Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

కథాసమీక్షలు - .

కథ : సర్దుకుపోతే సంతోషం!
రచయిత్రి: కె. శ్రీలత
 సమీక్ష : -ప్రతాప వెంకట సుబ్బారాయుడు
గోతెలుగు 83వ సంచిక!

ఒక కథ పాఠకులకు నచ్చాలంటే?

కథాంశం నేలవిడిచి సాము చెయ్యకూడదు. అతిశయోక్తులు, అసందర్భాలూ ఉండకూడదు. మనకు నిత్యకృత్యమైన సన్నివేశాలతో, పాత్రలు మనమధ్యే కదలాడుతూండేవయితే పాఠకులు కథలో మమేకం అయిపోతారు. చదివాక చక్కటి కథ చదివిన అనుభూతితో మనస్ఫూర్తిగా అభినందిస్తారు.

అలా మంచి కథగా ముద్రవేసుకున్నదే సర్దుకుపోతే సంతోషం!

కథ సంక్షిప్తంగా చెప్పాల్సొస్తే, వినీల ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తుంటుంది. అందరి ఆడవాళ్లలాగానే పొద్దున్నే నిద్రలేచి ఇంటిపని, వంటపని, పిల్లల్ని స్కూలుకు ప్రిపేర్ చేయడం లాంటి పనులతో కుడితిలో పడ్డ ఈగలా గిల గిల్లాడుతూంటుంది. భర్త శ్రీహరి ఆమెకు సహాయం చేయకపోగా తన ఆఫీసు పని కూడా ఆమె లీజర్ పిరియడ్ లో చేసిపెట్టమంటాడు. ఆ లీజర్లోనే పిల్లల యూనిట్ టెస్ట్ లకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు తయారు చేయాలికాబట్టి, ససెమిరా అంటుంది వినీల. శ్రీహరి ఆమెమీద విసుక్కుని ఆఫీసుకు వెళ్లిపోతాడు.
స్కూలుకు రావడం కొద్దిగా ఆలస్యం అయితే సంతకం పెట్టడానికి సహాయపడతాడు కాబట్టి అటెండర్ శ్రీనుకు డబ్బు సహాయం చేస్తుంది. అలాగే ఇంచార్జ్ సార్ అడిగిన హెల్ప్ చేయకపోతే, ఆ అక్కసుతో తనను తర్వాత్తర్వాత లీజర్ పిరియడ్ లో కూడా క్లాసులు తీసుకోమని ఇబ్బంది పెడతాడని, సహాయం చెయ్యడానికి ఒప్పుకుంటుంది.

వినీల ఇంటికొచ్చాక క్వశ్చన్ పేపర్లు తయారు చెయ్యాలని కూర్చుని ‘స్కూల్లో అటేండర్ నుంచి ప్రిన్స్ పల్ వరకు అందరితో ఇగోను పక్కన బెట్టి సర్దుకుపోవాల్సి వస్తుంది. కానీ జీవితాంతం తోడూ నీడగా ఉండే భర్త విషయంలో మాత్రం సర్దుకుపోలేక చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలతో కాపురంలో మనశ్శాంతి లేకుండా చేస్కుంటోంది కాబట్టి ఇహనుంచి భర్తకు, తనకు చేతనైన సహాయం చెయ్యాలనుకుంటుంది.
అక్కడ ఆఫీసులో శ్రీహరి-

ఇద్దరు లేడి కొలీగ్స్ మాట్లాడుకుంటున్న మాటల్లో-ఒకావిడ తన భర్త ఇంటి పనిలో సహాయం చేయడం వల్ల తనకు ఎంతో రిలీఫ్ గా ఉండి, ఆఫీసు పని ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నానని చెప్పడం విని, పాపం తన భార్య ఇంటి పనితో ఎంత సతమత మవుతోందో అని పశ్చాత్తాప హృదయంతో..ఇహనుంచి ఆమెకు సహాయం చెయ్యాలనుకుంటాడు.

కథలో చివరిగా-

నేటి యాంత్రిక జీవన విధానంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్కుంటూ , తోటి ఉద్యోగస్తులతోనూ..తమ కంటే క్రింది స్థాయి ఉద్యోగస్తులతోనూ, పై స్థాయి అధికారులతోనూ, అన్ని విషయాలలో రాజీపడుతూ సర్దుకుపోవడం తప్పనిసరి..అది అవసరం కూడా..అలాగే...

జీవిత భాగస్వామి పట్ల కూడా సాధ్యమైనంత వరకూ సహనం వహిస్తూ ఒకరికొకరు  చేతనైనంత సహాయం చేసుకుంటూ సర్దుకుపోతూ అలకలకూ, అపార్థాలకూ తావివ్వకుండా సంతోషాన్ని పంచుకుంటుంటే, " గృహమే కదా స్వర్గసీమ " అనే నానుడి ఖచ్చితంగా అందరిపట్లా నిజమౌతుంది.

అన్ని సంసారాలకూ అవసరమైన చక్కటి సందేశం(?)తో కథ ముగిస్తారు రచయిత్రి.

ముందే చెప్పుకున్నట్టు కథాంశం ఇంటింటికీ సంబంధించినదీ, ఆకట్టుకునేదీ అవడంతో 20 ప్రశంశాత్మక కామెంట్లు, 67 లైకులతో రచయిత్రికి జయహో పలికారు పాఠకులు.

  ఈ కథను ఈ క్రింది లింక్ లో   చదవచ్చు.....http://www.gotelugu.com/issue83/2216/telugu-stories/sardukupote-samtosham/.

మరిన్ని శీర్షికలు
madhurangaa ..aarogyangaa