Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahaasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - ..

sahiteevanam
పాండురంగమాహాత్మ్యము

'అత్యుత్తముడైన దైవము, అత్యుత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట వెలసిన స్థలము ఏది' అన్న అగస్త్యుని ప్రశ్నకు 'అందుకు సమాధానమును యివ్వగలవాడు  పరమశివుడే' అని చెప్పి అగస్త్యమునిని, ఆయన  సతీమణిని, శిష్యులను, తన పరివారాన్ని వెంటబెట్టుకుని కైలాసానికి చేరుకున్నాడు షణ్ముఖుడు. ఆసమయానికి పార్వతీసమేతుడై వనవిహారం  చేస్తున్నాడు 
పరమశివుడు. 

ప్రావృషేణ్య  పయోధర పటలిచేత 
గాడ్పు నీహారకర రేఖఁ గప్పుకరణి
ధరణిధరకార్ముకుడు శైలతనయఁ బొదివెఁ 
బచ్చడంబునఁ బొలుచు పూఁబచ్చడమున      (తే)

వర్షాకాలపు మబ్బులు గాలి తాకిడికి చంద్రరేఖను కమ్ముకున్నట్లు, కప్పివేసినట్లు మేరుపర్వతము అనే వింటిని ధరించినవాడైన (ధరణిధరకార్ముకుడు) పరమశివుడు పార్వతీదేవిని పూల ప్రక్కలో, లేదూ, పూవులు అనే వస్త్రముతో ఆచ్ఛాదించాడు, ఆక్రమించాడు. అంటే పూలతో కేళీవిలాసంగా ముంచెత్తాడు అమ్మవారిని.

పొదువు పరాగఘృష్టి మొగమున్, శ్రమవారిని మేను , భానుదీ
ప్తిడవుల వెచ్చుఁజన్గవయుఁ దేజము దాల్చెన కాని యొప్పుగుం
దదు నగపుత్రికప్డు; భసితంబున, వర్షముచేత, నగ్నిపైఁ 
గదురుట నద్దమున్ లతయుఁ గాంచనకుంభములున్ బెడంకునే?               (చ)

పూవుల పరాగపు కాంతితో ముఖము, చెమటలతో శరీరము, సూర్యతేజముతో వేడెక్కిన  వక్షస్థలము అమ్మవారి తేజస్సును యింకా హెచ్చేట్లు చేసింది కానీ ఆమె 'ఒప్పు' అంటే గొప్పదనము , లావణ్యము తగ్గలేదు. భస్మముచేత అద్దము, వర్షముతో లత, అగ్నిచేత స్వర్ణకుంభములు యింకా వన్నెకెక్కుతాయి కానీ వడలిపోతాయా, చలిస్తాయా? అద్దమును బూడిదతోనే, రజనుతోనే శుభ్రము చేస్తారు, కనుక పుప్పొడి రేణువులతో  అమ్మవారి చెక్కుటద్దములు యింకా తళతళలాడిపోయాయి. ఆమె తనువు తీగవంటిది,  తీగకు వర్షధారలు కొత్తకళను తెచ్చినట్లే ఆమె శరీరానికి చెమటలవర్షము కళను పెంచింది. బంగారము కాల్చినకొద్దీ వన్నెకెక్కుతుంది, బంగారపు కలశములవంటి ఆమె వక్షోజములు  సూర్యుని వేడిమికి యింకా కాంతివంతములు అయినాయి. ఆమె ముఖము చెక్కిళ్ళు  అద్దములని, ఆమె తనువు లతవంటిది అని, ఆమె వక్షోజములు స్వర్ణకలశములవంటివి  అని నేరుగా చెప్పకుండా, అందంగా పరోక్షంగా చెబుతున్నాడు తెనాలి రామకృష్ణుడు.

బొమలెక్కించిన విల్లువంచు, నునుఁజూపుల్ చంచలాచంచల 
క్రమరేఖన్ నిగిడింప శాతవిశిఖౌఘంబుల్ మెయిన్ నించు నె
య్యమునన్ బల్కఁగ నల్క మీరి చటులజ్యాఘోషమున్ జేయు, న
య్యుమ ప్రాపొంది రతీశ్వరుడు హరు బిట్టోడింప నూటాడుచున్          (మ) 

పార్వతీ పరమేశ్వరుల సేవజేయడంకోసం అన్నిఋతువులూ అక్కడికి వచ్చి చేరాయి అని,అన్ని ఋతువులలో పూచే పూలు విరగబూచాయి అని ముందే తెలుసుకున్నాము. కనుక మన్మథుడు కూడా వచ్చాడు అక్కడికి. పాత పగను ఇప్పటికైనా తీర్చుకునే అవకాశం వచ్చింది అనుకున్నాడు, అమ్మవారి అండతో తను ఈ సారి ఖచ్చితంగా గెలుస్తాడు అని అనుకున్నాడు బహుశా. వనవిహారం కేళీవిలాసంగా చేస్తున్నారు పార్వతీ పరమేశ్వరులు.అయ్యగారి మనసు సరసవంతంగా ఉన్నది.అమ్మ  కనుబొమ్మలు 'ఏమిటి' అన్నట్లు చూస్తూ పైకి లేపినపుడు, మన్మథుడు తన వింటిని వంచుతున్నాడు. ఆమె వ్రీడతో, మురిపెంగా పతిని చూస్తూ చంచలములైన చూపులనే 
బాణములను ప్రసరిస్తుంటే మన్మథుడు తన పూల బాణాలను తొడుగుతున్నాడు, వేసెయ్యడానికి. ఆమె నాథునితో ప్రేమగా పలుకుతుంటే మన్మథుడు పాత పగతాలూకు కోపంతో వింటి నారిని మ్రోగిస్తున్నాడు. యిలా ఆమె అండను చూసుకుని మన్మథుడు 
సంభ్రమిస్తున్నాడు, చెలరేగుతున్నాడు శివుని పరాజితుడిని చేయడానికి. అంటే వింటివంటి ఆమె కనుబొమలను ఆశ్రయిస్తేనే గానీ మన్మథుని వింటికి జయం  కలుగదు. ఆమె చూపులు అనే బాణాలను ఆశ్రయిస్తేనే గానీ మన్మథుని పూలబాణాలు  లక్ష్యాన్ని ఛేదించలేవు. ఆ'నారి' కంఠధ్వనిని ఆశ్రయిస్తేనేగానీ మన్మథుని 'వింటి నారి' మోతలు  సార్ధకములు కాలేవు. మన్మథుడు ఆమెను ఆశ్రయించడం అని పరోక్షంగా చెప్పడంలో కూడా  అమ్మవారి (శ్రీవిద్యా) ఉపాసకులలో అగ్రగణ్యులలో మన్మథుడు ఒకడు అని రహస్యంగా  ధ్వనిస్తున్నాడు రామకృష్ణుడు. యిదే భావాన్ని యింతే రమ్యంగా చెప్పారు మహానుభావులు జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు ఒక ఖండికలో, ' తీయవిల్కాడు వింట సంధించి విడిచె  అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము ; గౌరి కడగంటి చూపులో కలసిపోయి గుచ్చుకోనెనది  ముక్కంటి గుండెలోన' అని!    

చిగురులు దేరఁ జే నివిరి, చిక్కని చక్కని పూవు గుత్తులన్ 
బిగువుచనుంగవన్ బొదివి ప్రేలెడు చిల్కల జోప దేనియన్ 
బొగపిన పల్కులం బొగడి భూతపతిన్ మతి మెచ్చఁజేసె న
య్యగజ, తదుద్యమార్హ వినయానునయాభినయానుకూలతన్    (చ)

లేత చివుళ్ళను చేతితో నిమురుతూ, చక్కని చిక్కని పూలగుత్తులను తన వక్షస్థలముమీద  పొదవుకుని, అలంకరించుకుని, తేనెలు చిందే చిలుకలపలుకులను కురిపిస్తూ తనపతి, భూతపతి అయిన పరమశివుడిని పొగిడి, ఆయన మనసుకు సంతోషాన్నికలిగించే విధంగా 
తగిన వినయమును, అనునయమును, అనుకూలతను ప్రకటించింది, ప్రస్తుతించింది  పార్వతీదేవి.

ఈరీతిఁ బ్రమదవిపిన వి
హారంబొనరించి, హిమనగాత్మజయున్ గం
జారిరవిశిఖినయనుఁ డుప
చారంబులు సమద యువతిజన మొనరింపన్           (కం)   

ఈవిధంగా ఉద్యానవనములో విహరించి పార్వతీదేవి, చంద్రుడు-సూర్యుడు-అగ్ని అనే  మూడు కన్నులుగల పరమశివుడు యవ్వనవతులైన దేవతాకాంతలు ఉపచారములు  చేస్తుండగా కొలువు దీరారు. పరమశివుని కుడికన్ను సూర్యుడు, ఎడమకన్ను చంద్రుడు, మూడవకన్ను అగ్నిదేవుడు అని సంప్రదాయము, దాన్ని చెబుతున్నాడు తెనాలి రామకృష్ణుడు.

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
weekly horoscope 23rd september to 29th september