Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chirugu machcha maraka

ఈ సంచికలో >> శీర్షికలు >>

తులసిని ఎందుకు పూజిస్తాము - గుమ్మా రామలింగ స్వామి

thulasi pooja

మనందరి ఇళ్ళల్లో ముందు ఆవరణలో గాని, పెరటి ఆవరణలో గాని తులసిమొక్కను పెంచడం సర్వ సామాన్యం. హిందువులందరి ఇళ్ళల్లో ఈ తులసికి ప్రత్యేక స్థానం కలదు. నేటి జీవన సరళిలోనూ నగరాలలో బహుళ అంతస్తుల భవనాలలో చిన్నవయినా ఒకటి రెండు తులసి మొక్కలు పెంచడం చూస్తున్నాము.

ప్రతీ గృహిణి రోజూ తులసి మొక్కలకు నీరుపొసి దీపారాధన, నైవేద్యము, హారతి మొదలగు సకల పూజా విధాననాలను జరుపించడం చూస్తున్నాము ఈ తులసి మొక్కలకు ఇంత ప్రాధాన్యత ఎందుకు?

సంస్క్రుతంలో "తులనా నాస్తి అత్భైవ తులసి" అన్నారు తులసికి సాటియైనది మరొకటి లేదు. ఈ తులసి కాండము ఆకులు పువ్వులు గింజలు చివరకు తులసి మొక్కను పెంచుచున్న మట్టి అన్నియూ పూజనీయమే. మనము నిత్యమూ భుజించు అన్నమును ముందుగా భగవంతునుకి నైవేద్యముగా సమర్పించి అందులో రెండు తులసి ఆకులు వేసి తరువాత ఆ భోజన పదార్ధాలను భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తాము. ఇది శ్రీ మహావిష్ణువు అతని అవతారములయిన ఇతర దేవతల పండుగలలో ఈ విధముగా ప్రసాదము స్వీకరించుట పరిపాటియే. విష్ణు పూజకు తులసి దళములు ప్రధానముగా చెప్పబడినవి. సామాన్యముగా పుజానంతరము మరునాడు ఆకులు, పువ్వులు అన్నీ తీసివేసి వాటిని మరల ఉపయోగించరు. కానీ ఈ తులసి దళములు మాత్రము శుభ్రము చేసి మరల ఉపయోగించుటకు పనికి వచ్చునని శాస్త్రమున చెప్పిరి. ఈ తులసికి అంతటి ప్రాధాన్యత కలదు.

ఇక్కడ ఒక పురాణ గాధ చెప్పుకోవలెను. ఈ తులసి స్వర్గవాసియైన శంఖచూడుని భార్య అనియూ, శ్రీ కృష్ణుడు మాయోపాయముచెత పాపము చేయించె ననియూ, అందులకామె శ్రీ కృష్ణుని సాలిగ్రామమము కమ్మని శపించెననియూ, ఆమె తపోనిష్టకు భక్తికి మెచ్చి ఆమెను తులసి కమ్మని వరమిచ్చి, తన అరాధనలో ప్రముఖమయిన పూజా ద్రవ్యముగా అనుగ్రహించి వరమిచ్చెను. ఇదీ సూక్ష్మముగా ఆకధ.

ఈ తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించు ఆచారము కలదు. నూతన దంపతులు ఈ తులసిని పూజించిన సకల సౌభాగ్యములు కలుగునని ఆ పరమాత్మ తులసిమాతకు వరమిచ్చినట్టు గూడా గాథలు కలవు. సత్యభామ సకల ఐశ్వర్యములూ తనవద్దనే ఉన్నవన్న అహంకారముతో ఉన్నపుడు భక్తియే ప్రధానమని సంపదలు కాదని తెలియచేయు కథ శ్రీకృష్ణతులాభారము. సత్యభామ సకల ఐశ్వర్యములు ధారబోసిననూ తూగని పరమాత్మ, భక్తితో నిత్యమూ పూజించు ఒక్క తులసి దళముచే సరితూచిన రుక్మిణీ కథ అందరకూ తెలిసినదే.

ఈ తులసి ఆకులకు ఔషధ గుణములు అధికముగా కలవు. శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమగుటకు ఈ ఆకులను నమిలినా, రసము తీసి సేవించినా మంచి గుణము కనుపించును. ఇట్టి మహా మహిమాన్యితమయిన ఈ తులసి ప్రాధాన్యత హిందువుల ఆచార వ్యవహారములందు అపారము అద్వితీయము.

మరిన్ని శీర్షికలు
patience