Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Interview with Bhuvana Chandra

ఈ సంచికలో >> సినిమా >>

1000 అబద్దాలు - చిత్ర సమీక్ష

1000 Abaddalu Movie Review

చిత్రం: 1000 అబద్ధాలు
తారాగణం: సాయిరాం శంకర్, ఎస్తేర్, నాగబాబు, హేమ, బాబూమోహన్, సమీర్రెడ్డి, వైజాగ్ ప్రసాద్, నరేష్, కొండవలస, ఆర్జె హేమంత్ తదితరులు
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
సంగీతం: రమణ గోగుల
కూర్పు: గోపీ కృష్ణ
నిర్మాణం: చిత్రం మూవీస్
నిర్మాత: పాలడుగు సునీత
కథ ' స్క్రీన్ ప్లే ' దర్శకత్వం: తేజ
విడుదల తేదీ: 15 ఆగస్ట్ 2013

సంచలన దర్శకుడు తేజ, సరైన హిట్టు కోసం తపించిపోవాల్సి వస్తోంది. ఏం చేసినా, ఎన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నా అన్నీ బెడిసి కొట్టేస్తున్నాయి. ఒకప్పుడు తేజ సినిమాలో నటించే అవకాశం రావడమే అద్భుతం. యూత్ ని టార్గెట్ గా చేసుకుని తేజ తెరకెక్కించిన 'నువ్వు నేను', 'చిత్రం', 'జయం' సినిమాలు అద్భుత విజయాలు సాధించినా, ఆ తరహా సినిమాలు కాదు కదా, ఓ మోస్తరు సినిమా తెరకెక్కించి కూడా చాన్నాళ్ళే అయ్యింది. ఈ నేపథ్యంలో తేజ తాజా సినిమా '1000 అబద్ధాలు' సినిమా ఎలా వుందో తెలియాలంటో ఆలస్యమెందుకు, పదండిక.

క్లుప్తంగా చెప్పాలంటే:
వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్ళి చేయాలని పెద్దలన్నారు. ఆ మాట పట్టుకుని, తను ప్రేమించిన అమ్మాయి సత్యని పెళ్ళాడేందుకు చాలా అబద్ధాలాడతాడు సత్య. తన భర్త అబద్ధాలాడి తనను పెళ్ళి చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న సత్య, భర్తకి దూరమైపోతుంది. ఆ తర్వాత తన భార్యను సత్య ఎలా దక్కించుకున్నాడు, విడాకులు తీసుకున్న భార్యను మళ్ళీ భార్యగా సత్య చేసుకున్నాడా? లేదా అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే:
నటన పరంగా సాయిరాంశంకర్ ఇదివరకటి సినిమాలతో పోల్చితే మెరుగయ్యాడు. నటీ నటులనుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో దర్శకుడు తేజకి బాగా తెలుసు గనుక, అది సాయిరాంశంకర్ కి ప్లస్ అయ్యింది. ఓ మామూలు భర్త పాత్రలో సాయిరాంశంకర్ ఒదిగిపోయాడు. హీరోయిన్ గా ఎస్తేర్ ఫర్వాలేదన్పించింది. టవర్ స్టార్ గా నాగబాబు పాత్ర ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. ఆయన కన్పించినంతసేపూ థియేటర్లో నవ్వులు పూశాయి. హేమ, వైజాగ్ ప్రసాద్, నరేష్, కొండవలస తదితరులు తమ పాత్రల వరకూ మమ అన్పించారు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాబు మోహన్ చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కన్పించారు. తేజ సినిమాల్లో హీరో మిత్రబృందం హడావిడి చేస్తుంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా హీరో మిత్రబృందం నవ్వించింది.

ప్రేమకథా చిత్రాలు తీయడంలో ఒకప్పుడు అందెవేసిన చేయి అన్పించుకున్నా, ఇప్పుడు తేజ కామెడీలో పడ్డాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని ఈసారి ఎంచుకున్న తేజ, ఫస్టాఫ్ అంతా కామెడీ, రొమాన్స్ తో నింపేశాడు. సెకెండాఫ్ లో ఎమోషన్స్ పండాయి . నాగబాబు తదితరుల కారణంగా కామెడీ పాళ్ళు ప్రేక్షకుల్ని బాగానే నవ్వించాయి కాబట్టి, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదన్పించుకోవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే: ఓకే.

అంకెల్లో చెప్పాలంటే: 3 / 5

మరిన్ని సినిమా కబుర్లు
aadi shankara movie review