ఆరు పలకల బాడీ. అదే సిక్స్ ప్యాక్. అదుంటే ఆ మజానే వేరప్పా. అందుకే మన కుర్రహీరోలు ఈ ఆరు పలకల బాడీ కోసం ఒళ్లు హూనం చేసుకుని మరీ కసరత్తులు చేసేస్తున్నారు. ఈ సిక్స్ ప్యాక్ బాడీని మన టాలీవుడ్ దాకా తీసుకొచ్చింది స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్. 'దేశముదురు' సినిమాలో తొలి సారిగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు అల్లు అర్జున్. ఆ తర్వాత చాలా మంది హీరోలు ఈ సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. అందులో హీరోగా మారిన కమెడియన్ సునీల్ కూడా ఉన్నాడు. 'పూల రంగడు' సినిమాతో సునీల్ తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించేశాడు. కాగా ఇప్పుడు తాజాగా మరో హీరో ఈ సిక్స్ ప్యాక్ బాడీపై కన్నేశాడు. ఆ హీరో ఎవరనుకుంటున్నారా? 'అర్జున్‌రెడ్డి'తో ఇటీవల ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ దేవర కొండ. ఓ సినిమా కోసం విజయ్ దేవర కొండ సిక్స్ ప్యాక్ బాడీని ట్రై చేస్తున్నాడట.
అందుకోసం స్పెషల్‌గా ఓ ట్రైనర్‌ని పెట్టుకున్నాడట మనోడు. ఆ ట్రైనర్‌తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'నా శరీరంతో ప్రయోగం చేయబోతున్నాను..' అంటూ ట్వీటిచ్చాడు. 'పెళ్లి చూపులు' సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన విజయ్ దేవరకొండ 'అర్జున్‌రెడ్డి'తో స్టార్ అయిపోయాడు. దాని తర్వాత చాలా బిజీ అయిపోయాడు మనోడు. ప్రస్తుతం చాలా సినిమాలకు సైన్ చేశాడు. వాటిలో ఏదో సినిమాలో మనోడు సిక్స్ ప్యాక్‌తో కనిపించనున్నాడన్న మాట. ఇదిలా ఉండగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మహానటి' సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోందీ సినిమా. 'సోలో', శ్రీరస్తు శుభమస్తు' సినిమాలను తెరకెక్కించిన పరశురామ్ డైరెక్షన్‌లోనూ విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు.
|