చిత్రం: శమంతకమణి
తారాగణం: నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది, రాజేంద్రప్రసాద్, సుమన్, ఇంద్రజ, చాందిని చౌదరి, అనన్య సోని, జెన్నీ హనీ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్
నిర్మాణం: భవ్య క్రియేషన్స్
విడుదల తేదీ: 14 జులై 2017
క్లుప్తంగా చెప్పాలంటే
బాగా డబ్బున్న కృష్ణ (సుదీర్‌బాబు)కి చెందిన ఓ ఖరీదైన కారు మాయమవుతుంది. ఆ కారు పేరే శమంతకమణి. పార్టీలో కారు మిస్ అవడం, ఆ పార్టీకి హాజరైన ముగ్గురు వ్యక్తులు ఉమామహేశ్వరరావు (రాజేంద్రప్రసాద్), శివ (సందీప్ కిషన్), కార్తీక్ (ఆది)లపై అనుమానాలొస్తాయి. కేసు విచారణ కోసం రంజిత్‌కుమార్ (నారా రోహిత్) రంగంలోకి దిగుతాడు. ఆ ముగ్గురితోపాటు, రంజిత్‌కుమార్ కూడా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించేయాలనే ఆలోచనతో ఉంటాడు. మరి, శమంతకమణి ఎవరి సొంతమయ్యింది? అన్నది తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే
కాస్టింగ్ పరంగా భారీ సినిమా ఇది. సుధీర్‌బాబు, నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది తదితర యంగ్ హీరోలతోపాటుగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పాత్రల్లో దేనికీ తక్కువ, దేనికీ ఎక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఎవరి పాత్రల్లో వారు ఒదిగిపోయారు. సుధీర్‌బాబు, నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది తమ తమ పాత్రల్ని చాలా ఇష్టపడి చేసినట్లనిపిస్తుంది. నటించారన్నట్లు కాకుండా పాత్రల్లో జీవించేసినట్లుగా తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో ఏ పాత్రని చూసినా ఇది చిన్న పాత్ర అనే భావన కలగదు. ఎవరికి వారే తమ పరిధి మేర నటనతో మెప్పించడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో సక్సెస్ అయ్యారు కూడా. రాజేంద్రప్రసాద్, ఇంద్రజల మధ్య వచ్చే సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగా చేశారు.
కథ, కథనం అన్నీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. మాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. మ్యూజిక్ (ఒకే ఒక్క పాట), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు బలాన్నిచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. నిర్మాణపు విలువల విషయంలో ఎక్కడా రాజీపడలేదు. ఆర్ట్, కాస్ట్యూమ్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి.
సాధారణంగా ఇలాంటి సినిమాలు మొదట స్లోగా ప్రారంభమయి, పేస్ అందుకుంటాయి. అదో టెక్నిక్. ఈ సినిమా విషయంలోనూ దర్శకుడు అదే ఫాలో య్యాడు. ఫస్టాఫ్ నెమ్మదించినా, సెకెండాఫ్ జోరు జోరుగా సాగుతుంటుంది. ట్విస్ట్‌లు, ఆ ట్విస్ట్‌లు విడిపోయే సన్నివేశాలు, క్లయిమాక్స్ ఇలా అన్నీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా సినిమా ఓ మంచి ఫీల్‌ని మిగుల్చుతుంది. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అంతమంది హీరోలు, అన్ని పాత్రలు తెరపై హుషారుగా కన్పిస్తోంటే, చూసే ప్రేక్షకుడిలోనూ హుషారు కలగడం సహజమే. నవిస్తూనే థ్రిల్లింగ్‌గా సాగే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు అన్ని విధాలా అర్హత ఉన్నదే అనడం నిస్సందేహం.
ఒక్క మాటలో చెప్పాలంటే
శమంతకమణి థ్రిల్ చేస్తూనే నవ్వించేసింది.
అంకెల్లో చెప్పాలంటే: 3/5
|