Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: 'అ' 
తారాగణం: కాజల్‌ అగర్వాల్‌, నిత్యా మీనన్‌, రెజినా కసాండ్రా, అవసరాల శ్రీనివాస్‌, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు. 
సంగీతం: మార్క్‌ ఎ రాబిన్‌ 
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 
దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ 
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని 
సమర్పణ: నాని 
విడుదల తేదీ: 16 ఫిబ్రవరి 2018 

క్లుప్తంగా చెప్పాలంటే 
వివిధ రకాల మనస్తత్వాలు గల కొందరు వ్యక్తుల చుట్టూ జరిగే కథ ఇది. టైమ్‌ మెషీన్‌ కనిపెట్టాలనుకునే వ్యక్తి, పెళ్ళిక సిద్ధపడ్డ చిత్ర విచిత్రమైన జంట, డ్రగ్స్‌కి బానిసైన ఓ అమ్మాయి, ఓ మెజీషియన్‌, ఓ చెఫ్‌ ఇలా ఇన్ని పాత్రలు ఒక్క చోట కలుస్తాయి. అందరి జీవితాల్లోనూ అనుకోని సంఘటన ఒకేసారి జరుగుతుంది. ఆ సంఘటన ఏంటి? ఆ తర్వాత వారి వారి జీవితాల్లో వచ్చిన మార్పులేంటి? అన్నదే అసలు కథ. అదేంటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
కాజల్‌ అగర్వాల్‌, నిత్యామీనన్‌, రెజినా, ఈషా రెబ్బా, మురళీ శర్మ, ప్రియదర్శి ఇలా అందరూ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందరిలోకీ మళ్ళీ నిత్యా మీనన్‌, రెజినా పాత్రలు ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. నటీనటుల పరంగా చూస్తే దర్శకుడికి మంచి 'టీమ్‌' దొరికిందని చెప్పొచ్చు. అందరూ ఇష్టపడి సినిమా చేశారన్న విషయం ఆయా పాత్రల తీరు తెన్నులకు తగ్గట్టుగా ఆయా నటీనటులు ఒదిగిపోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందరిలోకీ సినిమాని ఛాలెంజింగ్‌గా తీసుకున్నదెవరంటే రెజినానే. ముఖ్యంగా ఆమె గెటప్‌ ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పొచ్చు. అంత రిస్క్‌ ఆమె చేసిందంటేనే, ఈ సినిమా కథ విని ఆమె ఎంత ఎగ్జయిటింగా ఫీలయ్యిందో అర్థం చేసుకోవచ్చు. 

కథ, కథనాల పరంగా కొత్త పంథాని ఎంచుకున్నాడు దర్శకుడు. ప్రయోగాలు చెయ్యడమెందుకు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌లో ఓ లవ్‌ స్టోరీ రాసేసుకుంటే సరిపోతుందనుకోకుండా, చాలా క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. కథ, కథనాలు రెండూ కొత్తగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ కూడా ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా 'కత్తెర' అవసరం కన్పిస్తుంటుందనుకోండి. అది వేరే సంగతి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఇలాంటి సినిమాలకు ప్లస్‌ అవ్వాలి. ఈ సినిమాకి అది బాగా కుదిరింది. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. 
ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ అని కాదుగానీ, సినిమా మొత్తం ఓ డిఫరెంట్‌ 'వే'లో వెళుతుంటుంది. సగటు ప్రేక్షుడి ఆలోచనలకు భిన్నంగా సినిమా సాగుతుంటుంది. అదే ఒక్కోసారి ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్‌ చేసేస్తుంది. తాను ఏం చెప్పదలచుకున్నానో, ఏం తీయదలచుకున్నానో ఓ ఐడియాతో వున్న దర్శకుడు దాన్ని యధాతథంగా తెరకెక్కించేశాడు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడని దర్శకుడు, 'కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నానేమో' అని ఆలోచించుకోకపోవడం కొంత మైనస్‌ అన్పిస్తుంది. కొత్తదనం విషయంలో లోటేమీ లేదు. కానీ, అది కన్‌ఫ్యూజన్‌కి దారితీయడమే కొందరికి రుచించకపోవడచ్చు. సెకెండాఫ్‌లో తికమక సీన్స్‌ కాస్త ఇబ్బందికరమే. బి, సి సెంటర్స్‌లోని ఆడియన్స్‌ సినిమాతో కనెక్ట్‌ అవకపోవచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
కొత్తదనం 'అ'దిరిందిగానీ! 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka