Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

ఖాళీగానైనా కూర్చుంటా త‌ప్ప‌.... అలాంటి సినిమాల్ని చేయ‌ను - సందీప్ కిష‌న్‌

interview with sandeep kishan

సందీప్ కిష‌న్ మెల్లిమెల్లిగా త‌న‌కో బ్రాండు సంపాదించుకొన్నాడు. త‌న రూటు ఇది అని క్లియర్ క‌ట్‌గా ప్రేక్షకుల‌కు చెప్పేశాడు.
సందీప్ అంటే.. ఓ కొత్త క‌థ‌.
సందీప్ అంటే.. ఓ కొత్త సినిమా.
అందుకోసం సందీప్ కొన్ని త్యాగాలు చేయ‌డానికి కూడా వెనుకంజ వేయ‌లేదు. అందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌.. టైగ‌ర్‌.
ఈ సినిమాలో సందీప్ కిష‌న్ కి హీరోయిన్ లేదు. పైగా లేట్ ఎంట్రీ. అయినా స‌రే.. ధైర్యంగా ఒప్పుకొన్నాడు. ప్ర‌తి సీనులోనూ నేనే క‌నిపించాలి అనే బీరాలు పోకుండా.. ఓ కొత్త క‌థ‌ని తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో త‌న వంతు త్యాగం చేశాడు. అందుకే టైగ‌ర్‌... నిల‌బ‌డిపోయింది. ఈ సినిమా రిజ‌ల్ట్ ప‌ట్ల సంతోషంగా ఉన్న సందీప్ కిష‌న్‌ని మాట‌ల్లో దింపింది గో తెలుగు.


* హాయ్ సందీప్‌..
- హాయండీ

* టైగ‌ర్ తో హ్యీపీనేనా?
- ఫుల్లుగా. మేం ఏదైతే అనుకొన్నామో... ఇప్పుడు ఆ రిజ‌ల్టే వ‌చ్చింది. నాతో సినిమా చేసిన నిర్మాత హ్యాపీగా ఉండ‌డం నాకు చాలా ముఖ్యం. టైగ‌ర్ అంద‌న్నీ సంతోష‌పెట్టింది.

* ఈ సినిమాపై మీరు ముందు నుంచీ చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు. కార‌ణం ఏంటి?
- మంచి క‌థ‌లు ఎప్పుడో గానీ దొర‌క‌వండి. దొరికిన‌ప్పుడు దాన్ని స‌రిగా తెర‌పై ఎగ్జిక్యుట్ చేయాలి. మా ద‌గ్గ‌ర మంచి క‌థ ఉంది. ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా దీన్ని తెర‌కెక్కిస్తే.. ఖ‌చ్చితంగా మంచి సినిమా అవుతుంది అనిపించింది. ఈ క‌థ‌ని నేనే కాదు.. మా టీమ్ అంతా బాగా న‌మ్మారు. ప్రేమించారు. ఈ సినిమా ప్రివ్యూ చూసిన రాహుల్ ర‌వీంద్ర‌న్ `ఈ సినిమా కూడా ఆడ‌కపోతే మ‌న‌మేం చేయ‌లేం రా..` అన్నాడు. ఈ సినిమాపై మేం పెట్టుకొన్న న‌మ్మ‌కానికి ఇదో ప్ర‌తీక‌. దానికితోడు వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ త‌ర‌వాత నాకు నేనై ఎంచుకొన్న క‌థ ఇదే. అందుకే ఈ సినిమా ఆడాల‌ని, ఆడితే బాగుంటుంద‌ని ముందు నుంచీ గ‌ట్టిగా అనుకొంటున్నా.

* ఓ సినిమా ఎంత వ‌సూలు చేసింది, నిర్మాత సేఫా కాదా?  అనే విష‌యాలు ప‌ట్టించుకొంటారా?
- ఎంత బ‌డ్జెట్ పెట్టాలన్న‌ది ఖ‌చ్చితంగా నిర్మాత ఛాయిసే. ఎంత వ‌సూలు చేస్తుంద‌న్న‌ది మాత్రం నేనే కాదు ఎవ్వ‌రం చెప్ప‌లేం. సినిమా బాగా ఆడాల‌ని, నిర్మాత‌కు నాలుగు డ‌బ్బులు మిగలాల‌నే ఎక్కువ కోరుకొంటా. అంత‌కంటే లోతుల్లోకి వెళ్ల‌ను. ఎందుకంటే డ‌బ్బుల‌కు సంబంధించిన విష‌యాల్లో నేను చాలా దూరం.

* క‌థానాయ‌కుడు, ద‌ర్శ‌కుడు, ఇత‌ర ప్ర‌ధాన సాంకేతిక నిపుణులు.... పారితోషికాలు తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకోవ‌డం ప్రారంభ‌మైంది. ఈ విధానం వ‌ల్ల ఎవ‌రికి లాభం?
-  మంచి క‌థ‌ల‌కు లాభం. అయితే.. నాలాంటి న‌వ‌త‌రం హీరోలు పారితోషికాలు తీసుకోకుండా సినిమాలు చేయ‌మంటే క‌ష్టం.. రోజు వారీ ఖ‌ర్చులు కావాలి క‌దా? (న‌వ్వుతూ). ప‌ది కోట్లు, ప‌దిహేను కోట్లు తీసుకొనే హీరోలు వాటాలు తీసుకొంటే బెట‌రేమో..??

