Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
killing him short flim

ఈ సంచికలో >> శీర్షికలు >>

తరతరాలు గుర్తుండే తాతాచారి కథలు - .

tatachaari kathalapai sameeksha

తాతాచారి కధలు అనేవి తాతా చారి చెప్పినవి ఆయన చెప్పిన కధలను లేఖకులు చేత వ్రాయించి 1855లో సి.పి .బ్రవున్ అప్పటి కడప జిల్లా కలెక్టర్  కథల సంకలనాన్ని ప్రచురించాడు. ముందుగా మనము తాతాచారి గురించి కొంత తెలుసుకోవాలి ఈయన అసలు పేరు నేలటూరి వెంకటాచలము ద్రావిడ బ్రాహ్మణుడు సి .పి బ్రవున్ వద్ద చిరుద్యోగి (వంటవాడు) పండితులను పిలిపించి వారిచేత తెలుగు గ్రంధాలకు సంబందించిన వ్యాఖ్యానాలు ఇతర రచనా వ్యాసంగాలకు, వారి వసతి భోజన సదుపాయాలనుఏర్పాటులో భాగముగా తాతాచారిని నియమించాడు తాతాచారి సహజముగానే హాస్యప్రియుడు సరసుడు కాబట్టి పండితులతో సాహిత్య చర్చలలో పాల్గొంటూ సమోయోచితముగా చిత్ర విచిత్ర కధలను చెపుతూ ఉండేవాడు అవే తాతాచారి కధలుగా రూపుదిద్దుకొని బ్రవున్ గారి పుణ్యమా అని అచ్చులోకి వచ్చినాయి ఆ కధలను స్వయముగా చదివి వాటికి వ్యాఖ్యానాలు వ్రాసి అచ్చు వేయించాడు మహానుభావుడు బ్రవున్.  ఈ కధలు ఆనాటి వ్యావాహరిక భాషకు చక్కటి నమూనాలు . రెండు వందల సంవత్సరాల క్రితము  మన తెలుగునాట ఉన్న సామాజిక వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాయి కధలలో మతాల గురించి వర్ణాల గురించి వాడిన   పదజాలము ఆనాటి సామాజిక స్థితిని తెలియజేస్తుంది, కానీ  ప్రస్తుతానికి  ఆ పదాలు కొంచెము ఎబ్బెట్టుగాను అభ్యంతరకరముగాను ఉంటాయి  

చార్లెస్ ఫిలిప్ బ్రవున్ అనే ఈ పేరు తెలుగు యువతకు అంతగా పరిచయములేనిది ఎందుకంటే ఆయన హాలీవుడ్ నటుడు కాదు క్రికెటర్ కాదు కానీ తెలుగు భాషకు అమూల్యమైన  సేవలు (తెలుగువారికన్నా )అందించిన మహనీయుడు 1798 నవంబరు పదో తేదీన కలకత్తాలో జన్మించిన ఈయన 1817లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరి మద్రాస్  సివిల్ సర్వీస్ అధికారిగా తెలుగునాట దాదాపు నాలుగు దశాబ్దాలు నివసించిన ఆంగ్లేయుడు. తెలుగు భాష మీద  బ్రవున్ కు అపారమైన ఆసక్తి అభిమానము ఉండటంవల్ల తెలుగు భాషను, సాహిత్యాన్ని ఎంతో శ్రద్ధతో అధ్యానము చేశాడు అంతేకాకుండా తన  ఖర్చుతో తెలుగునాట గల  పండితులను పిలిపించి వారికి వసతి సౌకర్యాలను ఏర్పరచి వారిచే వందల సంఖ్యలలో తెలుగు గ్రంధాలకు శుద్ధమైన పరిష్క్ర్తత ప్రతులను తయారుచేయించాడు తానె స్వయముగా అనేక రచనలను చేశాడు సమగ్రమైన అంధ్రా -ఆంగ్ల ,ఆంగ్ల-ఆంధ్ర నిఘంటువులను (డిక్షనరీ ) తయారుచేసాడు 1829లో వేమన పద్యాలను ఆంగ్లములోనికి అనువదించి ప్రపంచానికి అందించాడు గిడుగు రామ మూర్తిగారి వ్యావహారిక భాషోద్యమానికి ముందే తాతాచారి కధల సంకలలాన్నివిడుదల చేసినప్పటికీ రావలిసినంత గుర్తింపు రాలేదు

