Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
1000 Abaddalu Movie Review

ఈ సంచికలో >> సినిమా >>

ఆది శంకర: చిత్ర సమీక్ష

aadi shankara movie review

చిత్రం: జగద్గురు ఆది శంకర
తారాగణం: కౌశిక్‌ బాబు, నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, తనికెళ్ళ భరణి, సాయికుమార్‌, కమలినీ ముఖర్జీ, రోహిని, శ్రీరామచంద్ర తదితరులు
ఛాయాగ్రహణం: పి.కె.హెచ్‌. దాస్‌
సంగీతం: నాగ్‌ శ్రీవత్స
నిర్మాణం: గ్లోబల్‌ పీస్‌ క్రియేటర్స్‌
నిర్మాతలు: జయశ్రీ దేవి, గ్లోబల్‌ సాయి ఫైనాన్షియర్స్‌
దర్శకత్వం: జె.కె. భారవి
విడుదల తేదీ: 15 ఆగస్ట్‌ 2013

ఆధ్మాత్మిక చిత్రాలు వస్తున్నాయంటే ఓ వర్గం ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంటోంది. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ తదితర చిత్రాలు సాధించిన విజయాలతో ఆ తరహా సినిమాలు వస్తున్నాయంటే, నటీనటులు కూడా పోటీ పడి అందులో నటించేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న సినిమాల్లో సైతం పెద్ద స్టార్లు కన్పిస్తున్నారు. అలాంటి సినిమాలకు ప్రేక్షకులూ బ్రహ్మరథం పడ్తున్న సందర్భాలున్నాయి. ఆ కోవలోనే వచ్చిన ‘జగద్గురు ఆదిశంకర’కు సంబంధించిన వివరాల్లోకి వెళదాం.

క్లుప్తంగా చెప్పాలంటే:
కేరళలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన శంకర, చిన్నప్పటినుంచీ ఆధ్యాత్మిక భావాలు కలిగి వుంటాడు. కారణ జన్ముడిగా అందరూ అతన్ని గుర్తిస్తారు. చిన్న వయసులోనే ఆధ్మాతిక భావాలతో, సన్యాసం స్వీకరించిన శంకర, ఆది శంకరగా ఎదుగుతాడు. ఆధ్మాతిక రచనాలతో జనుల మెప్పు పొందిన ఆది శంకర, ఛండాలుడు (నాగార్జున)ని కలిశాక తన ఆధ్మాతిక పయనాన్ని ఎటువైపు కొనసాగించాడు? ఆది శంకర జగద్గురుగా ఎలా మారతాడు? అన్నది మిగతా సినిమా కథ.

మొత్తంగా చెప్పాలంటే:
ఆది శంకర పాత్రకు అవసరమైన నటన విషయంలో కౌశిక్‌బాబుని మెచ్చుకుని తీరాలి. తనదైన హావభావాలతో పాత్రకు తగిన న్యాయం చేశాడు. సినిమా అంతటా తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించగలుగుతాడు. ఛండాలుడిగా నాగార్జున పాత్ర సినిమాకి హైలైట్‌ అని చెప్పొచ్చు. ఎప్పుడూ కమర్షియల్‌ సినిమాలే కాదు, ఇలాంటి సినిమాలతోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. స్టార్‌ హీరో అయినా, చిన్న పాత్రలకు సైతం వెనుకాడకపోవడం నాగ్‌ ప్రత్యేకత. సాయికుమార్‌, తనికెళ్ళ భరణి, శ్రీహరి తదితరులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. కమలినీ ముఖర్జీ, సుమన్‌, శ్రీరామచంద్ర తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

ఈ తరహా సినిమాల్ని తెరకెక్కించాలంటే అది పెద్ద సాహసం కిందే భావించాలి. కమర్షియల్‌ సినిమాలతో నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలనే ఆలోచనలకు భిన్నంగా తెరకెక్కుతుంటాయి ఇలాంటి సినిమాలు. ఆధ్మాత్మిక భావనల్ని పెంచడానికి ఈ తరహా సినిమాలు దోహదం చేస్తాయి. కేవలం ఆధ్మాత్మిక కోణంలోనే కాకుండా, సమాజంలో వేళ్ళూనుకుపోయిన మూఢ నమ్మకాల్ని పారద్రోలడానికీ, సాటి మనిషి పట్ల గౌరవం పెరగడానికీ, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగడానికీ ఉపయోగపడే మంచి మెసేజ్‌ ఇచ్చేందుకు ఆధ్మాత్మిక సినిమాలు దోహదం చేస్తాయి. దర్శకుడి ప్రయత్నం కూడా అదే అని సినిమా నడిచిన తీరు తెన్నులను బట్టి అర్థమవుతోంది.

అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో మాటలు, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, ఆహ్లాదకరమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ ఇవన్నీ సినిమాకి సరిగ్గా సమకూరాయి. దాంతో దర్శకుడి ప్రయత్నం విజయవంతమైనట్టే. ఓ మంచి ఉద్దేశ్యంతో రూపొందే ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తే, ఈ కోవలో మరిన్ని సినిమాలు రావడానికి అవకాశమేర్పడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే:
సంస్కృతీ సంప్రదాయాలు, ఆధ్మాతిక భావనల విలువ తెలియజేసే సినిమా.

అంకెల్లో చెప్పాలంటే : 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu