Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
అనుష్క నాకు ఆద‌ర్శం! - ర‌కుల్ ప్రీత్‌సింగ్‌
 
ఇప్ప‌టి హీరోయిన్ల‌కు గ‌ట్టిపోటీ ఇస్తోంది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. చిత్ర‌సీమ‌లోకి అడుగుపెట్టి రెండేళ్ల‌య్యిందో లేదో - అందరి స్థానాల‌కూ ఎస‌ర పెట్టేసింది. ఏ సినిమా చూసినా ర‌కులే హీరోయిన్‌. మ‌రో ఆప్ష‌న్ లేద‌న్న‌ట్టు.. ర‌కుల్ త‌ప్ప అగ్ర హీరోల‌కు మరో హీరోయిన్ స‌రిపోద‌న్న‌ట్టు... ర‌కుల్ నామ జ‌ప‌మే చేస్తున్నారంతా. ర‌కుల్ కూడా డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకొని చ‌క‌చ‌క సినిమాలు చేసేస్తోంది. అడిగిన వాళ్ల‌కు కాద‌న‌కుండా కాల్షీట్లు ప్ర‌సాదిస్తోంది. ప‌నిలో ప‌నిగా పారితోషిక‌మూ పెంచేసింది. న‌వ‌త‌రం క‌థానాయిక‌ల్లో ర‌కుల్ నెంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకేస్తోంది. ఆమె న‌టించిన రెండు సినిమాలు పండ‌గ చేస్కో, కిక్ 2 విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ర‌కుల్ ప్రీత్‌తో చిట్ చాట్ ఇది.
 
* పండ‌గ‌చేస్కో అంటూ కిక్ అందిస్తున్నారు.. ఏమిటీ ఈ రెండు సినిమాల విశిష్ట‌త‌?
- (న‌వ్వుతూ)  నిజంగా నాకు డ‌బుల్ కిక్ ఇచ్చిన సినిమాలు ఇవి. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల‌కూ.. ఈ సినిమాల‌కూ ఎలాంటి పోలిక లేదు. నా పాత్ర‌లో కాదు కాస్ట్యూమ్స్, స్టైలింగ్ విష‌యాల్లోనూ కొత్త‌గా క‌నిపిస్తా. 
 
* ర‌వితేజ‌, రామ్‌.. ఇద్ద‌రూ ఎన‌ర్జిటిక్ హీరోలే. వాళ్ల‌తో క‌ల‌సి న‌టించ‌డం ఎలా అనిపించింది?
- అమ్మో.. వాళ్ల‌ది మామూలు ఎన‌ర్జీనా. రోజుంతా సెట్లో ఓకేలా క‌నిపిస్తారు. అల‌స‌టే లేదు. ఎన్నిసీన్లిచ్చినా ట‌క ట‌క చేసుకెళ్లిపోవ‌డ‌మే. ర‌వితేజ చాలా చాలా సీనియ‌ర్‌. ఓ కొత్త‌మ్మాయి అయినా స‌రే... ఆయ‌న నాకిచ్చిన గౌర‌వం ఎప్పటికీ మ‌ర్చిపోను. ఇక రామ్‌.. భ‌లే మంచి మ‌నిషి. సూప‌ర్బ్ డాన్స‌ర్‌. అత‌ని వేగాన్ని అందుకోవ‌డం నావ‌ల్ల కాలేదు. ఈ మాత్రం డాన్సులు వేయ‌గ‌లిగానంటే... అతంతా త‌ను ఇచ్చిన స్ఫూర్తితోనే.

* ప‌ది రోజుల వ్య‌వ‌ధిలో రెండు పెద్ద సినిమాలొస్తున్నాయి.. అందులో మీరే హీరోయిన్‌. ఎలా ఉంది అనుభ‌వం?
- సూప‌ర్బ్‌. ఈ వేస‌వి అంతా మీతో ట‌చ్‌లో ఉంటా. అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది? ఏ క‌థానాయిక అయినా ఇలాంటివే కోరుకొంటుంది. ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉండ‌డం కంటే అదృష్టం ఏముంటుంది?

* ఈమ‌ధ్య అగ్ర హీరో సినిమా చూసినా అందులో మీ పేరే వినిపిస్తోంది?
- అదంతా నా అదృష్టం. టాప్ స్టార్ల‌తో సినిమాలు చేయాల‌ని ఎవ‌రికి ఉండ‌దు చెప్పండి?  వాళ్లంతా మా సినిమాలో ర‌కుల్ అయితే బాగుంటుంద‌ని అనుకొంటున్నారంటే.. ఐ యామ్ సో ల‌క్కీ.. ఇంత‌కంటే ఏం చెప్ప‌లేను.

* స‌మంత‌, త‌మ‌న్నా, కాజ‌ల్‌.. వీళ్లంద‌రికీ మీరు పోటీ అనుకోవ‌చ్చా?
- వీళ్లంతా నా సీనియ‌ర్లు. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకొన్నా. ఇంకా నేర్చుకొంటూనే ఉన్నా. వాళ్ల‌తో పోటీ ప‌డ‌డ‌మేంటి?  ఎవ‌రికి రావాల్సిన అవ‌కాశాలు వాళ్ల‌కి వ‌స్తుంటాయి. ఈసినిమాలో కాజ‌ల్‌ని తీసుకొందాం అనుకొన్నార‌నుకోండి. కాజ‌ల్ కి వేరే ప్ర‌త్యామ్నాయం ఉండ‌రు. ఆ స్థానంలో
నా పేరు అనుకొంటే..నాకు మ‌రో ప్ర‌త్యామ్నాయం ఉండ‌దు.