1820లో కడప జిల్లా కలెక్టర్ సహాయకుడిగా ఉద్యోగ జీవితములో ప్రవేశించిన బ్రవున్ ఆంధ్ర లో పలు ప్రాంతాలలో వివిధహోదాలలో పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరము ఇంగ్లండ్ వెళ్లిన తరువాత లండన్ విశ్వ విద్యాలయములో తెలుగు ప్రొఫెసర్ గా పని చేశాడు 1884 డిశంబర్ 12 వ తేదీన ఎనభయ్యారేళ్ల  వయస్సులో మరణించాడు ఈయన జీవితాంతము అవివాహితుడుగానే ఉండిపోయినాడు అందువల్ల  వారసులు అంటే మనుమళ్ళు లాంటి వాళ్ళు ఎవరు ఇంగ్లాండులో లేరు ఈ మధ్యయే ఒక  తెలుగు భాషాభిమాని ఇంగ్లండ్ లో వున్న ప్రవాసాంధ్రుడు డాక్టర్ పసుమర్తి సత్యనారాయణగారు బ్రవున్ గారి గురించి పరిశోధన చేసి ఎట్టకేలకు తుప్పల మధ్య ఉన్న ఆయన సమాధిని చూసి చలించి తన సొంత ఖర్చులతో బాగుచేయించి అధికారభాషా సంఘమువారికి తెలియజేశాడు తెలుగుభాషకు అంత సేవ చేసిన మహనీయాదికి మన తెలుగు రాష్ట్రాలలో ఏవిధమైన  మంచి స్మారక చిహ్నము లేకపోవటము  తెలుగు భాషకే భాధాకరము .

మచ్చుకు ఒక తాతా చారి కథను తెలుసుకుందాము.  ఈ కధ  పేరు "ఏకాదశి తాంబూలము కధ " ఈ కధకు మూలము ఒక సంస్కృత శ్లోకము ఈ శ్లోకము ఒక బాహ్మణుడికి ఒక  భ్ర ష్ఠుడికి మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది తాతాచారి ఈ శ్లోకాన్ని చెప్పి తరువాత కధ  చెపుతాడు

శ్లోకం:-భిక్షో మాంస నిషేవణం కిముచితం
             కింతేన మద్యం వినా
             మద్యం చాపితవ ప్రియం
             ప్రియమహో వారాంగనాభిస్సహ
             వారస్త్రీ రతయే కుత స్తవధనం
             ద్యుతేన చౌర్యేణ వా
             చౌర్య ద్యుత పరిశ్రమోపి భవతాం
             భ్రష్టస్య కా వా గతిః

తాత్పర్యం:-  బ్రాహ్మణుడు భ్రష్టుడిని ,"నీకు మాంస భక్షణ తగునా?"అని అడుగుతాడు దానికి ఆ భ్రష్టుడు మద్యము త్రాగే టప్పుడు మాంసము తినకుండా ఎలా ఉంటాను అని సమాధానము ఇస్తాడు "ఓహో తమరు మధ్య ప్రియులు కూడానా ?" అని మల్లి ప్రశ్నిస్తాడు దానికి భ్రష్టుడు ," వారకాంతలతో(వేశ్యలతో)  ఉన్నప్పుడు మద్యము ఇష్టపడతాను ", అని జవాబిస్తాడు. వారకాంతల దగ్గరకు పోవటానికి డబ్బెలా వస్తుంది అని మళ్ళి ప్రశ్నిస్తాడు , దానికి  జవాబుగా దొంగతనము, జూదము వల్ల  అంటాడు అప్పుడు,తమకు చౌర్యము (దొంగతనము) జూదము కూడా అలవాటేనా అని బ్రాహ్మణుడు ఆశ్చర్యముగా అడుగుతాడు. దానికి జవాబుగా "భ్రష్టుడు ఎలా బ్రతుకుతాడు మరి?"అని ఎదురు ప్రశ్న వేస్తాడు .

ఈ శ్లోక  తాత్పర్యము ఆధారముగా తాతాచారి ఏకాదశి తాంబూలము కథ చెపుతాడు. ఉదయానే ఒక బ్రాహ్మణుడు ఆగ్రహము (బ్రాహ్మణులు నివసించే వీధి) లో నడుస్తుండగా ఆయనకు ఒక అరుగు మీద కూర్చుని ఏకాదశి తిధినాడు తాంబూలము వేసుకుంటున్న మరో బ్రాహ్మణుడు కనిపిస్తాడు . "ఏమయ్యా బ్రాహ్మడా అన్ని తెలిసివుండి ఏకాదశినాడు ఉదయానే ఇలా తాంబూలము వేసుకోవటాము సబబేనా?" అని అడుగుతాడు . "ఉల్లిగడ్డలా కంపు పోవద్దా "అని ఆ బ్రాహ్మడు సమాధానము ఇస్తాడు

"అయ్యో ఉల్లిపాయలు కూడా తిన్నావా "అని ఆశ్చర్యముగా అడుగుతాడు . దానికి," చద్ది  అన్నము ఉల్లిపాయలు నంచుకోకుండా ఎలా తింటాను", అని జవాబిస్తాడు

"ఉపవాసము  ఉండవలసిన ఏకాదశినాడు చద్ది అన్నము  తిన్నావా?" అని ఆశ్చర్యముగా అడుగుతాడు
"చద్ది అన్నము తినక పొతే మేహకారకము(సుఖ వ్యాధి)అణిగేదెలా ?"అని ఎదురు ప్రశ్న వేశాడు
"సరి మేహకారక రోగము కూడానా", అని ఆ బ్రాహ్మణుడు ఇంకా ఏమి ప్రశ్నలు వేయకుండా వెళ్ళిపోతాడు

- అంబడిపూడి శ్యామసుందర రావు  

మరిన్ని శీర్షికలు
mee mata