Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sri Swamy Vivekananda Biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

మంచి(గయ్యాళి) అత్త సూర్యకాంతం - టీవీయస్.శాస్త్రి

actress suryakantham

తెలుగు సినిమా ప్రపంచానికి, ప్రేక్షకులకు దొరికిన అద్భుతమైన వజ్రం శ్రీమతి సూర్యకాంతం. ఈమె, కాకినాడలో, 28-10 -1924 న ధనవంతులైన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి, పొన్నాడ వెంకట రత్నమ్మ, తండ్రి పొన్నాడ అనంతరామయ్య. సూర్యకాంతం చిన్నతనం నుండి సాత్విక స్వభావం గలది. ఆమె గయ్యాళి నాలుక వెనుక ఒక దయార్ద హృదయం వుంది. ఆమె ఎప్పుడూ ఆనందంగా వుండటమే కాకుండా తన చట్టూ వున్నవారినికూడా ఆనందంగా వుంచేది. ఇతరులకు సహాయం చేయటం, విశాలభావాలు -- యివన్నీ చూస్తే యీవిడేనా మన "గయ్యాళి"అత్త అని ఆశ్చర్య పోతాం. ఆమె స్వయంగా వండి వార్చిన వంటలను స్టూడియో లకు తెచ్చి, సహ నటీనటులకు కొసరి కొసరి వడ్డించేది. ఆంద్ర పులిహోర చేయటంలో ఈవిడ చేయి తిరిగిన 'వంటఇల్లాలు'. ఆమెది యెడం చేతి వాటం. అదే చేతితో అద్భుతంగా తన గయ్యాళి తనాన్ని కూడా ప్రదర్శించేది.

ఆవిడ గొప్ప సంఘ సేవికురాలు. ఆంద్ర నాటక రంగంలోని చాలామంది బీద కళాకారులకు దానధర్మాలు చేసింది. గ్రంధాలయాలకు, వికలాంగుల విద్యాశాలలకు భూరిగా విరాళాలు ఇచ్చింది. ఎన్నో సంస్థలకు నిధులు సమకూర్చటం కోసం చాలా ప్రదర్శనలు ఇచ్చింది. రామకృష్ణ మిషన్ ద్వారా ఆవిడ సహాయం చేసేది. పిసినారి నిర్మాతల నుండి డబ్బు మొత్తం ఒకే సారి వసూలు చేయటం ఆమె ప్రత్యేకత . కొంతమంది మంచి వారి వద్దనుండి పారితోషికం తీసుకోకుండా నటించేది. అయితే, నిర్మాత, దర్శకులకు చాలా విధేయంగా వుండేది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో షుమారు 750 సినిమాలకు పైగా నటించింది. హావభావాల కన్నా, మాటలతోనే గయ్యాళి తనం చూపెట్టేది. 1950 లో'నారద నారది' అనే సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమైన ఈ మహానటి ఎన్నో విభిన్న మైన పాత్రలలో నటించింది. కొన్ని హాస్య పాత్రలు కూడా వున్నాయి. గయ్యాళితనంలో అమాయకత్వం చూపెట్టటం యీవిడకే చెల్లు. ఈమెకు 1950 లో శ్రీ పెద్దిభొట్ల చలపతిరావు గారితో వివాహం జరిగింది. ఆయన హైకోర్టు జడ్జీగా పనిచేసారు. సంతానం లేక పొతే, ఒక కుమారుని దత్తత తీసుకుంది.

అన్నిటికన్నా గొప్పవిషయం ఏమిటంటే, ఇద్దరు అగ్రశ్రేణి నటులైన రామారావు, నాగేశ్వరరావులు నటించిన సినిమా, ఈవిడ వేసిన పాత్ర పేరుతో 'గుండమ్మ కథ' గా విడుదలై అఖండ విజయం సాధించింది. కన్నడ పేరైన గుండమ్మను తెలుగువారి గుండమ్మగా మార్చిన ఘనురాలు. మళ్ళీ గుండమ్మకథను తెలుగులో తీయాలని నిర్మాతలు కొందరు ప్రయత్నం చేస్తున్నారట! ఈవిడ వేసిన పాత్రకు తగిన నటి కోసం మల్లగుల్లాలు పడుతున్నారట. ఈవిడ తన నటనతో పక్కనున్న పాత్రలను ఎంతో elevate అయ్యేటట్లు చేసేది. రక్తంసంబంధం సినిమాలో రామారావు గారి పాత్రకు అంత పేరు రావటానికి ఈవిడ అమోఘమైన నటన కారణం అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సినిమా రంగంలోఈమెకు ఆప్తుడు శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారు. రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకోవటం ఈవిడకు హాబీ. దాన్ని గురించి ముళ్ళపూడి వారు చమత్కారంగా యిలా అనేవారట ఆమెతో -- 'సూర్యకాంతం, అయస్కాంతం లాంటి కళ్ళను కల్లజోళ్ళతో ఎందుకు మూస్తారని?' ముళ్ళపూడివారికి మొదట్లో సినిమాలు తీసే సమయంలో ఆర్ధిక సహాయంకూడా చేశారట.

ఆవిడ చనిపోయిన వెంటనే, విషయం చెప్పకుండా ఆవిడ లాయర్ రమణ గారికి కబురు పెట్టారట. 'ఆవిడకు నేను ఏమీ బాకీ లేనే! నేనెందుకు?' అన్నారట. 'అందుకు కాదు వేరే పని వుంది, రండి' అని లాయర్ గారు అంటే, రమణ గారు హుటాహుటిన వెళ్లారట. లాయర్ గారు ఒక Document. చూపించారట. అందులో విషయం చూసి, రమణ గారి కళ్ళు చెమ్మగిల్లాయట. ఆమె ఆస్తిలో కొంత భాగం ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి, రమణ గారిని, ఆమె కొడుకునీ Trustee లు గా చేసిందట. ఆమెను గురించి బాగా తెలిసివున్న వారు కనుకనే ఆమె వ్యక్తిత్వానికి సరితూగే పాత్రలు వారి సినిమాలలోనే ఆవిడకు లభించాయి. అందుకు ఉదాహరణగా, అందాల రాముడు, ముత్యాలముగ్గు లాంటి సినిమాలను చెప్పవచ్చును.

జంధ్యాల గారు యిలా అనే వారు 'చిన్నతనంలో ఎవరైనా నన్ను మీ అమ్మగారి పేరేమిటి? అని అడిగితే, చెప్పటానికి చాలా బిడియ పడేవాడిని. కారణం, మా అమ్మగారి పేరు, సూర్యకాంతం కావటం వల్ల. ఆవిడ సినిమాలలో బాగా పేరు తెచ్చుకున్న తర్వాత సూర్యకాంతం, అనే పేరు తమ పిల్లలకు పెట్టటానికి చాలామంది భయపడేవారు'. సూర్యకాంతం అంటే గయ్యాళిగంప అని తెలుగు నిఘంటువులో వ్రాసుకోవచ్చు. అంత సహజంగా నటించిన నటీమణి, మధుమేహవ్యాది తీవ్రతతో, 18-12-1994 న మనలను భౌతికంగా వదలి పరలోకాలకు వెళ్ళిపోయారు. కానీ, తెలుగువారి గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకొన్నారు.

ఆ నటీ శిరోమణికి నా స్మృత్యంజలి!!!.

మరిన్ని శీర్షికలు
weekly horoscope October 25 - October 31