Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
anjali

ఈ సంచికలో >> సినిమా >>

'వెన్నెల్లో గోదారి అందం' కు 30 ఏళ్ళు! - కె. సతీష్ బాబు

30 years of vennello godaari andam

ఆ మధ్యన శేఖర్ కమ్ముల 'గోదావరి' సినిమా తీసేముందు చిత్రరంగ ప్రముఖులు, గొప్ప స్నేహితులు శ్రీ బాపు - రమణ గార్లను గోదావరి నదీ తీరంలో అందమైన ప్రదేశాలు, షూటింగ్ కు అనువైన స్థలాల గురించి అడిగితే వారు 'గోదావరి తీరంలో మేము షూటింగ్ చేసిన ప్రదేశాలే మాకు తెలుసు. అంతకన్నా ఇతర ప్రదేశాల గురించి మాకు తెలియదు. మీరు ఒకరిని కలవండి. 'ఆయన'కు ఈ గోదావరిలోని అన్ని ప్రదేశాలు, షూటింగ్ లొకేషన్ ల గురించి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే 'గోదావరి'ని అంత గొప్పగా ప్రేమిస్తాడు. కాబట్టి 'ఆయనను కలవండి ముందు' అని శ్రీ బాపు - రమణలు సెలవిచ్చారు.

*****

'అతడి' సినిమాల్లో భారీ ఫైటింగ్ లు, భారీ డైలాగ్ లు, భారీ సెట్టింగ్ లు, అరుపులు, కేకలు, హీరోయిన్ లను అసభ్యంగా, అశ్లీలంగా చూపడాలు లాంటివి ఉండవు. అతడి సినిమాల్లో 'గోదావరి' ని ఎంతో అందంగా చూపిస్తాడు. కోనసీమ మనుష్యుల ప్రేమలను, ఆప్యాయతలను మనకు కొసరి కొసరి చూపిస్తాడు. హీరోయిన్ లను రూపాయంత బొట్టుతో, కాటన్ చీరలతో ఎంతో పవిత్రంగా, గొప్పగా, గౌరవంగా మన ఇంటి ఆడవారిలా చూపుతాడు.

*****

శేఖర్ కమ్ములకు శ్రీ బాపు రమణలు చెప్పిన 'ఆయన', 'అతడి' సినిమాల్లో అంటూ చెప్పింది ఒక్కరి గురించే. ఇంతకూ 'ఆయన', 'అతడు' ఎవరో తెలుసా?! ఆయనే 'వంశీ'!

వంశీ తీసిన 'సితార' 1984 లో విడుదలయ్యింది. ఈ 2014 కి 'సితార' సినిమా వచ్చి 30 ఏళ్ళు. ఈ సందర్భంగా వంశీని ఆరాధించే, అభిమానించే వేలాది అభిమానుల్లో ఒక్కడిగా 'సితార' సినిమా గురించి ఓ చిరు వ్యాసం -

వంశీ చిన్నవయస్సులోనే కథలు, నవలలు రాయడం మొదలెట్టారు. 'నల్ల సుశీల', 'సత్య సుందరి నవ్వింది' కథలు, 'కర్మభూమి', 'మంచుపల్లకి' నవలలు రాశారు. వంశీకి మొదటి నుంచి సినిమాలు చూసే అలవాటు గాని, సినిమాలంటే ప్రేమగానీ పెద్దగా లేవు. కానీ బాపుగారంటే చాలా చాలా ఇష్టం. గౌరవం. బాపుగారిని కలవాలని మద్రాసుకి వెళ్ళి ఒకతను చెప్పిన వివరాల ప్రకారం బాపుగారిని కలవబోయి 'విక్టరీ' మధుసూదనరావు గారిని కలవడం, ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడం జరిగిపోయాయి ఎదురీత సినిమాతో.

వంశీ ఆ తర్వాత పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ లో 'శంకరాభరణం' సినిమాకు కె. విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. హీరోయిన్ లను ఎంతో పవిత్రంగా, గౌరవంగా చూపడాన్ని గురువు కె. విశ్వనాథ్ దగ్గర నేర్చుకున్నాడు. ('శంకరాభరణం' సినిమా అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం గుర్తుకు వస్తుంది. ఈ సినిమాకు దర్శకుడు కె. విశ్వనాథ్ అయితే, రచయితగా జంధ్యాల, సినిమాటోగ్రాఫర్ గా కె. బాలూ మహేంద్ర, అసిస్టెంట్ డైరెక్టర్ గా వంశీ పనిచేశారు. ఈ ముగ్గురూ తర్వాతి కాలంలో దర్శకులుగా మారి మంచి చిత్రాలు తీశారు.) భారతీరాజా దగ్గర 'సీతాకోక చిలుక' సినిమాకు అసిస్టెంట్ గా చేశాడు వంశీ.

వంశీకి ముఫ్ఫై ఏళ్ళు రాకుండా డైరెక్టర్ గా సినిమా చేయకూడదని, అది కూడా రీమేక్ లు కాకుండా సొంత కథతో సినిమా తీయాలని కోరిక. కానీ 'మంచు పల్లకి'తో ఈ కోరిక అటకెక్కింది. తమిళంలో విజయం సాధించిన 'పాలయ్ వన్ చోలై' సినిమాను తెలుగులో 'మంచు పల్లకి' గా రీమేక్ చేశాడు వంశీ. ఈ సినిమా హిట్టు కాదు. అలాగని ఫ్లాపు కాదు. ఒక మంచి చిత్రంగా ప్రశంసలు పొందింది. కానీ దర్శకుడిగా వంశీకి రెండు సంవత్సరాల వరకు ఇంకో సినిమా అవకాశం రాలేదు.

