Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
lemon speciality

ఈ సంచికలో >> శీర్షికలు >>

గ్రామాల్లో ఈ వింత గ్రామాలు వేరయా..! - ..

 నగ్న చిత్రాల తాకట్టు..   


కొన్ని సంఘటనలే కాదు కొన్ని గ్రామాల గురించి విన్నాఆ గ్రామాల కట్టుబాట్లు గురించి విన్నా కూడా వామ్మో....  ఇలాంటి ఊళ్లు కూడా ఉంటాయా? అని ఆశ్చర్యంతో పాటు ఛీ...ఛీ.... అని అసహ్యం వేస్తుంది. అక్కడ ఎవరైనా అప్పు తీసుకోవాలంటే ఖచ్చితంగా తాకట్టు పెట్టాల్సిందే. ఇది ఎక్కడైనా ఉండేదే... ఇందులో వింతేముంది! అనుకుంటున్నారు కదూ... అక్కడే ఉంది ట్విస్ట్. ఆ గ్రామంలో ఏ బంగారమో, స్థలమో, ఇల్లో తాకట్టు పెడితే కుదరదు. అక్షరాలా ఆడవాళ్ళ నగ్న చిత్రాలను తాకట్టు పెట్టాలి. అవును మీరు చదివింది నిజమే! చైనాలో ఒక గ్రామంలో ఎవరైనా అప్పు చేయాలంటే ఆడవాళ్ళ నగ్న చిత్రాల వీడియోలను తాకట్టు పెట్టాల్సిందేనట. ఒకవేళ ఆ అప్పు తీర్చలేకపోతే ఆ ఆడవాళ్ళను శారీరకంగా వాడుకొని ఆ చిత్రాలను ఇంటర్నెట్లో పెడతారట. ఇది అక్కడ ఎంతో కాలంగా జరుగుతుందట. ఇటీవలే ఒక మహిళ పోలిసులకు ఫిర్యాదు చేయడంతో బయటకు వచ్చిందట.

హనుమద్వేషి ద్రోణగిరి 

హనుమంతుడిని పూజిస్తే సర్వ భయాలు దూరమవుతాయని,  అన్ని ఆపదలనుంచి రక్షించేవాడు హనుమంతుడని, అభయప్రదాత అని పూజలు చేస్తాం. కాని ఆ ఊర్లో మాత్రం పూజలు కాదుకదా కనీసం హనుమంతుడ్ని తలవను కూడా తలవరు. పైగా ఎవరైనా హనుమంతుడు అని ఉచ్చరిస్తే చాలు విరుచుకు పడిపోతారు. మనల్ని కొట్టినంత పనిచేస్తారు. పొరపాటున ఎవరైనా హనుమంతుడ్ని ఆరాదించినట్టు తెలిస్తే ఇక అంతే సంగతులు ఏకంగా ఊరినుంచే బహిష్కరిస్తారు. ఎందుకలా...? ఆ ఊరి ప్రజలు ఆంజనేయుని ఎందుకంత ద్వేషిస్తారు? అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే... అంజనేయుడు తమ ఊర్లో దొంగతనం చేసాడు. అందుకే అతడిని ద్వేషిస్తాం అంటారు. ఏంటి.... అంజనేయుడు దొంగతనం చేసాడా!? వినడానికే వింతగా ఉంది కదూ....అవును అంజనేయుడు దొంగతనం చేసాడట. 
రామరావణ యుద్ధం జరుగుతున్నపుడు రావణాసురుని కొడుకు మేఘనాధుడు చేసిన ఆయుధ ప్రయోగానికి లక్ష్మణుడు మూర్చపోయినపుడు లక్ష్మణుడిని బతికించడానికి అంజనేయుడు సంజీవినీ పర్వతాన్ని తీసుకుపోయి లక్ష్మణుడిని బతికించాడు. ఆ సంజీవినీ పర్వతమ్ ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరా జిల్లాలో ఉన్న ఈ ద్రోణగిరి పక్కనే ఉండేదట. దానిని గ్రామంలోని భూటియా తెగ ప్రజలు దేవతగా భావించి పూజించేవారట. అందుకే  తాము దేవతగా పూజించుకునే సంజీవినీ పర్వతాన్ని దొంగతనంగా తీసుకుపోయిన అంజనేయుడంటే వారికి విపరీతమైన కోపం, ద్వేషం. ఆ ఊరిలో అంజనేయుడికి సంబంధించిన పేర్లు వినబడినా, పూజలు చేసినా చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఎవరైనా హనుమంతుడికి పూజలు చేసినట్టు తెలిస్తే వారిని ఏకంగా ఊరినుంచే బహిష్కరిస్తారు.

