Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

నాది ...నాది...నాదే... - ..

me..only me

మనలో ప్రతీవారికీ ఈ possessiveness అనేది, ఏదో విషయంలోనో, ఏదో వస్తువులోనో, అదీ కాదంటే, ఎవరో ఒకరి విషయంలోనో తప్పకుండా ఉంటూనే ఉంటుంది. పసిపిల్లల్ని చూస్తూంటాము, ఏదో ఒక బొమ్మమీద ఇలాటి గుణం ఉంటూంటూంది. చిన్నప్పుడెప్పుడో ప్రారంభం అయినది, పెళ్ళై పిల్లలు పుట్టిన తరువాత కూడా కంటిన్యూ అవుతూనేఉంటుంది, పరిస్థితులు అనుకూలిస్తే .

మామూలుగా ఇంటి ఆడపిల్లకి, చిన్నప్పుడు ఎంత పేచీ పెట్టినా, కొద్దిగా పెద్దయిన తరువాత, ఎన్ని సార్లు విసుక్కున్నా( మరి విసుక్కోదూ, ప్రతీదానికీ ఏదో ఒకటి అంటేనే కానీ ఒక్కరోజెళ్ళదు. డ్రెస్స్ సరీగ్గా వేసికోలేదనీ, ఊరికే షికార్లు కొట్టకుండా స్కూలు అయిన తరువాత ఇంటికి త్వరగా వచ్చేస్తూండమనీ, పధ్ధతిగా ఉండమనీ,ప్రొద్దుటే నిద్రలేచి స్నానాలు చేయమనీ, తిండి సరీగ్గా తినమనీ... ఒకటేమిటి, ప్రతీ దాంట్లోనూ ఆంక్షలే ...), పెళ్ళై కాపరానికి వచ్చేసి, పిల్లలు కన్న తరువాత , అప్పుడు మొదలౌతుంది ఈ "అమ్మ" అంటే possessiveness. అమ్మ అనే character మీద ఇంకోళ్ళెవరికీ హక్కు ఉండకూడదు. బస్ ! అంతే !! ఈ " అమ్మ" అనే ప్రాణికి, తను ఫోను చేసినప్పుడు "కట్" చేసే " హక్కు" లేదు. తను చెప్పే " పచర్ పచర్" అంతా నోరెత్తకుండా వినాలి. ఏ ఖర్మ కాలో ఈ పిల్ల ఫోను చేసినప్పుడే, ఎవరో వచ్చారని తలుపు తీసినా, కుక్కరు కూత పెట్టేసిందని "కొద్దిగా ఆగమ్మా..." అని కూడా చెప్పిన్నా అంతే "కోపం " వచ్చేస్తుంది. "నాతో మాట్టాడ్డం కన్నా ఎక్కువా అవన్నీ..." అని ఫోను పెట్టేసినా పెట్టేయొచ్చు. 

ఈ possessiveness అనేది ఇంకోలా ఉండేది.. కొడుక్కి అంత possessiveness అనేది లేకపోయినా ( ఉన్నా కానీ, మగపిల్లలకి దాన్ని ప్రకటించే పధ్ధతి అంత బాగా తెలియదులెండి !), కోడలు మాత్రం ఆ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసికుంటుంది. వదినగారు ఎక్కడ, అత్తగారిని మంచి చేసేసికుంటుందో అని దుగ్ధ !ఎప్పుడైనా ఆడపిల్ల పుట్టింటికి వచ్చిందని తెలిస్తే చాలు, మూడ్ మారిపోతుంది ఆ ఇంటి కోడలుకి.అక్కడకి ఏదో అత్తగారంటే ప్రేమా అభిమానమూ అని కాదు, ఆ కూతురు ఈవిడదగ్గరనుంచి ఏమేం దోచుకుపోతోందో అని బాధ ! ఇదో రకం possessiveness !

అత్తగారి మీద సర్వహక్కులూ తనవీ, తన పిల్లలవీనూ అనే భావంలో ఉంటుంది. వీటిల్లో ఆ అత్తగారికి ఒరిగేదేమీ ఉండదు. పాపం ఆ తల్లికి ఇద్దరు పిల్లలమీదా అభిమానం ఉంటుంది. కానీ ఏం చేస్తుంది? రేపెప్పుడో మంచం పడితే, ఆ కొడుకూ, కోడలే చేయాలిగా, అందుకోసం, తెలివిగా manage చేసుకుంటూంటుంది. కూతురిగురించి, కోడలు దగ్గరా, కోడలు గురించి కూతురి దగ్గరా చెప్పకుండా ...!

