Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview - Telugu Short Film

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

Swamy Vivekananda

ఆ గ్రంధాలయాధికారి మధ్య మధ్య పేజీలు  త్రిప్పుతూ, కొన్ని ప్రశ్నలు వేశాడు. నరేంద్రుడు అన్నింటినీ తడుముకోకుండా సమాధానాలు ఇవ్వటమే కాకుండా, దాని గురించి వివరంగా చెప్పాడు. అతనికి ఆశ్చర్యం వేసి, "ఈ పుస్తకాన్ని నిజంగానే నువ్వు పూర్తి చేసావు, కానీ, రోజూ తీసుకువెళ్తున్న వాటిని కూడా ఇలాగే చదువుతున్నావా అని అడిగాడు. అవును. అనుమానంగా వుంటే మీరు అందులోంచి కూడా ప్రశ్నలు అడగవచ్చి అని చెప్పాడు నరేంద్రుడు విశ్వాసంగా.

ఆ లైబ్రేరియన్ "ఒక రోజులో ఇంత పెద్ద పుస్తకం పూర్తి చేయటం మామూలు విషయం కాదు. కానీ, నీకు ఇదెలా సాధ్యమైనది? అని అడిగాడు. దానికి నరేంద్రుడు "పుస్తకాన్ని అందరూ చదువుతారు. కానీ నేను చదవను, ప్రతి అక్షరాన్ని లోతుగా చూస్తాను. ధ్యాస అంతా అందులో వున్నప్పుడు, వేరే ఆలోచన ఏదీ లేనప్పుడు, మనం చూసే ప్రతి అక్షరం సూటిగా మనల్ని తాకి, మనసులోనే వుండిపోతుంది. చదవటమే కాదు, చేసే ఏ పనైనా, శ్రద్ధ ఉన్నప్పుడు, ఆటంకం ఉన్నా అది కష్టం కాదు. దేనికైనా శ్రద్ధే ముఖ్యం" అని చెప్పి కొత్త పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అతని గొప్పతనం, అతని విశ్వాసంలోనే  ఉంది అనుకుని, వెళ్తూ ఉన్న నరేంద్రుడ్ని చూస్తూ ఉండిపోయాడు ఆ గ్రంధాలయాధికారి. అప్పట్నించి కొత్త పుస్తకాలు ఇవ్వటమే కాదు, ప్రత్యేకించి కొన్ని పుస్తకాలను నరేంద్రుని కోసం తెప్పించేవాడు కూడా. ఇది నరేంద్రుని మహత్తర జ్ఞాపకశక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ గ్రంధపఠనం వల్లనే అతనికి ప్రపంచ చరిత్ర అంతా మంచి నీళ్ళ ప్రాయమైంది. క్రమంగా ఈ పుస్తక పఠనం వల్ల అతనికి ఆంగ్ల భాషలో కూడా ప్రావీణ్యం ఏర్పడింది. గంభీరోపన్యాసానికి - వ్యాసరచనకూ, నరేంద్రునకెవరూ సాటిరాలేరని కళాశాల ఉపాధ్యాయులు, తోటి విధ్యార్ధులూ, ఇతర ప్రముఖులూ కూడా మెచ్చుకునేవారు.

అతని ప్రతిభా విశేషాలను తెలుసుకున్న చాలా మంది ప్రముఖులు, తమ కుమార్తెలను నరేంద్రున కిచ్చి వివాహం చేయాలని, విశ్వనాథుని వద్దకు వచ్చేవారు. నరేంద్రుడు ఇంగ్లాండ్ వెళ్లి, వి.పి.యస్ చదవటానికి అవసరమైనంత కట్నం ఇస్తామని కూడా ఎందరో వచ్చేవారు. విశ్వనాథుడు తన కుమారుని వివాహం చేసుకొమ్మని బలవంత పెట్టసాగాడు. కానీ నరేంద్రుడు అందుకు అంగీకరించలేదు. అతని దృష్టి ఎంతసేపు ధ్యానం మీద, పరమేశ్వరుని సందర్శనం మీద లగ్నమై ఉండేది. ఈ కోరికను నెరవేర్చుకునేందుకు అతను బ్రహ్మ సమాజంలో చేరి ఆ కార్యక్రమాలలో పాల్గొనేవాడు. కానీ ఆ సమాజము అతని ఆశయసిద్ధికి తోడ్పడలేకపోయింది.

ఎలాగైనా భగవంతుని దర్శించాలి. ఇదే అతని పరమ లక్ష్యం. దీని కొరకు అతడు ఎంత తపించినా ఎందరు మహానుభావుల్ని సందర్శించినా దారి దొరకలేదు.

నరేంద్రుడు, రామకృష్ణుని వద్దకు చేరుట
సర్వసంగ పరిత్యాగియై నిర్వికల్ప సమాధిని సులభసాధ్యం గావించుకున్న ఆ మహనీయుని దర్శించి, ఆయన మహోపదేశాలను వినటం కోసం, దేశం నలుమూలల నుండీ వేలాది ప్రజలు వచ్చేవారు.

రామకృష్ణుని ప్రతిభా విశేషాలను విన్న నరేంద్రుడు, తన లక్ష్యసిద్ధికి ఆ మహనీయుడు తోడ్పడగలడేమోనన్న ఆశతో రామకృష్ణుని దర్శించటానికి ఆయన నివసిస్తున్న 'దక్షిణేశ్వరం' వెళ్లాడు.

నరేంద్రుని చూడగానే రామకృష్ణునికి ఏదో తెలియని ఆనందం కలిగింది. అతని రూపంలో ఏదో ఒక దివ్యతేజస్సు రామకృష్ణుని ఆకర్షించింది. దానికి తోడు నరేంద్రుని మధురగానం వినగానే రామకృష్ణుడు పట్టరాని సంతోషముతో పిచ్చివానివలె ప్రవర్తించసాగాడు. అది చూసి నరేంద్రునకు ఆశ్చర్యం కలిగింది. రామకృష్ణ పరమహంస నిజంగా దివ్య పురుషుడేనా? లేక పిచ్చివాడా? అని అతనికి అనుమానం వచ్చింది. అప్పుడు నరేంద్రుడు, రామకృష్ణుని దగ్గరగా వెళ్ళి, "మీరు దేవుని సందర్శించారా?" అని ప్రశ్నించాడు. పరమహంస వెంటనే "చూశాను, చూస్తున్నాను. నిన్ను చూస్తున్నట్లే భగవంతుని కూడా చూస్తున్నాను. మనం దేవుని దర్శించవచ్చు. ఆయనతో మాట్లాడవచ్చు. అయితే, ధనం కోసమో, భోగభాగ్యాల కోసమో, సంతానం కోసమో తాపత్రయపడేవారే గాని, పరమాత్ముని కోసం పరితపించే వారెక్కడున్నారు. నిజంగా పరితపిస్తే తప్పకుండా భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు" అని సమాధానమిచ్చాడు. రామకృష్ణుని చేష్టలను బట్టి అతడొక పిచ్చివాడుగా కనిపించడం వల్ల, అతని మాటలను కూడా నరేంద్రుడు నమ్మలేకపోయాడు. అందువల్ల తిరిగి దర్శనం చేస్తానని చెప్పి రామకృష్ణుని వద్ద సెలవు తీసుకుని, నరేంద్రుడు తిరిగి ఇంటికి వచ్చేశాడు.

పరిపూర్ణ ఆత్మస్వరూపుడైన శ్రీ తోతాపురి, శ్రీ రామకృష్ణుల గురువు గారు. ఆయన దక్షిణేశ్వరంలో ఉండేవారు. శ్రీ తోతాపురి ధుని (పవిత్రాగ్ని)ని పూజించేవారు. ఒకసారి ఆయన ధునికి సమీపంలో కూర్చుని, శ్రీ రామకృష్ణులతో ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తున్నారు.
దారినపోయే ఒక వ్యక్తి చుట్ట ముట్టించుకోవటానికి నిప్పుకోసం వెదుకుతూ వచ్చి, ధుని నుంచి ఒక చిన్న కట్టె ముక్క తీసుకున్నాడు. ఇది చూసి తోతాపురికి తీవ్రమైన కోపం వచ్చింది. ఆ వ్యక్తిని మందలిస్తూ కొట్టాలనుకున్నారు. ఆయనను వారిస్తూ చిరుమందహాసంతో శ్రీ రామకృష్ణులు బ్రహ్మ స్వరూపాన్నే సర్వత్రా దర్శించే తోతాపురి వంటి తత్త్వవేత్తకు అంతటి క్రోధం తగదని అన్నారు.

(... ఇంకా వుంది)

మరిన్ని శీర్షికలు
annamayya pada seva