* సీనియ‌ర్ హీరోయిన్ల నుంచి మీరు నేర్చుకొన్న‌దేంటి?
- వాళ్లంతా గ్లామ‌ర్ పాత్ర‌లు చేశారు. కానీ అవ‌కాశం దొరికిన‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల్ని ఎంచుకొన్నారు. ఓ ప‌రిపూర్ణ క‌థానాయిక‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు. అనుష్క‌నే తీసుకోండి. ఓ సినిమాలో ఆమె బికినీ వేస్తూ క‌నిపించారు. ఆ త‌రవాత అరుంధ‌తి లాంటి స‌బ్జెక్ట్ ఎంచుకొన్నారు. ఆ త‌ర‌వాత వాటికే ప‌రిమితం అవ్వ‌లేదు. మ‌ళ్లీ గ్లామ‌ర్ రోల్స్ చేశారు. ఇప్పుడు రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి అంటూ పెర్‌ఫార్మ్సెన్స్ పాత్ర‌ల్లోకి వెళ్లిపోయారు. అందుకే ఈ విష‌యాల్లో నాకు అనుష్కనే ఆద‌ర్శం.

* డిమాండ్‌ని చూసుకొని ర‌కుల్ పారితోషికం పెంచేసింది అంటున్నారు.
- పారితోషికం పెరిగిన మాట వాస్త‌వ‌మే. వ‌చ్చిన కొత్త‌లో ఎంత తీసుకొన్నావో.. ఇప్పుడూ అంతే తీసుకో అన‌డంలో అర్థం లేదు. అలాగైతే గ్రోత్ ఎక్క‌డ  ఉంటుంది??  నా దృష్టిలో పారితోషికం పెర‌గ‌డం కూడా క‌థానాయిక ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌న‌మే. అలాగ‌ని నేను పారితోషికం కోస‌మే సినిమాల్ని ఒప్పుకోవ‌డం లేదు. నాకు అన్ని విష‌యాలూ న‌చ్చాలి. ఆ త‌ర‌వాతే పారితోషికం.

* మీ పారితోషికం కోటి రూపాయ‌లు అంటున్నారంతా?
- అమ్మో.. అంత సీన్ లేదు.

* సినిమా సినిమాకీ గ్లామ‌ర్ డోస్ పెంచుతున్న‌ట్టుంది?
- నా సినిమా అంటే నా కుటుంబ స‌భ్యులంతా క‌ల‌సి చూసేలా ఉండాలి. ఏ స‌న్నివేశంలో ఒక్క‌రు త‌ల‌దించుకొనే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నా అలాంటి సినిమాలు చేయ‌ను. గ్లామ‌ర్ కంటే ఫ్యాష‌న్‌గా క‌నిపించ‌డానికే ప్రాధాన్యం ఇస్తా.

* చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఈ స్థానాన్ని ముందుగా ఊహించారా?
- ఎవ్వ‌రికైనా త్వ‌ర‌త్వ‌ర‌గా ఎద‌గాల‌ని ఉంటుంది. అయితే.. మ‌రీ ఇంత‌గా ఆశ‌ప‌డ‌లేదు. నాలుగైదు సినిమాలు చేస్తానేమో అనుకొన్నా. కానీ ఇక్క‌డ క‌ష్ట‌ప‌డితే త‌ప్ప‌కుండా ప్ర‌తిఫ‌లం ఉంటుంద‌ని వ‌చ్చిన కొత్త‌లోనే తెలిసింది. అలా క‌ష్ట‌ప‌డుతూ వెళ్తున్నా.

* చేతినిండా సినిమాలున్నాయి. మ‌రి వ్య‌క్తిగ‌త జీవితానికి సమ‌యం దొరుకుతుందా?
- సినిమా నాకిష్ట‌మైన వ్యాప‌కం. సెట్లో నేర్చుకోవ‌డానికి ఎన్నో విష‌యాలున్నాయి. ఇష్ట‌మైన చోట క‌ష్టం ఉంటుందా??  నాకు ఏమాత్రం ఖాళీ దొరికినా ఇంట్లోవాళ్ల‌తోనే గ‌డుపుతున్నాను.

* ఇంత‌కీ సినిమా ప్ర‌పంచం ఎలా ఉంది?  
- సూప‌ర్బ్‌. ఇక్క‌డ గ్లామ‌ర్‌కీ, వ‌చ్చే పేరుకీ లోటు ఉండ‌దు. నేనేమోగానీ మా ఇంట్లో వాళ్లు, స్నేహితులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నా ఇంట‌ర్వ్యూ టీవీలో వ‌చ్చినా, నా గురించి ఎక్క‌డైనా రాసినా ఇష్టం చూస్తారు, చ‌దువుతారు. నా ఎదుగుద‌ల వాళ్ల‌కెంతో సంతృప్తినిస్తోంది. సో.. నేనూ హ్యాపీనే.

* చేతిలో ఉన్న సినిమాలేంటి?
- రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌సినిమాల‌పై సంత‌కాలు చేశా.

* మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం మాటేంటి?
- అదింకా చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది.

* ఒకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ.
మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 17 - Baby He Loves You - Arya 2