మాతృసంస్థలో 'సితార'
'పూర్ణోదయా మూవీ క్రియేషన్స్' వంశీకి మాతృసంస్థ లాంటిది. ఎందుకంటే 'శంకరాభరణం' మరియు 'సీతాకోక చిలుక' సినిమాలకు ఆ సంస్థలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసాడు కాబట్టి. 'చతుర' నవలల పోటీలో బహుమతి పొందిన 'మహల్లో కోకిల' నవలను పూర్ణోదయా నిర్మాణ సంస్థలో 'సితార' సినిమాగా తీశాడు వంశీ. సినీ తారకు సంబంధించిన కథ ఇది. పంజరంలో పక్షిగా ఉన్న జమిందారీ కుటుంబానికి చెందిన యువతి 'ప్రేమ' అనే స్వేచ్చను పొందిన కథ. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసిం తర్వాత 'ఈ సినిమా ఏంటి ఇలా వుంది?! ఆడేటట్టులేదే? అంటూ అందరూ అన్నారు. వంశీ కూడా భయపడ్డాడు. కానీ ఇళయరాజా 'నేను రికార్డింగ్ ఇచ్చిన తరువాత ఈ సినిమాను చూసి అప్పుడు చెప్పండి ఏమైనా? అని అన్నాడు. ఆయన చెప్పినట్టే ఈ సినిమా మంచి విజయం సాధించింది. 'సితార' సినిమా 1984 లో విడుదలై పది థియేటర్ లలో వందరోజులు ఆడింది. ఈ సినిమాలో స్టార్ హీరో కానీ స్టార్ హీరోయిన్ కానీ లేరు. అయినా వందరోజులు ఆడడం మామూలు విషయం కాదు.

భారతీరాజా లాంటి వాడే వంశీ టేకింగ్ చూసి ఈర్ష్య కలిగిందన్నాడు. ఈ సినిమా రష్యాలో కూడా విడుదల చేయబడింది. అంతేకాదు దక్షిణాదిన రౌండ్ ట్రాలీ ఉపయోగించిన తొలి సినిమా. 'సితార' ద్వారా భానుప్రియను తెలుగు చిత్రసీమకు హీరోయిన్ గా పరిచయం చేశాడు వంశీ. ఈ సినిమాలో 'భానుప్రియ, సుమన్, శరత్ బాబు, జె.వి. సోమయాజులు, శుభలేక సుధాకర్, రాళ్ళపల్లి' మొదలైన వారు నటించారు. 1984 వ సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఈ 'సితార' కు మూడు అవార్డులు వచ్చాయి. ఉత్తమ గాయనిగా ఎస్. జానకి గారికి ('వెన్నెల్లో గోదారి అందం' పాటకు), ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా మరియు ఉత్తమ ఎడిటర్ గా అనిల్ మల్నాడ్ కు అవార్డులు వచ్చాయి.

ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటూ ప్రేక్షకులను, సంగీతాభిమానులను అలరిస్తున్నాయి. 'వెన్నెల్లో గోదారి అందం', 'కుకుకూ కోకిల గానం', 'జిలిబిలి పలుకుల', 'కిన్నెరసాని వచ్చిందమ్మా', 'నీ గానం', ఇలా అన్ని పాటలూ బావుంటాయి. 'సితార' సినిమాతో కొందరికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారెవరంటే -

ఎస్. జానకి గారు - మొత్తం నాలుగు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు వస్తే, అందులో రెండు సార్లు తమిళంలో, ఒకసారి మలయాళంలో, ఒకసారి తెలుగులో వచ్చాయి. తెలుగులో వచ్చిన అవార్డు 'సితార' సినిమాకే. 'సితార' సినిమా ద్వారా నంది అవార్డ్ వచ్చింది.

వంశీ - ఈ సినిమా ద్వారా వంశీ టేకింగ్, వంశీ శైలి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. పాటలను గొప్పగా తీస్తాడని పేరొచ్చింది వంశీకి.

పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ - గొప్ప నిర్మాణపు విలువలు ఉన్న సంస్థకు మరింత పేరు తెచ్చిన సినిమా 'సితార'.

ఇళయరాజా - ఈ సినిమా ద్వారా వంశీకి, ఇళయరాజాకు మంచి స్నేహం కుదిరి వరుసగా 'అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, లేడీస్ టైలర్' తో మొత్తం 11 సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు. క్రేజీ కాంబినేషన్ లో వంశీ, ఇళయరాజా ది ఒకటి.

భానుప్రియ - తొలి చిత్రంతోనే నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించింది. తర్వాత 'అన్వేషణ, ఆలాపన, పవిత్ర, ఝాన్సీ, స్వర్ణ కమలం, శ్రీనివాస కళ్యాణం' తదితర సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు పొందింది.

తెలుగులో విడుదలయిన గొప్ప క్లాసికల్ సినిమాల్లో 'సితార' ఒకటి. 'హేట్సాఫ్ టు వంశీ'.

మరిన్ని సినిమా కబుర్లు
akkada ikkada