చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ఎట్టకేలకు పట్టాలెక్కింది. బుధవారం 'సైరా నరసింహారెడ్డి' సినిమా తొలి సన్నివేశం చిత్రీకరణ జరిగింది. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్. అందులో నిర్మాత చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అలాగే సురేందర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కలిసి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జనరేషన్ డైరెక్టర్స్‌కి తగ్గట్లుగా తన పనితనం చూపిస్తుంటాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ఇండియాలోనే ది బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్‌లో ఒకరిగా ఆయనను అభివర్ణించవచ్చు. ఆయన ఈ సినిమాకి పని చేస్తున్నారు.
'సైరా'లో యాక్షన్ ఘట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంది. అందుకే హాలీవుడ్ ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ లీ విట్టేకర్ ఈ సినిమాకి స్టంట్స్ రూపొందిస్తున్నారు. అంటే ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇకపోతే సురేందర్ రెడ్డి డైరెక్షన్ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాని ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా సెట్స్ మీదికి వచ్చే ఈ రోజు వరకూ, గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారాయన. తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చరిత్రని ఏమాత్రం వక్రీకరించకుండా ఎంతో జాగ్రత్తగా ఈ చిత్రానికి దృశ్యరూపం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతీ విషయంలోనూ జాగ్రత్త అవసరమే. ఇంత గ్రౌండ్ వర్క్ జరగింది కాబట్టే ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంత ఆలస్యమైంది. ఎట్టకేలకు చిత్రీకరణ మొదలయ్యింది. వచ్చే ఏడాదిలో రిలీజ్ ఉంటుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్‌బీ అమితాబ్‌తో పాటు జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
|