చనిపోయిన వారికి పెళ్ళిళ్ళు చేసే గ్రామం 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని షహరన్పూర్ జిల్లాలో మోహన్పూర్ గ్రామానిదయితే  మరీ విడ్డూరం. అక్కడ చనిపోయినవారికి పెళ్ళిళ్ళు చేస్తారట. చనిపోయినవారికి ఎలా పెళ్ళిళ్ళు చేస్తారనేగా మీ ప్రశ్న! ఇక్కడ చిన్న వయసులోనో, లేదంటే fవివాహం కాకముందే ఎవరైనా చనిపోతే, ఒకవేళ బ్రతికుంటే వారికి ఎప్పటికి వివాహ వయసు వస్తుందో సరిగ్గా ఆ వయసు వచ్చేసరికి వివాహం చేస్తారు. ఇదెలా సాధ్యం అనుకోకండి. చనిపోయిన ఆడపిల్ల కానీ మగపిల్లాడుగాని ఎవరైనా వారికి సరిపోయిన సంబంధాన్ని వెతుకుతారు. అంటే వారికి సరిపోయిన జోడి చనిపోయినవారిలో ఎవరున్నారో వెతికి, ఆ ఇద్దరి బొమ్మలను తాయారు చేస్తారు. ఆ బొమ్మలకు మామూలు వివాహం మాదిరిగానే అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే ఈ పెళ్ళిలో కానుకలు ఇచిపుచ్చుకోవడం కూడా ఉంటుందట.

భయంకరమైన ఆచారం 

కర్ణాటక లోని శ్రీ శాంతేశ్వర్ గుడిలో ప్రతి సంవత్సరం జరిగే ఒక ఆచారం చూస్తే ఒళ్ళు గగుర్పొడవకమానదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే ఒక ఉత్సవానికి వందల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అలా వచ్చిన వందలాదిమంది భక్తులు ఉత్కంఠగా చూస్తుండగా 50 అడుగుల ఎత్తున్న గుడి పైభాగం నుంచి రెండు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలను క్రిందికి పడేస్తారు. కింద ఉన్న పిల్లల తల్లిదండ్రులు దుప్పట్లతో వారిని పట్టుకుంటారు. ఇలా చేస్తే  దేవుడి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుందని ఆ గ్రామ ప్రజల నమ్మకం.

గ్రామమే ఓ..మిస్టరీ..  

ఇటలీలోని కనేటోడి కరోనియా గ్రామమయితే మిస్టరీకి మారుపేరుగా మారిపోయింది. ఒక దశాబ్ద కాలంనుంచి ఆ గ్రామంలో తరచుగా అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయట. అయితే ఆ అగ్నిప్రమాదాలకు కారణాలు ఏంటన్నది మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడంలేదు. 2004 లో ఆ గ్రామంలోని చాలామంది ఇళ్ళలో రకరకాలయిన అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఇవన్నీ కూడా ఎలాంటి కారణం లేకుండానే జరగడమే వింతయిన విషయం. ఎంతోమంది నిపుణులు, పరిశోధకులు వచ్చి ఎన్ని పరిశోధనలు చేసినా ఆ అగ్నిప్రమాదాలకు కారణమేమిటో తెలుసుకోలేకపోయారట. అగ్నిపర్వతాలకు సంబంధించిన పరిశోధకులు కూడా పరిశోధించారు. వారికీ విషయమేంటో అంతుపట్టలేదు. చివరకు ఇది ఉగ్రవాదుల పనేమో అని ఆ దిశగా పరిశోధనలు చేసారు. ఫలితం మాత్రం లేకపోయింది.

చివరికి ఇదంతా దుష్ట శక్తుల ప్రభావమేమోనని ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేసారట. అదీ ఫలితాన్నివ్వలేదు. ఈ అంతుపట్టని అగ్నిప్రమాదాలతో పాటు నీళ్ల పైపులు మంటలు మండడం, ఇస్త్రీకి పెట్టుకున్న బట్టలు వాటంతటవే కాలిపోవడం, చూస్తుండగానే మంటలు మండడం లాంటి ఎన్నో వింత సంఘటనలు జరగసాగాయి. ఇది ఏలియన్ల, ప్రభావమని కొందరు, దుష్టశక్తుల ప్రభావమని కొందరు, గ్రహాంతరవాసులు ఇచ్చిన శక్తుల ప్రభావంతో ఒక వ్యక్తీ ఇదంతా చేస్తున్నాడని ఇలా విభిన్న కారణాలను చెప్పుకోవడమే తప్ప ఖచ్చితమైన కారణం మాత్రం తెలియరాలేదట.

మావూరు.విజయలక్ష్మి 

మరిన్ని శీర్షికలు
beauty of himalayas