Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
majnu movie review

ఈ సంచికలో >> సినిమా >>

అనూ ఎమ్మానుయేల్ తో ఇంటర్వ్యూ

interview with  anu emmanuel
గ్లామ‌ర్ ని న‌మ్ముకొంటే త‌ప్పేంట‌ట‌!  - అనూ మ్మానుయేల్ 
 
తెలుగు హీరోయిన్‌.. కేరాఫ్ కేర‌ళ అనుకోవొచ్చు.
ఎందుకంటే అక్క‌డ్నుంచి వ‌చ్చి ఇక్క‌డ ఆధిప‌త్యం చెలాయిస్తున్న క‌థానాయిక‌లెంతో మంది ఉన్నారు. మ‌ల‌బారు భామ‌ల ప్ర‌త్యేక‌త ఏంటంటే... కేవ‌లం గ్లామ‌ర్ డాల్స్‌గా మిగిలిపోరు. అంతో ఇంతో న‌ట‌నా కౌశ‌లం కూడా చూపిస్తుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అభిన‌య‌మే వాళ్ల అందం అన్న‌మాట‌. అందుకే గ్లామ‌ర్ + యాక్టింగ్ స్కిల్స్‌ని మిక్స్ చేస్తూ ఎక్కువ కాలం ఇక్క‌డ రాజ్య‌మేలుతుంటారు. అను ఇమ్మానుయేల్ కూడా అలాంటి ఆశ‌ల‌తోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మ‌జ్నులో నానితో జోడీ క‌ట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. ఆక్సిజ‌న్ సినిమా కోసం గోపీచంద్‌తో చిందులు వేస్తోంది. ఈ సంద‌ర్భంగా గో తెలుగు జ‌రిపిన చిట్ చాట్ ఇదీ...
 
* హాయ్‌
- హాయండీ..
 
* మీకు ఇదే తొలి తెలుగు సినిమా.. టెన్ష‌న్ ఏమైనా ప‌డ్డారా?
- నిజం చెప్పాలంటే టెన్ష‌న్ ఏమీలేదు.  ఇక్క‌డ వాతావ‌ర‌ణం నాకు అల‌వాటైన‌దే అనిపిస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఉన్న‌ప్పుడు తెలుగు, త‌మిళ సినిమాల్ని బాగా చూసేదాన్ని. ఇక్క‌డి ప‌రిస్థితుల్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకొంటూ ఉండేదాన్ని. అందుకే.. ఆ తేడా ఏం తెలీలేదు.
 
* న‌ట‌న‌లో ఓన‌మాలు ఎలా దిద్దుకొన్నారు, న‌టిగా మీ ప్ర‌యాణం ఎలా మొద‌లైంది?
- బాల‌న‌టిగా కొన్ని మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించా. యాక్ష‌న్ హీరో బిజు అనే సినిమాతో క‌థానాయిక‌గా మారాను. ఆ సినిమా చూసే... నాకు తెలుగులో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. తెలుగు చిత్ర‌సీమ గురించి చాలా గొప్ప‌గా విన్నా. అందుకే ఎప్పుడెప్పుడు తెలుగు సినిమాల్లో న‌టిస్తానా అని ఉండేది.. ఆ అవ‌కాశం ఇంత త్వ‌ర‌గా వ‌స్తుంద‌నుకోలేదు.
 
* మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌కూ... తెలుగు చిత్ర‌సీమ‌కూ చాలా తేడా ఉంది క‌దా?
- క‌థ‌ల విష‌యంలో తేడా ఉందేమో?  చిత్రీక‌రించే ప‌ద్ధ‌తి ఎక్క‌డైనా ఒక్క‌టే క‌దా?  పైగా నాకు మ‌ల‌యాళ సినిమా గురించి ఎంత తెలుసో.. తెలుగు చిత్ర‌సీమ గురించి కూడా అంతే తెలుసు. కాబ‌ట్టి... తేడా ఏం తెలీలేదు.
 
* ఇంత‌కీ తెలుగు గురించి ఏం తెలుసుకొన్నారు?
- ఇక్క‌డ స్టార్స్ హ‌వా ఎక్కువ‌గా ఉంటుంది. పేరు. పాపులారిటీ కూడా త్వ‌ర‌గా వ‌స్తుంది. పైగా తెలుగు ప్రేక్ష‌కులు మంచోళ్లు. వాళ్ల‌కు బాషా బేధం ఉండ‌దు. ఎలాంటి సినిమానైనా ఆద‌రిస్తారు. ఇక్క‌డ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌దే ప‌ట్టం.
 
* మ‌రి అలాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఎప్పుడు న‌టిస్తారు?
- మ‌జ్ను అలాంటి సినిమానే. నా దృష్టిలో క‌మ‌ర్షియ‌ల్ అంటే.. అంద‌రూ చూసే సినిమా. మ‌జ్నులో ఆ ల‌క్ష‌ణం పుష్క‌లంగా ఉంది. ఆక్సిజ‌న్ ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అందులోనూ క‌మర్షియ‌ల్ హంగులు కావ‌ల్సిన‌న్ని ఉన్నాయి.
 
