తికోపనిషత్తు (యజు), 76. ముద్గలోపనిషత్తు (అథ), 77. ముండకోపనిషత్తు (అథ), 78. మైత్రాయుణ్యపనిషత్తు (యజు), 79. మైత్రేయోపనిషత్తు (యజు), 80. యాజ్ఞవల్క్యోపనిషత్తు (యజు), 81. యోగకుండలి ఉపనిషత్తు (యజు), 82. యోగచూడామణి ఉపనిషత్తు (సామ), 83. యోగతత్త్వోపనిషత్తు (యజు), 84. యోగశిఖోపనిషత్తు (యజు), 85. రామతాపసీయోపనిషత్తు (అథ), 86. రామరహస్యోపనిషత్తు (యజు), 87. రుద్రహృదయోపనిషత్తు (యజు), 88. రుద్రాక్షజాబాలోపనిషత్తు (సామ), 89. వజ్రసూచి ఉపనిషత్తు (సామ), 90. వరాహోపనిషత్తు (యజు), 91. వాసుదేవోపనిషత్తు (యజు), 92. శరభో పనిషత్తు (అథ), 93. శాట్యాయనీయో పనిషత్తు (యజు), 94. శాండిల్యోపనిషత్తు (అథ), 95. శారీరకోపనిషత్తు (యజు), 96. శుక రహస్యోపనిషత్తు (యజు), 97. శ్వేతాశ్వరో పనిషత్తు (యజు), 98. సన్న్యాసోపనిషత్తు (యజు), 99. సర్వసారోపనిషత్తు (యజు), 100. స్కందోపనిషత్తు (యజు), 101. సరస్వతీ రహస్యోపనిషత్తు (యజు), 102. సావిత్రి ఉపనిషత్తు (సామ), 103. సీతోపనిషత్తు (అథ), 104. సుబాలో పనిషత్తు(యజు), 105. సూర్యోపనిషత్తు (ఋగ్వే), 106. సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్తు (ఋగ్వే), 107. హయగ్రీవోపనిషత్తు (ఋగ్వే), 108. హంసోపనిషత్తు (యజు).

వీటిలో ఈశావాస్యము, కేనము, కఠవల్లి, ప్రశ్న, ముండకము, మాండూక్యము, తైత్తిరీయము, ఐతరేయము, ఛాందోగ్యము, బృహదారణ్యము అను పది ప్రసిద్ధమైన ఉపనిషత్తులు. వీటన్నింటిలోను పేర్లు మార్పుతో ఉన్నప్పటికి, అన్నీ శ్రీ మహావిష్ణువునే చెప్పాయని 'అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో' అంటూ అన్నమయ్య తీర్మానం. అలాగే అంటూ ఈ గీతం చివరిలొ చెప్పిన అస్తు (అగుగాక) అను పదాన్ని మనం కూడ పలుకుదాం. స్వస్తి.

మరిన్ని శీర్షికలు
pingali venkayya