Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నిన్నుకోరి చిత్రసమీక్ష

ninnukori movie review

చిత్రం: నిన్ను కోరి 
తారాగణం: నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్‌, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సుదర్శన్‌, విద్యుల్లేఖా రామన్‌, పృధ్వీ, రాజశ్రీ నాయర్‌, నీతూ, భూపాల్‌ రాజ్‌, కేదార్‌ శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ తదితరులు. 
సంగీతం: గోపీ సుందర్‌ 
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని 
దర్శకత్వం: శివ నిర్వాణ 
నిర్మాత: డివివి దానయ్య 
నిర్మాణం: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 07 జులై 2017

క్లుప్తంగా చెప్పాలంటే 
ఉమ అలియాస్‌ ఉమామహేశ్వరరావు (నాని), పిహెచ్‌డీ చేస్తుంటాడు. పల్లవి (నివేదా థామస్‌)తో ఉమ ప్రేమలో పడతాడు. పల్లవికి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తుండడంతో, ఆమె - ఉమ మీద ఒత్తిడి పెంచుతుంది ఎక్కడికైనా వెళ్ళిపోదామని. పోషించే శక్తి లేనప్పుడు ఇదంతా కుదరదనీ, పీహెచ్‌డీ పూర్తి చేశాక పెళ్ళి చేసుకుందామని పల్లవితో చెప్పి, ఢిల్లీకి వెళతాడు ఉమ. ఇంకో వైపున ఆరుణ్‌ (ఆది పినిశెట్టి)తో పల్లవి పెళ్ళయిపోతుంది. ఇది తెలిసి ఉమ, మద్యానికి బానిసవుతాడు. అమెరికా వెళ్ళిపోతాడు. పల్లవి, ఉమని వెతుక్కుంటూ రావడంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఎందుకొచ్చింది? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
నాని నేచురల్‌ స్టార్‌. సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంటాడు. ఏ సినిమా చేసినా అందులో పాత్ర తప్ప, నాని కనిపించడు. బాహుశా అదే నానిని మిగతా హీరోల కంటే భిన్నంగా చూపిస్తుందేమో. నాని స్టార్‌డమ్‌ లెక్కలోకి వెళ్ళకుండా, ఇమేజ్‌ చట్రంలోకి ఇరుక్కుపోకుండా నేచురల్‌ స్టార్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడంటే, దానికి అతని నటనా ప్రతిభే కారణం. ఈ సినిమాలోనూ నటించాడనటం కంటే జీవించాడనటం కరెక్ట్‌. నాని తప్ప ఇంకెవరూ ఆ పాత్రకి న్యాయం చేయలేరనడం అతిశయోక్తి కాదు. 

హీరోయిన్‌ నివేదా థామస్‌ క్యూట్‌గా కనిపించడమే కాదు, అద్భుతమైన రీతిలో భావోద్వేగాలు పండించగల గొప్ప నటి. తెలుగులో ఆమె ఇంతకు ముందు చేసింది ఒక్కటే సినిమా. ఆ సినిమాతోనే మంచి మార్కులేయించుకుంది. ఈ సినిమాతో ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేసింది నివేదా థామస్‌. తెలుగు తెరకు మరో మంచి హీరోయిన్‌ నివేదా థామస్‌ రూపంలో దొరికింది. 

ఆది తెలుగులో చేసిన సినిమాలకంటే తమిళంలో చేసిన సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ఆదికి నటుడిగా మంచి గుర్తింపునిచ్చే చిత్రమవుతుందిది. అద్భుతమైన నటనా ప్రతిభను కనబర్చాడు. ప్రధాన తారాగణం ముగ్గురూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి నటించడంతో సినిమాకి వారి నటన అదనపు బలంగా మారింది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు. 

కథ మరీ కొత్తదేమీ కాదుగానీ, కథనం నడిపించడంలో దర్శకుడు తనదైన ప్రత్యేకతను చాటాడు. సగటు ముక్కోణపు కథలకు భిన్నమైన రీతిలో పాత్రలు, కథనం నడుస్తాయి. నటీనటుల ప్రతిభను దర్శకుడు పూర్తిగా వాడుకున్నాడు. దర్శకుడికి తగ్గట్టుగా నటీనటులూ పూర్తిస్థాయి ఎఫర్ట్స్‌ పెట్టడంతో ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. మాటలు బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. ఎక్కడా రాజీ పడని నిర్మాతల నైజం అడుగడుగునా కన్పిస్తుంది. ఎడిటింగ్‌ బాగుంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్ప్‌ అయ్యాయి.

సున్నితమైన ముక్కోణపు ప్రేమకథ తెరకెక్కించడం అంత తేలిక కాదు. ఎంటర్‌టైనింగ్‌ సినిమాల వేవ్‌లో ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ కొంచెం తగ్గినా కష్టమే. ఇలాంటి సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్‌ తక్కువ ఉంటుంది. అయినా దర్శకుడు మెయిన్‌ లీడ్‌ మధ్య మంచి కాన్‌ఫ్లిక్ట్‌తో సినిమాని ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు. నాని - నివేదా మధ్య ప్రేమ, నివేదా - ఆది మధ్య వైవాహిక జీవితం, ఆ తర్వాత ముగ్గురి మధ్యా సంఘర్షణ తెరపై చూస్తోంటే మనకు తెలియకుండానే మనం ఆ పాత్రల చుట్టూ పరుగులు పెడుతుంటాం తర్వాత ఏం జరుగుతుందోనని. అంతలా దర్శకుడు మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేశాడు. సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌, నాని ఇమేజ్‌ ఇవన్నీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌. ఓవరాల్‌గా హార్ట్‌ టచ్చింగ్‌ స్టోరీతో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునేవారు కొంత నిరాశ పడక తప్పదు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
థ్రిల్లింగ్‌ కేశవ క్వయిట్‌ ఇంట్రెస్టింగ్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
nitin conduct test