Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ బాలి గారి చిత్రకళా ప్రదర్శన - పార్నంది వేంకట రామ శర్మ,

విశాఖపట్నం లో శ్రీ బాలి గారి రెండు రోజుల చిత్రకళా ప్రదర్శన


ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ అయిన శ్రీ బాలి (మేడిశెట్టి శంకరరావు) గారి రెండు రోజుల చిత్రకళా ప్రదర్శన విశాఖపట్నం లోని పౌర గ్రంధాలయం, ద్వారకానగర్ లో 13-9-2016 నాడు ఉదయం 10 గంటలకు ప్రారంభమై,      14-9-2016 సాయంత్రం 800 గంటలకు ముగిసింది.  SAA (సూర్య అకాడెమీ ఆర్త్ర్స్) విశాఖపట్నం అధినేత శ్రీ శంకర్ నీలు భాగవతుల వారి ఆధ్వర్యం లో ఏర్పాటైన ఈ ప్రదర్శన ఆచార్య జి. నాగేశ్వరరావు, (వైస్ ఛాన్సెలర్ విశాఖపట్నం) గారు ప్రారంభించగా, గౌరవ అతిధులు గా శ్రీయుతులు TSR ప్రసాద్ (అధ్యక్షులు, ది ఒలింపిక్స్ అసోసియేషన్, విశాఖ), గంట్ల శ్రీనుబాబు(అధ్యక్షులు, వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం), సిహెచ్. వాసు ప్రకాష్ (డైరక్టర్, శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలు) విచ్చేశారు. స్వయం గా చిత్ర కళాకారులు అయిన SAA వ్యవస్థాపకులు శ్రీ శంకర్ నీలు గారు మాట్లాడుతూ, తాను పది సంవత్సరాలు గా వ్యక్తిగతం గా అనేకమందికి పిల్లల నుండి పెద్దల దాకా చిత్రకళ లో ప్రవేశం కల్పించినట్టు, మూడేళ్ల క్రితం తన తల్లి గారి పేర స్థాపించిన SAA సంస్థ ద్వారా చిత్రకళ, ఇతర కళల ద్వారా సమాజం లో చైతన్యం తీసుకురావడానికి, యువత కి కళల పట్ల ఆసక్తి, సహజ హితం కలిగించడానికి  ఇంతవరకు పది సార్లు వివిధ కళల్లో నిష్ణాతులైనవారి వ్యక్తిగత ప్రతిభా ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఈ పదవ ప్రదర్శన ద్వారా, విశాఖపట్నం లో స్థిరపడిన శ్రీ బాలి గారి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

బాలి గారి చిత్రాల పట్ల ఆకర్షితులైన  గౌరవ అతిధులు మాట్లాడుతూ, విశాఖ యువత కే కాకుండా, రాష్ట్ర వ్యాప్తం గా చిత్రకళ పట్ల ఆవాహన, ఆసక్తి కలిగించేలా శ్రీ బాలి గారు వివిధ కాలేజీల్లో ప్రదర్శనలు, వర్క్ షాప్ లు నిర్వహించాలని, అందుకు తగిన సహాయ సహకారాలు తాము అందజేయగలమని కోరారు.

ప్రదర్శన లో ఉంచబడ్డ శ్రీ బాలి గారి చిత్రాలు రాశి లో తక్కువైనా, వాసి లో మిన్నగా ఉంటూ, సందర్శకులని ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యం గా “ కాళిదాస శృంగార తిలకం, ఆముక్తమాల్యద (తిరుప్పావై), అన్నమయ్య శృంగారకీర్తనలు, ఉమార్ ఖాయామ్ రుబాయత్ లు, సచిత్ర సంపూర్ణ రామాయణం, కాలచక్ర (గౌతమ బుద్ధుడు) వంటి కావ్యాల, సంకలనాల నుండి  తీసుకున్న కొన్ని ఘట్టాల చిత్రాలలో శ్రీ బాలి గారి కుంచె విన్యాసం అద్భుతం గా ఉంది. 

కొన్ని ఆయిల్ పెయింటింగ్స్, చిల్డ్రన్ కామిక్  స్ట్రిప్స్ (చైనా లో ప్రచురితం) తో పాటు వివిధ పత్రికల్లో కధలకు ఆయన వేసిన ఇలస్ట్రేషన్స్, కధా సంపుటలు, నవలకి వేసిన ముఖచిత్రాలు, కొన్ని కార్టూన్లు కూడా ప్రదర్శన లో చోటు చేసుకున్నాయి. చాలా వరకు ఒరిజినల్స్ ప్రదర్శించారు.

తెలుగు తానాన్ని, తెలుగు సంస్కృతి ని ప్రతిబింబించే చిత్రాలు రచించడం తనకెంతో ఇస్తామని చెప్పారు శ్రీ  బాలి గారు.  “ప్రవరుడు-వరూధిని , కులీ కుతుబ్ షా-భాగమతి, సలీం-అనార్కలి, యెంకి-నాయుడుబావ, దుష్యంతుడు-శకుంతల , నలుడు-దమయంతి, కృష్ణుడు-రాధ వంటి పురాణ, చారిత్రాతక ప్రముఖులు తమ “ఫేమస్ లవర్స్” అని చెప్పే శ్రీ బాలి గారి చిత్రాల్లో రంగుల మేళవింపు, ముఖ కవళికలు, భంగిమలు, చిత్ర నేపధ్యం (back ground) ఎంతో అందం గా ఉంటూ, చూపరులని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఎంకి నాయుడు-బావ,  కులీ కుతుబ్ షా-భాగమతి  వంటి చిత్రాల్లో నేపధ్యం లోని పూదోటల దృశ్యం ఎంతో హృద్యంగా చిత్రించారు బాలి గారు. అలాగే ఆయిల్ పెయింటింగ్ లు, పురాణ ఇతహాస, చారిత్రాత్మక ఘట్టాలలోని బొమ్మల కి వేసిన రంగుల మేళవింపు, three dimensions, perspective view వలన చిత్రాలు ఎంతో అందంగా అమిరాయి. రాజస్తానీ కళ, లేపాక్షి చిత్రా కళ లో కూడా పట్టు సాధించి , కొన్ని బొమ్మలు రూపొందించారు బాలి గారు. అయితే అందరు కళాకారులు ఇలానే వేస్తారు కదా అని అనుకోవచ్చు కానీ ప్రతీ చిత్రకారుడు కి తనదైన శైలి  ఒకటుంటుంది. బాలి గారి ఆ శైలి కేవలం ఆయనదే. ఇది ఫలానా చిత్రకారుడి చిత్రం లాగా ఉంది అని అనిపించేలా ఉండదు.   కధలకి వేసే ఇలస్ట్రేషన్స్ లో కధా సారాంశం ని ఒకోసారి తన బొమ్మలోనే చెప్పేస్తే, ఇంకోసారి ప్రత్యేకమైన భంగిమలు చదవరులని ఆకట్టుకుంటాయి. రంగుల మేళవింపు, షేడ్స్ వంటి వాటిలో ఏబొమ్మకదే ప్రత్యేకత సంతరించు కుంటుంది. నిష్ణాతుడైన ఒక ఫోటోగ్రాఫర్ తన కెమెరా యాంగిల్స్ వివిధ భంగిమల్లో పెట్టి చిత్రాలు తీసినట్టే, బాలి గారు కూడా కొన్ని కొన్ని చిత్రాలు అటువంటి యాంగిల్స్ లో గీస్తారు. బహుశా ఈ కారణం వల్లనే నేమో ఆయన నాలుగు దశాబ్దాల పైబడి నేటికీ అనేక పత్రికలకి కధా చిత్రా రచయితగా, అనేక నవలలు, కధా, కవితా  సంకలనాలకి ముఖచిత్ర చిత్రకారుడిగా తన ప్రతిభని చాటుతూనే ఉన్నారు.

చిత్రాలు చూసిన పెద్దలు, ముఖ్యం గా సచిత్ర సంపూర్ణ రామాయణం (స్ట్రిప్) చూసిన కొందరు అడిగారు ఆయన్ని.. “ ఒక పెద్ద కాన్వాస్ పై దాన్ని చిత్రించి, అది చిన్నగా వచ్చేలా ఫోటో తీసి ఇక్కడ పెట్టారా అని?” అని. అలా కాదు, అది ఒరిజినల్ సైజ్ అని బాలి గారు చెప్పగా, అంత చిన్న చిన్న డీటైల్స్ ఆ బొమ్మలో ఎలా వేయగలిగారని ఆశ్చర్యపోయి, ఆయన్ని అభినందించారు. ఇంకా కొందరు బొమ్మకి వాడే బ్రష్, కలాలు, రంగుల  వివరాలు ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు . ఎంతోమంది ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న విద్యార్ధులు, ఇతర ఔత్సాహిక చిత్రకారులు  బాలి గారి చిత్రాలని ఆసక్తి గా తిలకించి, వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మొత్తం మీద రెండు రోజులపాటు చిత్రకళ పై ఆసక్తి ఉన్నవారందరూ వచ్చి బాలి గారి చిత్రాకళా విన్యాసాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. పండిత పామర రంజకం గా ఉన్న ఈ ప్రదర్శన కి విశాఖ కార్టూనిస్టులం కూడా వెళ్ళి బాలి గారితో మా  అనుబంధాన్ని ముచ్చటించి, వారికి మా అభినందనలు తెలిపాము. ఒక మంచి చిత్రకారుడి చిత్రాలని ఒకేచోట చూడగలగడం విశాఖవాసుల అదృష్టం. అందుకు శ్రీ బాలి గారికి, ఈ ప్రదర్శన నిర్వాహకులు శ్రీ శంకర్ నీలు భాగవతుల వారికి అభినందనలు.

మరిన్ని శీర్షికలు
sirasri question