Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష : అంతకు ముందు - ఆ తరవాత

Movie Review - Antaku Mundu - Aa Taravata

చిత్రం: అంతకుముందు ఆ తరువాత
తారాగణం: సుమంత్ అశ్విన్, ఈషా, రావు రమేష్, రోహిణి, రవిబాబు, మధు, శ్రీనివాస్ అవసరాల, ఝాన్సీ, తాగుబోతు రమేష్, సొహైల్ తదితరులు.
ఛాయాగ్రహణం: పి.జి. విందా
సంగీతం: కళ్యాణి కోడూరి
నిర్మాణం: శ్రీ రంజిత్ మూవీస్
నిర్మాత: దామోదర్ ప్రసాద్
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
విడుదల తేదీ: 23 ఆగస్ట్ 2013

విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను చాటుకునే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తోన్న సినిమా అనగానే తెలుగు సినీ పరిశ్రమలో అందరూ ఈ సినిమా కోసం ఎదురు చూసేంత ఆసక్తి నెలకొంది. ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై బాగానే ఆసక్తి నెలకొంది. ఓ వెరైటీ టైటిల్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా!

క్లుప్తంగా చెప్పాలంటే:
ఎంబీఏ పూర్తి చేసిన రాజమండ్రి కుర్రాడు అనిల్ (సుమంత్ అశ్విన్), హైద్రాబాదీ అమ్మాయి అనన్య (ఈషా) మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే సరైన అవగాహన లేక తమ కుటుంబాలు పడ్డ అవస్తలు తమ జీవితంలోకి రాకూడదని, ఇద్దరూ ఓ అవగాహనకి వచ్చాక ఒక్కటవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన ఇబ్బందులేమిటి? వాటిని వీరిద్దరూ అధిగమించి ఒక్కటయ్యారా? అన్నవి
తెలియాలంటే థియేటర్కి వెళ్ళాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే:
హీరోగా సుమంత్ అశ్విన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. అతని నటనలో చాలా ఈజ్ వుంది. పాత్రకు తగ్గ నటనను ప్రదర్శించాడు. అతని నటనకు మంచి మార్కులు పడ్తాయి. మోడ్రన్ ఆలోచనల్నీ, సంప్రదాయ పద్ధతుల్నీ కలగలిపిన పాత్రకు కొత్త నటి అయినా ఇషా పూర్తిగా న్యాయం చేసింది. ఆమె పదహారణాల తెలుగందం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. హీరో తల్లిదండ్రులుగా రావు రమేష్, రోహిణి తమ పాత్రలో ఒదిగిపోయారు. చాన్నాళ్ళ తర్వాత తెలుగు తెరపై కన్పించిన మధుబాల, హీరోయిన్ తల్లిగా ఆకట్టుకుంటుంది. రవిబాబు ఓకే. శ్రీనివాస్ అవసరాల పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకుంటాడు. మిగతావారంతా కథాగమనంలో తమ పని తాము చేసుకుపోయారు.

సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఆకట్టుకునే సంభాషణలు సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. స్క్రీన్ప్లే పరంగానూ మంచి స్కోర్ చేస్తుందీ సినిమా. సెన్సిబుల్ స్టోరీని దర్శకుడు చాలా చక్కగా డీల్ చేశాడు. అతనికి మ్యూజిక్ నుంచి, కెమెరా పనితనం దాకా.. అన్ని విభాగాలూ సహకరించాయి. అన్ని విభాగాల సహకారాన్నీ పొందడం నిజంగా దర్శకుడి గొప్పతనమే. క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలూ సినిమాలో వున్నాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే: అంతకుముందు ఆ తర్వాత ఆహ్లాదంగానే వుంది.

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
Interview with SreeMani