Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహార యాత్రలు (థాయ్ లాండ్ ) - - కర్రా నాగలక్ష్మి

thailand

.( బేంకాక్ )

ఈ MBK సెంటరు స్కైట్రైను లో ప్రయాణించి చేరుకోవచ్చు లేదా టాక్సీ లో ప్రయాణించి చేరుకోవచ్చు . ప్రతి టాక్సి డ్రైవరు యేదైనా మంచి మార్కెట్ చూపించు అంటే యిక్కడకి తీసుకువస్తూ వుంటారు . దేశీయులు , విదేశీయులు కూడా యీ మార్కెట్ లో దొరకని వస్తువ వుండదనే అంటారు . ఈ మాల్ కి సుమారు అర కిలోమీటరు దూరం నుంచే మనకి స్ట్రీటు షాపులు మొదలవుతాయి , వాటితో పాటు బేరాలు . ఇక్కడ షాపులు నడిపే వారు చైనీయులే యెక్కువ శాతం వుంటారు , అలాగే కొనేవాళ్లు చాలా శాతం విదేశీయులే , కాబట్టి యిక్కడ బేరాలు అన్నీ కాలిక్యులేటరు మీద అంకెల ద్వారా జరుగుతూ వుంటాయి . వారి వారి రేటు వేసి కాలిక్యులేటరు మనకి చూపుతారు మనం నోనోనొ అని మనం యివ్వదలచుకున్నది వేసి చూపిస్తాం వాళ్లు నోనొనొ అని అంకెలు మార్చి పెడతారు అలా బేరాలు సాగిస్తామన్నమాట .

స్ట్రీటు షాపులు దాటుకొని మైను మాల్ లోకి ప్రవేశించాకా అన్ని అవే ఫుట్పాత్ మీద వున్న వే అయినా ఎసి షాపులలో చూస్తాం , క్రింది అంతస్థులలో  రకరకాల బ్రేండులకి చెంది బట్టల షాపులు , బేగులు , జోళ్లు , లగేజీ షాపులుంటాయి . లగేజీ షాపులంటే చిన్న బేగులనుంచి పెద్ద , అతిపెద్ద బేగుల వరకు వుంటాయి . ఈ షాపులలో సామాను చాలా ఆకర్షణీయంగా వుంటాయి . హేండుబేగులు అయితే మరీ ముద్దొచ్చేస్తూవుంటాయి . అయిదో అంతస్థులో ఎలక్ట్రోనిక్స్ షాపులు వుంటాయి , యిక్కడ అన్ని బ్రాండ్స్ ఎలక్ట్రోనిక్స్ కాక చైనా తయారీవి కూడా చాలా వుంటాయి .

ఈ మాల్ పూర్తిగా చూడాలంటే ఒకరోజు చాలదు . మేము చాలా సార్లు వెళ్లినా పై అంతస్థులకు వెళ్లనే లేదు . నేను బేగుల షాపులలో  , మా వారు ఎలక్ట్రోనిక్స్ షాపులలో అతుక్కుపోయేవారిమి . ప్లాస్టిక్స్ సామానులైతే యెన్ని రకాలవి కొనేవారమో లెక్కలేదు . ఇవి కాక ఈ మాల్ లో ముత్యాల దండలు అమ్మే దుకాణాలు యెన్నో వున్నాయి , అయితే పూసలకి , ముత్యపు చిప్పలతో తయారుచేసిన ముత్యాలకి , కల్చర్డ్ ముత్యాలకి వున్న తేడా బాగా తెలిస్తేనే బాగా బేరం చేసి కొనక్కోవాలి ( నేను ‘ సర్టిఫైడ్ జెమ్మాలజిస్ట్ ని కదా , అందుకనే మీకు యీ జాగ్రత్త చెబుతున్నాను ) .

ఇక్కడ ముత్యాలు కొనడంలో చిన్న చిట్కా చెప్తాను . నిజం ముత్యాలు అంటే పకృతి సహజంగా తయారైన ముత్యాలు సుమారుగా యిప్పుడు దొరకటం లేదనే చెప్పాలి . కాబట్టి కల్చర్డ్ ముత్యాలనే నిజంవి అనుకుందాం , ఒకే షాపులో వేరు వేరు ధరలలో దండల ఖరీదులలో తేడాలతో మనం కల్చర్డ్ ముత్యాలను గుర్తించవచ్చు . ముందుగా ఓ పది షాపులను సర్వేచేసి ముత్యాలను పరిశీలిస్తే మనకొక అవగాహన వస్తుంది , ధరల విషయంలో కూడా ఓ అవగాహన వస్తుంది . అప్పుడు మనబేరసారాలు మొదలుపెట్టవచ్చు .