* మీ సినిమాల విష‌యంలో చోటా మామ పాత్ర ఎంత‌?
- అంతా ఇంతా అని చెప్ప‌లేను. నాకు అన్ని విధాలా చోటా మామానే కొండంత బ‌లం. నాకేమైనా క‌థ‌లు న‌చ్చితే చోటా మామ‌కు వినిపిస్తా. ఆయ‌న ఆ క‌థ నాకెలా న‌ప్పుతుందో చెప్తారు. ప్ల‌స్సూ, మైన‌స్సులు వివ‌రిస్తారు.

* మీ ప్రాజెక్టులు కూడా ఆయ‌నే సెట్ చేస్తున్నార‌ని, పెట్టుబ‌డి పెడుతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి...
- అవ‌న్నీ ఒట్టి పుకార్లే నండీ. చోటా మామ ది బెస్ట్ టెక్నీషియ‌న్‌. నిర్మాత మాత్రం కాదు. నా సినిమా ఆగిపోతున్న ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న్ని డ‌బ్బులు అడ‌గ‌ను. అలాంటి ప‌రిస్థితి కూడా రానివ్వ‌ను.

* సందీప్ కిష‌న్ అన‌గానే మంచి క‌థ‌ల్ని ఎంచుకొంటాడ‌న్న న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో క‌లిగింది. దాన్ని కాపాడుకోవ‌డానికి మీవంతుగా ఏం చేస్తున్నారు.?
- క‌థ‌ల విష‌యంలో చాలా ప‌క్కాగా ఉంటున్నాను. నూటికి నూరుశాతం నేను సంతృప్తిప‌డితేగానీ... సినిమాల్ని ఒప్పుకోవ‌డం లేదు. వ‌చ్చిన కొత్త‌లో.. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే క‌థ‌ల్ని ఎంచుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇప్పుడు అలా కాదు.. మంచి క‌థ‌లొచ్చే వ‌ర‌కూ ఎదురుచూస్తా. అందులో నాణ్య‌మైన‌వే ఎంచుకొంటా. లేదంటే ఖాళీగా ఉంటానే త‌ప్ప రాజీ ప‌డి సినిమ‌ల్ని చేయ‌ను. ఇది వ‌ర‌కు ఒక‌ట్రెండు సార్లు అలా చేశా. ఆ ఫ‌లితాలు పాఠాల్ని నేర్పాయి. చేసిన త‌ప్పుల్ని చేయ‌కుండా ముందుకు వెళ్తేనే.. మంచి ఫ‌లితాలొస్తాయి.

* మీ కెరీర్ ప‌ట్ల ఇంట్లోవాళ్లు హ్యాపీగానే ఉన్నారా?
- పూర్తిగా. నా బ‌లం.. వాళ్లే. వాళ్ల ఇష్టాయిష్టాల్ని నాపై ఎప్పుడూ బ‌ల‌వంతంగా రుద్ద‌లేదు. నా అభిప్రాయాల్ని గౌర‌వించారు. ఇప్పుడు నా విజ‌యాల్నీ ఆస్వాదిస్తున్నారు. ఒక ర‌కంగా నాకు సినిమాల‌పై ప్రేమ పెర‌గ‌డానికి కార‌ణం వాళ్లే. చిన్న‌ప్పుడు ప్ర‌తి పుట్టిన రోజుకీ... ఓ కొత్త సినిమాకి తీసుకెళ్లేవారు. ఫ్యామిలీ అంతా క‌ల‌సి సినిమా చూసేవాళ్లం. ఆ సంబ‌ర‌మే వేరుగా ఉండేది. అందుకే నాకు పుట్టిన‌రోజు అన‌గానే... సినిమా గుర్తొచ్చేది. అలా అలా సినిమాల‌పై ప్రేమ పెరిగింది.

* యంగ్ హీరోల విష‌యంలో క‌థానాయిక‌ల కొర‌త ఉందంటారా?  మీ సినిమాల విష‌యంలో క‌థానాయిక ఎంపిక ఎవ‌రిది?
- నా సినిమాల్లో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ద‌ర్శ‌కులే నిర్ణ‌యిస్తారు. అందులో నా ప్ర‌మేయం ఏం లేదు. తెలుగునాట వెత‌కాలే కానీ.. చాలామంది ప్ర‌తిభావంతులైన అమ్మాయిలు దొరుకుతారు. వాళ్లంద‌రికీ ఛాన్సిస్తే.. ఖ‌చ్చితంగా హీరోయిన్లు లేని లోటును తీర్చొచ్చు.

* ఇప్పటి వ‌ర‌కూ మీరు చేసిన సినిమాల్లో బాగా నిరాశ ప‌రిచిన సినిమా ఏది?
- జోరు. క‌థ విన్న‌ప్పుడు థ్రిల్లింగ్‌గానే అనిపించింది. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

* సిక్స్‌ప్యాక్ చేస్తారా?
- టైగ‌ర్ కోసం మూడు నెల‌లు క‌ష్ట‌ప‌డి చేశానండీ బాబూ. ఈ సినిమాలో కండ‌లు చూపించే సీన్ కూడా ఒక‌టుంది. కానీ.. క‌థ‌కు అడ్డొస్తుంద‌ని చెప్పి తీసేశాం.

* మ‌రి బాధ అనిపించ‌లేదా?
- ఏం చేస్తాం..??  క‌థ‌కు అడ్డొస్తే.. తీసేయ‌క త‌ప్ప‌దు. ఇంకెప్పుడైనా కండ‌లు చూపించే ఛాన్సొస్తుందేమో చూడాలి.

* బాలీవుడ్‌లో మ‌ళ్లీ ఎప్పుడు న‌టిస్తారు?
- ఏమో.. షోర్ ఇన్ ద సిటీ లాంటి క‌థొస్తే త‌ప్ప‌కుండా చేస్తా..

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
black beauty