Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మజ్ను చిత్ర సమీక్ష

majnu movie review

చిత్రం: మజ్ను 
తారాగణం: నాని, అను ఇమ్మాన్యుయేల్‌, ప్రియాశ్రీ, సత్య, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, రాజ్‌ తరుణ్‌ (అతిథి పాత్రలో) తదితరులు 
సంగీతం: గోపీ సుందర్‌ 
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ 
నిర్మాణం : ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ 
నిర్మాతలు: గీత, కిరణ్‌ 
దర్శకత్వం: విరించి వర్మ 
విడుదల తేదీ: 23 సెప్టెంబర్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

భీమవరం బుల్లోడు ఆదిత్య (నాని). ఇంజనీరింగ్‌ పూర్తి చేసి, ఉద్యోగం కోసం బెంగళూరు వెళాలనుకునేంతలో అతనికి కిరణ్మయి (అను ఇమ్మాన్యుయేల్‌) పరిచయమవుతుంది. ఆమె కోసం బెంగళూరు ప్రయాణాన్ని పక్కన పెట్టి, భీమవరంలోనే ఆమె చదువుతున్న కాలేజీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అలా ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. కొన్ని కారణాలతో కిరణ్మయికి ఆదిత్య దూరమవుతాడు. హైదరాబాద్‌లో ఆదిత్య, 'బాహుబలి' సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరతాడు. ఇంకో వైపు ఆదిత్యని తన బాయ్‌ఫ్రెండ్‌గా సుమ (ప్రియాశ్రీ) తన సన్నిహితులకి పరిచయం చేస్తుంటుంది. ఇంతకీ కిరణ్మయి ఏమయ్యింది? కిరణ్మయిని వదిలేసి ఆదిత్య, సుమతో ప్రేమలో పడ్డాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే

నాని నేచురల్‌ స్టార్‌. ఏ పాత్రలో అయినా సరే జీవించేస్తాడు. అతని సినిమాలకే అతనే పెద్ద ఎస్సెట్‌. స్టార్‌డమ్‌ని అతను దరిచేరనీయలేదు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోవడమే నాని స్పెషాలిటీ. ఈ సినిమాలోనూ అంతే. నాని ఆదిత్య పాత్రలో ఒదిగిపోయాడు. నటించడం కాదు, జీవించేశాడు. నాని ఏ సినిమాలో కనిపించినా పక్కింటి కుర్రాడిలానే ఉంటాడు. ఈ సినిమాతోనూ ఆ ప్రత్యేకతను చాటుకున్నాడు. 
హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్‌ ఆకట్టుకుంటుంది. నానితో ఆమె కెమిస్ట్రీ బాగా పండింది. క్యూట్‌గా ఉంది. నటనతోనూ మంచి మార్కులేయించుకుంది. ప్రియాశ్రీ ఓకే. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది. మిగతా ప్తాధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.

కథ పాతదే. కథనంలోనూ పెద్దగా కొత్తదనం కనిపించలేదు. సినిమాని ఎంటర్‌టైనింగ్‌గా మలచడంలో మాత్రం దర్శకుడు సఫలమయ్యాడు. డైలాగులు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. సంగీతం బాగానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సెకెండాఫ్‌లో అక్కడక్కడా ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగా పనిచేశాయి. నిర్మాణపు విలువలు చాలాబాగున్నాయి.

ప్రేమకథలు సరిగ్గా డీల్‌ చేస్తే రొటీన్‌గా ఉన్నా, యూత్‌ ఆడియన్స్‌కి ఎలాగైనా ఎక్కేస్తాయి. కాస్త రొమాంటిక్‌ టచ్‌, ఇంకాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌ తోడై, ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడగలిగేలా తీస్తే చాలు. ఆ సినిమాలు విజయవంతమైనట్లే. ఇది సక్సెస్‌ ఫార్ములా. దర్శకుడు ఈ ఫార్ములానే ఫాలో అయిపోయాడు. కొత్తదనం జోలికి పోలేదు. సినిమాలో ట్విస్టులు ఉండవని, సరదాగా సాగిపోయే సినిమా అని సినిమా యూనిట్‌ ముందు నుంచీ చెబుతూ వచ్చింది. అలాగే సినిమా ఆద్యంతం హాయిగా చూడగలిగేలానే అనిపిస్తుంది. అయితే సినిమా అంతా ఊహించగలిగేలానే ఉండటంతో ఎక్కడా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ అవదు. సస్పెన్స్‌ అసలే ఉండదు. కథలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సినిమాలో ఆడియన్స్‌ లీనమయ్యేలా చేస్తుంది. కానీ అది లేకపోయినా ఎంటర్‌టైన్‌మెంట్‌తో మేనేజ్‌ చేసెయ్యొచ్చని దర్శకుడు అనుకున్నట్టున్నాడు. అది కొంతవరకు వర్కవుట్‌ అయ్యింది కూడా. ఓవరాల్‌గా సినిమా నిరాశపరచదు. సినిమా ఆహ్లాదకరంగా సాగుతుంది గనుక నాని ఖాతాలో మరో మంచి సినిమా పడ్డట్టే.

ఒక్క మాటలో చెప్పాలంటే

'మజ్ఞు' కూల్‌ అండ్‌ లవ్‌ లీ

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with  anu emmanuel