మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, ఆయన కుమార్తె స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి మేటి తార, 'మహానటి' సావిత్రి జీవిత కథ అంటే మామూలు విషయం కాదది. పైగా కీర్తి సురేష్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవడంతో, మహానటి సావిత్రిని కీర్తి సురేష్ మ్యాచ్ చేయడం సంగతి పక్కన పెడితే, ఆ జీవిత చరిత్రకు చెడ్డ పేరు తీసుకురాకుండా వుంటుందా? అన్న అనుమానాలు కలగడం సహజమే. ఆ భయంతోనే దీన్నొక యజ్ఞంలా భావించిందట కీర్తి సురేష్. తాజాగా ఆ యజ్ఞం పూర్తయ్యింది. సినిమా షూటింగ్‌లో తన పార్ట్ పూర్తయ్యాక కీర్తి సురేష్ భావోద్వేగంతో కంటతడి పెట్టిందట.
అది చూసి కీర్తి సురేష్‌కి ఈ సినిమా పట్ల వున్న కమిట్‌మెంట్‌ని అర్థం చేసుకుని, చిత్ర యూనిట్ కూడా భావోద్వేగానికి లోనయ్యిందట. ఈ సినిమాకి కీర్తిని ఎంచుకోవడం పట్ల పలువురు సీనియర్ నటులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, కొంత నిరాశ కూడా వ్యక్త పరిచారు. దాంతో కీర్తి సురేష్‌కి ఈ సినిమా పెద్ద బాధ్యతగా మారింది. ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తన చేతికి రావడాన్ని ఆమె ఎంతో గౌరవంగా భావించి, ఆ బాధ్యతని, గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతో డెడికేటెడ్‌గా పని చేసింది. తన బాధ్యతను ఎంతో జాగ్రత్తగా నెరవేర్చింది కీర్తి సురేష్. ఇక రిజల్ట్ ప్రేక్షకుల చేతిలోనే. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
|