 
* మీ  వెంట మ‌జ్నులైవ‌రైనా ప‌డ్డారా?
- అబ్బాయిలు ప‌డ్డారు.. (న‌వ్వుతూ) కానీ అందులో మ‌జ్నులెవ‌రో నాకు నిజంగానే తెలీదు.
 
* ఇంత‌కీ మీ మ‌జ్ను ఎలా ఉంటాడు?
- చాలా స‌ర‌దాగా ఉంటాడు. సాధార‌ణంగా మ‌జ్ను అంటే యాంటీ సెంటిమెంట్ క‌థేమో అనుకొంటారు. కానీ అదేం ఉండ‌దు. సినిమా అంతా స‌ర‌దాగా సాగిపోతోంది. చాలా జోవియ‌ల్‌గా ఉంటుంది. మీకు చూడ్డానికి ఇదో ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలా క‌నిపిస్తుంది. కానీ.. అదేం కాదు. ప‌క్కా ప్యూర్ ల‌వ్ స్టోరీ.
 
* మీతో పోలిస్తే నాని చాలా సీనియ‌ర్ క‌దా.. త‌న‌తో న‌టించేట‌ప్పుడు ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారా?
- నాని గొప్ప న‌టుడు. అంత‌కు మించి చాలా మంచోడు. తాను అందించిన స‌హ‌కారంతోనే స‌న్నివేశాల్ని ఈజీగా లాగించేశాను. నాకొచ్చే ప్ర‌తీ డౌటుకీ నాని ద‌గ్గ‌ర స‌మాధానం ఉంటుంది. త‌న స‌ల‌హాల‌తో ఏదో గ‌ట్టెక్కేశా.
 
* తెలుగు రాదు క‌దా, ఇబ్బంది లేదా?
- ఇబ్బందిగా అనిపించింది. ఈ విష‌యంలో విరించి వ‌ర్మ‌కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. త‌ను చాలా ఓపిగ్గా నాకు సీన్లు చెప్పేవారు. ఈసారి త‌ప్ప‌కుండా తెలుగు పూర్తి స్థాయిలో నేర్చుకొని సెట్లో అడుగుపెడ‌తా.
 
* తెలుగు సినిమాల్లో రాణించాలంటే గ్లామ‌ర్ గా క‌నిపించాల్సిందే అంటుంటారు. ఆ మాట‌కు ఒప్పుకొంటారా?
- ఆ మాట‌లో వాస్త‌వం లేక‌పోలేదు. కానీ గ్లామ‌ర్‌గా క‌నిపించిన‌వాళ్లంతా స్టార్లుగా మార‌లేదు క‌దా. తెలుగునాట స్టార్లుగా ఎదిగిన‌వాళ్ల‌ని చూడండి. అంద‌రూ ప్ర‌తిభా వంతులే. వాళ్లు కేవ‌లం గ్లామ‌ర్‌ని న‌మ్ముకోలేదు. కానీ అలా న‌మ్ముకొన్నా త‌ప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పాత్ర మ‌నల్ని వెదుక్కొంటూ వ‌స్తుందో చెప్ప‌లేం. పాత్ర‌కు పూర్తి స్థాయి న్యాయం చేకూర్చాలంటే అందంగా క‌నిపించ‌డం త‌ప్పులేదు. అయితే మ‌న‌దైన మార్క్ ప్ర‌తీ సినిమాలోనూ ఉండాలి. లేదంటే రాణించ‌డం క‌ష్టం. 
 
*  మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుంది?  విమ‌ర్శ‌ల్ని స్వీక‌రించ‌గ‌ల‌రా?
- అంద‌రిలా సింపుల్‌గా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌తా. ఇక విమ‌ర్శ‌లంటారా వాటిని సీరియ‌స్‌గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే అంద‌రిలోనూ త‌ప్పులు ఉంటాయి. కానీ క‌నిపించ‌వంతే. ఎవ‌రైనా మ‌న త‌ప్పుని చూపిస్తే స‌రిదిద్దుకోవ‌డానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఓ మాట మాత్రం నిజం... అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌డం సాధ్యం కాదు. వంద మంది ఉంటే.. వేలెత్తి చూపించ‌డానికి ఎప్పుడూ ప‌ది మంది సిద్దంగా ఉంటారు.
 
* క‌థానాయిక‌గా మీ ప్రాధాన్యం..?
- క‌చ్చితంగా క‌థ‌కే. మంచి క‌థ దొరికిందంటే క‌చ్చితంగా క‌థానాయిక‌కు త‌గిన పాత్రే ప‌డి ఉంటుంది. కాబ‌ట్టి క‌థల్ని న‌మ్ముకొని గుడ్డిగా వెళ్లిపోవ‌డ‌మే మంచిది.
 
* ఓకే ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ.. 

-కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
katamarayudu is ready