అలాగే మనవడూ, మనవరాలూ ఉంటారనుకోండి, ఈ మనవడు character తన మామ్మ దగ్గరకి ఎవరినీ రానీయడు, .ఇంకొంత మందుంటారు, వాళ్ళు వాడుకునే వస్తువులు ఓ స్కూటరో, కారో ఛస్తే ఇంకోళ్ళకి ఇవ్వరు, ప్రాణం మీదకొచ్చినా సరే ! కావలిసిస్తే టాక్సీలో వెళ్ళడానికి డబ్బులైనా ఇస్తారు కానీ... స్కూటర్, కారు, బైక్కు నో..నో...

చదువుకునే రోజుల్లో, కొంతమంది, తమ నోట్స్లులు ఛస్తే ఇంకోళ్ళని చూడనిచ్చేవారు కాదు. దాన్ని possessiveness అనండి లేకపోతే, తన నోట్సులు చదివేసి అవతలవాళ్ళు బాగుపడిపోతారేమో అనండి, మీ ఇష్టం. రోడ్డు మీద వెళ్తున్నప్పుడో, బస్సులో వెళ్తున్నప్పుడో, రైల్లో వెళ్తున్నప్పుడో, ఏ పసిపిల్లో కనబడి, ఆ పిల్లని ముద్దు చేయండి తెలుస్తుంది ! నాలుగు రోజులు తిండుండదు ! మీ ప్రేమా, అభిమానం ,అన్నీ మీ పిల్లలమీదే కానీ ఊళ్ళోవాళ్ళ పిల్లలమీద కాదు చూపించడం...

ఏదో రిటైరయిపోయారూ, నాలుగూళ్ళూ తిరిగొద్దామని అనుకున్నారే అనుకోండి.. ఊళ్ళోనే ఉండే కూతురు - "అస్తమానూ ఊళ్ళు వెళ్ళకపోతే హాయిగా ఇంటి పట్టునుండొచ్చుగా రెస్టు తీసికుంటే ఏం పోయిందీ.."- అంటూ జ్ఞానబోధలు. అలాగని పోనీ, ఎప్పుడైనా అమ్మా నాన్నలని చూడ్డానికి తీరికుంటుందా అంటే అదీ ఉండదు. ఏమిటో ఒక్కొక్కాళ్ళకి ఒక్కో రకం possessiveness....

గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు, చిన్నప్పుడేమిటిలండి, ఇప్పటికీ కొంతమందికి ఓ చిత్రమైన అలవాటుంది. తెలుగు/హిందీ సినిమా అభిమాన తారల ఫొటోలు, ఎక్కడ కనిపించినా దాచేసికోడం. ఇదివరకైతే అభిమాన తార ముఖపత్రంగా ఏ పత్రికైనా వస్తే, ఆ కాగితం తన నోట్సుకో, ఇంకోదానికో "అట్ట" వేసికోడం.పుస్తకమైనా చిరగొచ్చు కానీ, అభిమాన తార మాత్రం "చిరంజీవి" గానే ఉండేది. ఇంకోళ్ళెవరూ తన అభిమాన తార అంటే ఇష్ట పడకూడదు. కొంతమందికి స్వంత ఊరుమీద మమకారం ఉంటుంది. కర్మకాలి ఎవరైనా అక్కడకి వెళ్ళారన్నారా, చూసుకోండి, జుట్టు పీకేసికుంటాడు… వీడికి అక్కడ పనేమిటీ, వేషాలు కాపోతే .. అని..

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ possessiveness  అనే జాడ్యం లేనివారు బహుతక్కువ.  ఆ జాడ్యం మోతాదు మించనంతవరకూ పరవాలేదు. మించినప్పుడే  గొడవలొస్తూంటాయి.

సర్వేజనా సుఖినోభవంతూ…

-
భమిడిపాటి ఫణిబాబు 

మరిన్ని శీర్షికలు
lemon speciality