గత కొంత కాలంగా రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. రాజమౌళి ట్విట్టర్‌లో చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి వున్న ఫొటోని షేర్ చేయడంతోనే ఈ కాంబోపై విపరీతమైన హైప్ ఏర్పడింది. అయితే రాజమౌళి మాత్రం సస్పెన్స్ కొనసాగించాడు ఇంతకాలంపాటు. చివరికి రాజమౌళి ఆ సస్పెన్స్‌కి తెరదించేస్తూ, 'ఆర్ క్యూబ్' కాంబినేషన్‌ని అనౌన్స్ చేసేశాడు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కాంబినేషన్‌లో సినిమా అని ప్రకటిస్తూ, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో 'ఆర్ ఆర్ ఆర్' హ్యాష్ ట్యాగ్‌ని యాడ్ చేశాడు. 'ఆర్‌ఆర్‌ఆర్' అంటే టైటిల్ కాదనీ, ఇది మాసివ్ మల్టీస్టారర్ అనీ, టైటాన్స్ తలపడబోతున్నాయనీ చెప్పేశారు.
ఇద్దరూ అన్నదమ్ముల్లా నటించబోతున్నారనీ, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమా అనీ 'ఆర్ క్యూబ్' గురించి అత్యంత విశ్వసనీయ వర్గాలు సమాచారం అందిస్తున్నాయి. తెలుగులో ఇది నిఖార్సయిన మల్టీస్టారర్‌గా నందమూరి - మెగా అభిమానులు పండగ చేసేసుకుంటున్నారప్పుడే. సినిమా అనౌన్స్‌మెంట్‌నే టీజర్ రిలీజ్ తరహాలో డిజైన్ చేయడాన్ని ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బాహుబలి' పార్ట్ 1, పార్ట్ 2 ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 'మల్టీస్టారర్' రూపొందుతోందంటే, దానిపై ఏర్పడే అంచనాలకి ఆకాశమే హద్దు అన్నది కూడా చాలా చాలా చిన్న మాట అవుతుందేమో. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. చరణ్ సరసన హీరోయిన్ ఎవరు? ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరు? వంటి విషయాలపై క్లారిటీ కోసం ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
|