Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

విన్నర్‌ చిత్ర సమీక్ష

winner movie review

చిత్రం: విన్నర్‌ 
తారాగణం: సాయిధరమ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, అనూప్‌ సింగ్‌, ముఖేష్‌ రుషి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృధ్వీ, అలీ, అనసూయ తదితరులు. 
నిర్మాణం: లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్‌ 
సినిమాటోగ్రఫీ: ఛోటా కె నాయుడు 
సంగీతం: తమన్‌ 
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని 
నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ఠాగూర్‌ మధు 
విడుదల తేదీ: ఫిబ్రవరి 24, 2017 

క్లుప్తంగా చెప్పాలంటే 

హార్స్‌ రేసులంటే మహేందర్‌రెడ్డికి ఇష్టం. అది అతని కుమారుడు సిద్దార్ధ (సాయిధరమ్‌ తేజ్‌)కి నచ్చదు. ఆ కారణంగానే తండ్రికి దూరమయిన సిద్దార్ధ, సితార (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌)ని ప్రేమిస్తాడు. అయితే ఏ హార్స్‌ రేస్‌ల కారణంగా తండ్రికి దూరమయ్యాడో, అదే హార్స్‌ రేస్‌కి దగ్గరవ్వాల్సి వస్తుంది ప్రియురాలి కోసం. మరి ఇష్టం లేని హార్స్‌ రేస్‌ని ఎలా దగ్గర చేసుకున్నాడు? చిన్నప్పుడే తండ్రికి దూరమయిన సిద్దార్ధ, మళ్ళీ తండ్రికి దగ్గరయ్యాడా? హార్స్‌ రేస్‌ సిద్దార్ధ, సితారలను ఒక్కటి చేసిందా? అనేది ప్రశ్నలకు తెరపైనే సమాధానం దొరుకుతుంది. 

మొత్తంగా చెప్పాలంటే 

సినిమా సినిమాకీ మెచ్యూరిటీ పెంచుకుంటూ వెళుతున్న సాయిధరమ్‌ తేజ ఇందులో సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ చేయడానికి ప్రయత్నించాడు. కొంతవరకు అందులో సఫలమయ్యాడు కూడా. డైలాగ్‌ డిక్షన్‌లోనూ మార్పులు కనిపించాయి. డాన్సుల్లో ఈజ్‌ కొనసాగించాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఓవరాల్‌గా సాయిధరమ్‌ తేజ ఈ సినిమాలో కొంచెం కొత్తగా కనిపిస్తాడు. 

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గ్లామర్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? గ్లామరస్‌ ఇమేజ్‌ని కొనసాగించింది. గ్లామరస్‌గా కనిపించడమే కాకుండా, నటనతోనూ ఆకట్టుకుంది. పాటల్లో స్టైలిష్‌గా కనిపించింది, హీరోతో పోటీ పడి స్టెప్పులేసింది. జగపతిబాబు తన పాత్రలో ఒదిగిపోయాడు. ఆ పాత్రకి జగపతిబాబు కారణంగా ఇంకాస్త హుందాతనం వచ్చింది. విలన్‌ పాత్రని ఇంకొంచెం స్ట్రాంగ్‌గా మలచి ఉండాల్సింది. పృధ్వీరాజ్‌, అలీ తదితరులంతా కామెడీని బాగా పండించారు. ఫస్టాఫ్‌లో వీరి కామెడీ బాగానే హైలైట్‌ అవుతుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. 

కథ మరీ కొత్తదేమీ కాదుగానీ, అందులో హార్స్‌ రేస్‌ అనేది కొత్త కాన్సెప్ట్‌. తెర నిండా గుర్రాలతో నింపేశారు. అది కాస్త కొత్తగా అనిపిస్తుంది. కథనం ఓకే. ఇంకాస్త గ్రిప్పింగ్‌గా తెరకెక్కించి ఉండాల్సింది. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరం అనిపిస్తుంది. ముఖ్యంగా సెకెండాఫ్‌లో ఇంకా బాగా ఎడిటింగ్‌ చేసి ఉంటే బాగుండేది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకి రిచ్‌నెస్‌ తెచ్చిపెట్టింది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. నిర్మాణం పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కన్పిస్తుంది. 

ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. హీరో హీరోయిన్ల మధ్య ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌, అలాగే రొమాంటిక్‌ సీన్స్‌, కమెడియన్ల కామెడీ సీన్స్‌ ఇలా అన్నీ సినిమాని పరుగులు పెట్టిస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుంది. సెకెండాఫ్‌లో మాత్రం సినిమా స్లో అయినట్లన్పిస్తుంది. ఎమోషనల్‌ సీన్స్‌ కొన్ని కదిలిస్తే, ఇంకొన్ని సాగతీత అన్పిస్తాయి. సెకెండాఫ్‌లో డైలాగ్స్‌ బాగానే పేలాయి. ఇక్కడ ఇంకొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌ అవసరం అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించేలానే ఉంటుంది. పబ్లిసిటీ బాగా చేయడం ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్‌. హార్స్‌ రేసింగ్స్‌ థియేటర్లకి ప్రేక్షకుల్ని రప్పించే అవకాశముంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
రేసింగులో విన్నర్‌ - బాక్సాఫీస్‌ వద్ద కూడా ఓ మోస్తరు విన్నరే కావొచ్చు. 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka