బాలీవుడ్‌లో హీరోయిన్లుగా వారసులు బాగానే ప్రమోట్ అవుతూ ఉంటారు. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ టాప్ లిస్టులో హీరోయిన్‌గా కొనసాగుతోంది. అలాగే పలువురు వారసులు ఇప్పుడు హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు బాలీవుడ్‌లో. కానీ సౌత్ విషయానికి వస్తే, హీరోయిన్లుగా వారసులు చాలా తక్కువ. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్‌గా టాప్ లిస్టులో సత్తా చాటుతోంది. శృతిహాసన్ చెల్లెలు అక్షరాహాసన్ కూడా హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ బాటలో హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య, శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి ఇలా చాలా తక్కువ మంది మాత్రమే తెరపై కనిపిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్‌గా రానిద్దామనుకుంటే, అభిమానుల నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆమె నిర్మాతగానూ, ఇప్పుడు దర్శకురాలిగా కొనసాగుతోంది. నాగబాబు కూతురు నిహారిక 'ఒక మనసు'తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతో నిరాశపరిచినా, హీరోయిన్‌గా ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఆ తర్వాత ఇకపై తెలుగు తెరపై వారసులు రావడం కష్టమే అనుకున్నారంతా.
కానీ ఇప్పుడు మరో వారసురాలు తెరంగేట్రం చేస్తోంది. ఆమె ఎవరో కాదు, హీరో రాజశేఖర్ కూతురు శివానీ. శివాని తల్లి జీవిత కూడా హీరోయిన్‌గా నటించింది. కానీ కమర్షియల్ సినిమాలకు జీవిత దూరంగా ఉంది. కానీ కమర్షియల్ హీరోయిన్ అనదగ్గ స్థాయిలో ముందుగానే ప్రిపరేషన్స్ అన్నీ శివానీ కోసం సిద్ధం చేశారట. మరి శివాని కమర్షియల్ స్థాయిలో హీరోయిన్‌గా సత్తా చాటుతుందా..? లేక పర్‌ఫామెన్స్ రోల్స్‌తోనే సరిపెట్టుకుంటుందా.. చూడాలి మరి. వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో శివాని హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'టూ స్టేట్స్' సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. అడవిశేష్ హీరోగా నటిస్తున్నాడు.
|