MBK మాల్ లో యేడవ అంతస్థులో సినిమా హాల్స్ , ఆపై అంతస్థులలో ఫుడ్ కోర్టులు వుంటాయి . పై అంతస్థులోకి శాఖాహారులు వెళ్లకపోవడమే మంచిది . వీరి ఆహారపు అలవాట్లు మనకి వళ్లు జలదరింప చేస్తుంది . వీరి ఆహారపు అలవాటుని ఒక్క వాక్యంలో చెప్పుకోవాలంటే వీరు తినని జీవి ప్రపంచంలో లేదు అంతే .

బేంకాక్ లో యిదొక్కటే మాల్ కాదండోయ్ . చెప్పుకోదగ్గ పెద్ద మాల్స్ పదింటిలో యిదొకటి . సిటి సెంటర్లో స్కై ట్రైను స్టేషనుకి దగ్గరగా వున్నమరికొన్ని మాల్స్ ‘ సెంట్రల్ వర్ల్డ్  సియామ్ ‘ , సియామ్ పరాంగ్ సియామ్ . బ్రాండెడ్ షాపులకు వెళ్లదలచుకున్నవారు ‘ సియామ్ పరాంగ్ సియామ్ ‘ కి వెళతారు . ప్రపంచంలోని అన్ని ఖరీదైన బ్రాండుల షాపులు యీ మాల్ వుంటాయి .  ‘ సెంట్రల్ వర్ల్డ్  సియామ్ ‘ లో కూడా ఎయిర్ కండిషన్డ్ బహుళ అంతస్థుల మాల్ , ధరవరలు సుమారుగా వుంటాయి , బ్రాండెడ్ షాపులలో తప్ప అన్నిచోట్ల బేరాలు వుంటాయి . ఇవికాక ‘ టెర్మినల్ 21 ‘ , ‘ సియామ్ సెంటర్ ‘ , ‘ సియామ్ డిస్కవరి ‘ , ‘ సెంట్రల్ యెంబసి షాపింగ్ మాల్ ‘ , జ్యూవెలరీ ట్రేడ్ సెంటర్ షాపింగ్ మాల్ , యివే కాక నైట్ మార్కెట్లు , వాకింగ్ స్ట్రీటు మార్కెట్లు , చైనా బజారు కూడా వున్నాయి . మన జేబు , సమయం పెర్మిట్ చేసినంతమేరకు తిరగడానికి యెన్నో మాల్స్ వున్నాయి . ఏ వస్తువైనా కొనదలుచుకుంటే నాణ్యత బాగా చూసుకొని కొనుగోలు చేసుకోవాలని నా చిన్న విన్నపం .

లోకల్ బంగారు మార్కెట్ కూడా కనువవిందు చేస్తూ వుంటుంది . ఎన్నోరకాలైన ఆభరణాలు కాస్త మనలని లోభం లో పడవేయడం ఖాయం కాని యిక్కడి బంగారం లో మోసాలు వుంటాయేమో , యెందుకంటే యింటర్నేషనల్ మార్కెట్ లో  పెద్దగా గుర్తింపులేదు ( అరబ్ దేశాలు , సింగపూర్ లు ప్యూరిటీ విషయంలో ఆయాదేశాలు గ్యారంటీ యిస్తాయి ) .

ఇక్కడవున్న మరో పెద్ద ఆకర్షణ నవరత్నాలలో  కెంపులు , పచ్చలు మొదలైన విలువైన రాళ్ల మార్కెట్ . బర్మా థాయిలాండు సరిహద్దు ప్రాంతాలు విలువైన రంగురాళ్ల గనులు వుండడం , వాటికి ప్రపంచదేశాలలో  మంచి రంగురాళ్లగా గుర్తింపు పొందడంతో మనకి మంచిరాళ్లు దొరుకుతాయి , ధరవరల విషయం లో మాత్రం చాలా తేడాలు వుండడం గమనించేను . రంగురాళ్లమీద అవగాహన వున్నవాళ్లు మాత్రమే కొనుగోలు చెయ్యాలని నా సలాహా , యీ దేశం లో చాలా మోసాలువుంటాయి అందుకని .

బేంకాక్ లో వున్న మరో ఆకర్షణ ‘ ఫ్లోటింగ్ మార్కెట్ ‘ . బేకాంక్ కి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో సుమారు అయిదు ఫ్లోటింగ్ మార్కెట్లు వున్నాయి . సాధారణంగా వీటిని సైట్ సీయింగు టూర్ లతో బుక్ చేసుకుంటే సులువుగా వుంటుంది . మనంతట మనం వెడితే మార్కెట్ తిరగడానికి కుదుర్చుకోవలసిన బోటుకి చాలా అడుగుతారు . బేకాంక్ సిటీ టూరు , పట్టయ సిటీ టూరులాంటి వాట్లతో పాటుగా చేసుకోవచ్చు .

ఈ ఫ్లోటింగు మర్కెట్లు శ్రీనగరు దాల్ లేక్ ని గుర్తుచేస్తాయి . దాల్ లేక్ విశాలంగా వుంటుంది , యిక్కడ సన్నని కాలువలలో బోటుమీద తిరుగుతూ బోట్లమీదే ప్రాంతీయ వంటలను వండి అమ్ముతున్న ప్రాంతీయులు , పువ్వులు , మసాలా దినుసులు , థాయి మసాలాలు , చేతితో తయారుచేసిన వస్తువలు , పళ్లు కూరగాయలు ,  మన బోటుతో సమానంగా నడుపుతూ బేరసారాలు చేసే బోట్లు కనిపిస్తాయి . కొన్ని ఫ్లోటింగ్ షాపులైతే కొన్ని నీటిమీద కదలని షాపులు , రెస్టోరెంట్స్  వుంటాయి . థాయి సాంప్రదాయక వంటలు , వస్తువలు యెక్కువగా లభ్యమౌతాయి . ఇక్కడ చూసిన వాటిల్లో నాకు నచ్చినది కొబ్బరి పీచు , కొబ్బరి పెంకులతో చేసిన చేతి పనులు , వెండిలా అనిపించే వైటు మెటల్  (స్థానికులు వెండి అని చెప్పి అమ్ముతున్నారు , నిజానికి అది వెండి కాదు ) తో చేసిన రకరకాలవస్తువలు చాలా బాగున్నాయి . ఫ్లోటింగ్ మార్కెట్టుకి వెళ్లేవారు ఉదయాన్నే వెళితే మోటారు బోట్లవల్ల యేర్పడే కాలుష్యం నుంచి , యెండ వేడిమినుంచి తప్పించుకో గలుగుతాం .  బేరసారాలు చేసేవారికైతే యెక్కువ సమయం పడుతుందేమో గాని మాకు మాత్రం బోరనిపించింది . అప్పటికే నాలుగు సార్లు దాల్ లేక్ విహారం చేసిన అనుభవం వల్లనేమో ?

విదేశాలలో పర్యటించేటప్పుడు టూర్లు యెంచుకుంటే సులువుగా వుంటుంది . అయితే భోజనం కూడా అందులోనే చేర్చిన టూర్లవల్ల శాకాహారులకు సుఖం వుండదు , యేదో ఒకటో రెండో పదార్ధాలు తప్ప తినగలిగేవి వుండవు . యెవి చూడాలి యెలా వెళ్లాలి అనే సమస్య వుండదు . చూడవలసిన వన్నీ తిప్పేసి రాత్రికి మన బసలో దింపుతారు కాబట్టి సగం టెన్షను వుండదు . అందుకే రాజభవనాలు , మాల్స్ తిరగడానికి  టూర్ లలో కాకుండా మనంతట మనమే వెడితే బాగుంటుంది . తిరగవలసిన ప్రదేశాలు సిటీకి దూరంగా వుంటే టూర్లు యెంచుకుంటే బాగుంటుంది .

థాయి లాండులో నాకునచ్చిన మరో పర్యాటక ప్రదేశం గురించి వివరిస్తాను . ఎక్కువగా ఇంగ్లీషు , జపనీసు పర్యాటకులు యెంచుకునే టూరు యిది . దీనిని ‘ డెత్ రైల్వే ‘ అని ‘ బ్రిడ్జ్ ఆన్ ద రివర్ కోయ్ ‘ అని అంటారు .

మేం యీ టూరు యెంచుకున్నది మూడు రాత్రుల , నాలుగు రోజుల టూరు . అందులో మొదటి రోజు ఫ్లోటింగు మార్కెట్ , తరవాతి రోజు తెల్ల యేనుగుల సఫారి తరవాత కాంచనబురిలో నైట్ హాల్ట్ , మూడో రోజు కాంచనబురి , సెకెండ్ వర్ల్డ్ వార్ మెమోరియల్ , కోయ్ నది , రివర్ రాఫ్టింగు , డెత్ రైల్వే పర్యటన , నది వొడ్డున కట్టిన కాటేజీలలో రాత్రి నివాసం , మరునాడు తిరిగి పట్టయ తిరుగు ప్రయాణం .

మేం మా టూరు ‘ పట్టయ ‘ నుంచి బుక్ చేసుకున్నాం కాబట్టి ప్రొద్దుటే ఆరుకి మా టూరు మొదలయింది . ప్యాక్డ్ బ్రేక్ఫాస్టు తో మొదలు , ఆరుగురు కూర్చేగలిగే కారు కాని మేమిద్దరం డ్రైవరు తప్ప యెవరూ లేరు . డ్రైవరే చాలా చోట్ల గైడు కూడా .

థాయిలాండు వాతావరణం మనదేశపు వాతావరణాన్ని పోలి వుంటుంది కాకపోతే యిక్కడ రోజూ ఓ గంటో రెండుగంటలో వాన పడేది . కాబట్టి కాస్త చల్లగా వుండేది . యెనిమిది కల్లా మేం ఫ్లోటింగ్ మార్కెట్ చేరుకున్నాం . హై వే మీద ప్రయాణం చాలా బాగుంటుంది .  అక్కడి రోడ్ల నిర్మాణం చూస్తే యీ విషయం లో మన దేశం వెనుకబడి వుందని చెప్పక తప్పదు . ఎక్కడా సిగ్నల్ లైట్లు వుండవు , ఒకరోడ్డుని మరోరోడ్డు కట్ చెయ్యడం వుండదు . చాలా మటికి యీ హైవేలు నేలనుంచి సుమారు 5,6 అడుగుల యెత్తులో వుంటాయి , కాబట్టి మనుషులు రోడ్డుకి అడ్డం పడడాలువుండవు . జంతువులు  రోడ్డుమీద కనబడవు , అప్పట్లోనే ఓ విదేశీయుడు ( మా వారి కలీగ్ ) యిండియాలో రోడ్లు నడిచే జ్యూలు ‘ అన్నాడు .

ప్రతీ యాభై కిలోమీటర్లకి ఫుడ్ కోర్టులు , టోయ్ లెట్స్ వుండే ప్రదేశాలు వుంటాయి , మలేషియ లో అయితే అక్కడ ప్రార్ధనా రూము కూడా వుండేది . ‘రోజా ‘ సమయంలో ఫుడ్ కోర్టులు పగలు మూసివేసేవారు .

ఓ రెండుగంటలు సన్నని నీటి కాలువలగుండా నీటిలో ప్రయాణం చేస్తూ థాయి , బర్మీసు పల్లె వాసులను చూస్తూ , వారి చేతిపనులను మెచ్చుకుంటూ ఫ్లోటింగ్ మార్కెట్లో తిరిగేం . అక్కడనుంచి మా ప్రయాణం ‘ కాంచనబురి ( కాంచనపురి అయి వుండ వచ్చు ) ‘ వైపుసాగింది . బేంకాక్ కి పశ్చిమాన సుమారు 123 కిలోమీటర్ల దూరం లో వున్న నగరం కాంచనబురి . మా టూరులో భోజనం కూడా వుండడంతో మేము ఖచ్చితంగా మాకు శాకాహారమే యివ్వాలని చెప్పేం . మధ్యాహ్నం నదీ తీరాన వున్న ఓ రిసార్ట్ లో మాకు భోజనం యేర్పాటు చేసేరు . కాయగూరలు కొబ్బరిపాలతో  వండిన కూరలు వడ్డించేరు . ఇడ్లీ పాత్రలో ఆవిర్లు వస్తూ కనిపిస్తే ఓహో యిడ్లీలు యీ కూరలతో తినాలేమో అనుకున్నాను , బ్రెడ్డు ముక్కలని ఆవిరి మీద వుడికించి వడ్డించేరు . వాటిని కూరలతో తినాలట , తిన్నాం తరువాత గంజి అన్నం వడ్డించేరు , మాకు మొత్తం థాయిలాండ్ లో వున్నన్నాళ్లు మాకు యిదే తిండి .

బేంకాక్ లో ఇండియన్ వెజ్ రెస్టొరెంట్స్ వుండేవి , పట్టాయ లో మాత్రం మాంసాహారం , శాఖాహారం రెండూ వడ్డించేవి మాత్రమే వుండేవి .        భోజనం అయేక రిసార్ట్ చుట్టూ తిరిగి చూసేం చాలా బాగుంది . అక్కడ రూములు కూడా గడ్డిపాకలలా కట్టేరు . చుట్టూరా అడవిలా వుంది . పట్టపగలుకూడా పక్షుల కిలకిలారవాలతో చాలా బాగుంది అక్కడ ఓ మూడుగంటల రెస్ట్ తరువాత తిరిగి కాంచన బురి వైపు ప్రయాణం సాగించేం .

మిగతా వివరాలు వచ్చేవారం , అంతదాక శలవు

మరిన్ని శీర్షికలు
pratapabhavalu