చిత్రం: భాగమతి
తారాగణం: అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, ప్రభాస్ శ్రీను, ధన్‌రాజ్, మురళీ శర్మ, తలైవాసల్ విజయ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు.
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ఆర్.మది
దర్శకత్వం: జి. అశోక్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్
నిర్మాణం: యూవీ క్రియేషన్స్
విడుదల తేదీ: 26 జనవరి 2018
క్లుప్తంగా చెప్పాలంటే
ఐఏఎస్ అధికారి చంచల (అనుష్క), ఓ హత్య కేసులో జైలుకు వెళుతుంది. ఓ పొలిటికల్ లీడర్‌ని డీగ్రేడ్ చేయడానికి అతని దగ్గర పనిచేసిన చంచలను టార్గెట్ చేస్తారు కొందరు. ఈ క్రమంలోనే, ఆమెను విచారించేందుకోసం భాగమతి బంగ్లాకి తీసుకెళతారు. అయితే అక్కడ చంచల చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఇంతకీ భాగమతి బంగ్లా రహస్యమేంటి? నిజాయితీ గల అధికారిగా పేరొందిన చంచల, హత్య కేసులో ఎందుకు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే చూడాలి.
మొత్తంగా చెప్పాలంటే
అనుష్క, బాగమతి పాత్రలో కన్పింస్తుందనగానే అందరికీ జేజెమ్మ గుర్తుకొచ్చింది. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా అనుష్క తన నటనతో మంచి మార్కులేయించుకుంది. ఇన్నేళ్ళలో నటన పరంగా అనుష్కలో మెచ్యూరిటీ కొట్టొచ్చినట్లు కన్పిస్తుంది. ఐఏఎస్ అధికారి పాత్రలో అనుష్క హుందాతనం సింప్లీ సూపర్బ్. భాగమతి పాత్రలో అయితే చెలరేగిపోయింది. ఈ సినిమాకి బలం అనుష్క మాత్రమే అనేంతలా ఆమె పాత్రని రెండు షేడ్స్‌లో దర్శకుడు డిజైన్ చేస్తే, రెండింటికీ పూర్తిస్థాయిలో న్యాయం చేసిందామె.
దక్కింది చిన్న పాత్రే అయినా, ఉన్ని ముకుందన్ ఆకట్టుకుంటాడు. ఆశాభరత్ బాగా చేసింది. జయరాం పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ప్రభాస్ శ్రీను, ధన్ రాజ్, విద్యుల్లేఖ రామన్ నవ్వించేందుకు ప్రయత్నించారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అన్పిస్తారు.
కథ పరంగా లైన్ చిన్నదే అయినా, దర్శకుడు సినిమాని జాగ్రత్తగా డీల్ చేయడం అభినందనీయం. కథనం ఆకట్టుకుంటుంది. అయితే అక్కడక్కడా కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపించే సన్నివేశాలు, సినిమా గమనానికి అడ్డు తగులుతాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణంగా నిలిచింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగానే ఉన్నాయి. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఆర్ట్, కాస్ట్యూమ్స్ బాగా ఉపయోగపడ్డాయి.
హర్రర్ జోనర్‌లో కామెడీని మిక్స్ చేసేయడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. అయితే ఇందులో హర్రర్ జోనర్‌ని పొలిటికల్ థ్రిల్లర్‌ని మిక్స్ చేశారు. దాంతో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. హర్రర్ ఎలిమెంట్ తక్కువగా, థ్రిల్లింగ్ పొలిటికల్ డ్రామా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్న సమయంలోనే చిన్నపాటి స్పీడ్ బ్రేకర్స్ లాంటి సీన్స్ ఇబ్బందికరంగా మారతాయి. ఆ ఒక్కటీ పక్కన పెట్టేస్తే సినిమా ఓవరాల్‌గా ఆడియన్స్‌కి మంచి థ్రిల్ కలిగిస్తుంది. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి హైలైట్ పాయింట్. ఆమె కోసం ఖచ్చితంగా ఇంకోసారి చూడాలన్పించేలా సినిమాలో ఆమె పాత్రల్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఓవరాల్‌గా చూస్తే ఓ మంచి థ్రిల్లింగ్ మూవీ చూసిన భావన కలుగుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే
'అరుంధతి'తో పోల్చలేంగానీ, 'భాగమతి' కూడా ఆకట్టుకుంటుంది
అంకెల్లో చెప్పాలంటే: 3.25/5
|