Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Tips for writers

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

పెద్దమ్మ: అల్లసాని వారికి తాంబూలం అందించావుగా? ఇంకా ఇదెవ్వరికీ?
ముద్దుగుమ్మ: ఆయనగారు తాంబూలం సేవించి పద్యాలు వల్లించి వెళ్ళిపోయారు! ఆ పద్యాలని రాయడానికి ఆయన శిష్యుడు గారు, తాంబూలం చుట్టివ్వమని అడుగుతున్నారు!! లేక పోతే రాయరట!!!
 


పవన మహర్షి: నిన్ను సాక్షాత్కరించుకోవడానికి, నేను వెయ్యేళ్ళు తపస్సు చేస్తాను. నా ప్రాణ త్యాగం చేస్తాను! నువ్వెలా ప్రత్యక్షమవవో చూస్తాను!! ఇదే నా ప్రతిజ్ఞ!!
అశరీరవాణి: నాయనా, అదంతా అనవసరం! నీ అహంకారాన్ని మాను! మరుసటి క్షణం నీ ముందుంటా!!

నారదుల వారు: ద్వారపాలకా, స్వామి వారెక్కడ?
ద్వారపాలకుడు: 'అలవైకుంఠపురములో.. నగరిలో.. ఆ మూల.. సౌధంబు దాపల..  '
నారదుల వారు: ఆపవయ్యా బాబు.. పోతన గారు చెప్పారులే..  
ద్వారపాలకుడు: తెలుసుగా.. మరి నన్నడగడం దేనికీ?

నర్సింహా రెడ్డి: అర్జునుడు, ద్రౌపది, శ్రీకృష్ణుల మేను నల్లకలువ ఛాయట!
చంద్రశేఖరనాయుడు: శ్రీకృష్ణుడు నల్లని వాడు! అది తెలుసు! తక్కిన ఇద్దరూ నల్లగా ఉంటారని తెలియదే! టీవీలో, సినిమాల్లో చూళ్ళేదే? ఎవరు చెప్పారు?
న.రె. : చాగంటి కోటేశ్వరరావు గారు!!
 చం. నా. : అయితే నమ్మాల్సిందే!!

లంక రాక్షసుడు - 304: రావణుల వారి శరీరమంత రక్తసిక్తం?
లంక రాక్షసుడు - 441: ఏదో పక్షి, తన కాలి గోళ్ళతో రక్కిందట! ఒళ్ళంతా... గాట్లు 
లంక రాక్షసుడు - 304: కారణం?
లంక రాక్షసుడు - 441: రావణుల వారు ఎవర్నో అపహరించి తీసుకు వచ్చారట! అదంతా మనకెందుగ్గానీ, నోర్మూసుకు గప్ చిప్ మని, నీ పని చూసుకో పో!! 

పృచ్ఛకులలో ఒకరు : అష్టావధాని గారేరీ? వున్నట్లుండి, కనిపించలేదు?
మరొకరు : భార్య మీద, వ్యంగ్య కవిత, పాడ మన్నాం కదా!
ఇంకొకరు : పాడారు కదా? మరీ...?
ఇంకో మరొకరు : సభలో, ఆయనగారి భార్య, వుండడం చూశారు!!

 


చిన్నమయి: ఘటోత్కచుడు వారు, ఫలహార పళ్ళేలన్నీ దగ్గరకు లాక్కుని చూసి, ఏ ఒక్కటీ, ముట్టుకోకుండా, తినకుండా, లేచిపోయారా?
లంబు: అచె చర్యం... అచె చర్యం...
జంబు: ఎహె! ఊరుకో!! అందులో గోంగూర లేదంట!!


అప్పాజీ: ఈ బాల కవీంద్రుడు, సకల గ్రంథములకు, మూలకారణమైన గ్రంధము చదివినాడట!!
శ్రీ కృష్ణదేవరాయలు: బాల కవీంద్రా? ఏమాగ్రంధము? విశదీకరించుము?
బాల కవీంద్రుడు: పెద్ద బాలశిక్ష మహారాజా!!


స్నేహితుడు: పట్టపేనుగు నీ మెళ్ళో దండవేసింది! ఈ రాజ్య పాలకుడివి కాబోతున్నావ్! సంతోషించక, దిగులుగా వున్నావేం?
యువకుడు: ఒక షరతు పెట్టారుగా?
స్నేహితుడు: ఏమిటా షరతు?
యువకుడు: రాకుమారిని పెళ్ళి చేసుకోవాలని!
స్నేహితుడు: మరింకేం? మరింత సంతోషించక?
యువకుడు: రాకుమారి, పట్టపేనుగు, ఆకారంలో వుంటుంది! అదీ నా బాధ!


దుశ్శాసనుడి భార్య: ఏవండీ... నేను చీర మార్చుకోవాలి, మీరు అంతఃపురం వదిలి, అవతలి కెళ్ళండి!!
దుశ్శాసనుడు: అంతఃపురం నుంచే వెళ్ళాలా? ఆ సంఘటన తర్వాత, నా భార్య కూడా, నన్నవహేళన పాలు చేస్తున్నదే... హతవిధీ!!

మరిన్ని శీర్షికలు
Kaakoolu by Sairam Akundi