చిత్రం: ఎంఎల్‌ఏ
తారాగణం: కళ్యాణ్‌రామ్, కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, రవికిషన్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మురెళ్ల
దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, విశ్వ ప్రసాద్
నిర్మాణ సంస్థ: బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ: 23 మార్చి 2018
క్లుప్తంగా చెప్పాలంటే
ఇందు (కాజల్ అగర్వాల్) మీద మనసు పారేసుకుంటాడు కళ్యాణ్ (కళ్యాణ్‌రామ్). అయితే కళ్యాణ్ ఆమెను ప్రేమిస్తాడు తప్ప, అతన్ని మాత్రం ఇందు ఇష్టపడదు. ఓసారి ఇందు ఓ సమస్యలో వుంటే, ఆమెను ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు కళ్యాణ్. దాంతో, ఇందు, కళ్యాణ్ మీద ఇష్టం పెంచుకుంటుంది. అయితే ఇందు తండ్రి (జయప్రకాష్‌రెడ్డి) మాత్రం తన కుమార్తెను ఎమ్మెల్యేకి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. కళ్యాణ్, ఇందు తండ్రితో తాను ప్రేమిస్తున్న విషయాన్ని చెబితే, 'ఎమ్మెల్యే అయితే నా కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తా) అని కళ్యాణ్‌కి, ఇందు తండ్రి షరతు విధిస్తాడు. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గాడప్ప (రవికిషన్)ని ఛాలెంజ్ చేస్తాడు కళ్యాణ్. ఛాలెంజ్‌లో కళ్యాణ్ నెగ్గాడా? ఇందుని దక్కించుకున్నాడా? అన్నది తెరపై చూడాల్సిందే.
మొత్తంగా చెప్పాలంటే
హీరో కళ్యాణ్ రామ్ స్టైలింగ్ మార్చాడు. న్యూ లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి పాత్రలు అతనికి కొట్టిన పిండే. నటుడిగా మంచి మార్కులేయించుకున్నాడు. హీరోయిన్ విషయానికొస్తే, కాజల్ అగర్వాల్ ఇంకాస్త అందంగా కన్పించింది. నటన పరంగా ఓకే. గ్లామరస్‌గా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారుల్లో రవికిషన్ గురించి చెప్పుకోవాలి. 'రేసుగుర్రం' సినిమాలో అతని పాత్రకి ఇది కొనసాగింపు అనేలా వుంటుంది. నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, పృధ్వీ కామెడీ పండించారు.
కథ పరంగా చూస్తే కొత్తదనం ఏమీ లేదు. ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని ప్లాన్ చేసుకుని, ఈక్వేషన్స్ ప్రకారం వెళ్ళిపోయారు. కథనం ఓకే. పాటలు బాగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. నిర్మాణపు విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి రిచ్‌నెస్‌ని తెచ్చింది. ఎడిటింగ్ సెకెండాఫ్‌లో ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సినిమాకి అవసరమైన మేర ఉయోగపడ్డాయి. కామెడీ పంచ్‌లు కొన్ని చోట్ల పేలాయి, కొన్ని చోట్ల తుస్సుమన్నాయి. ఓవరాల్‌గా డైలాగ్స్ ఓకే.
ఫస్టాఫ్ వరకు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని దర్శకుడు బాగానే డీల్ చేశాడు. సెకెండాఫ్‌లోనే వేగం తగ్గిపోయింది. కొంత గందరగోళంగానూ అనిపిస్తుంది. లాజిక్‌కి అందని సన్నివేశాలు ఒకింత ఇబ్బంది పెడతాయి. తర్వాతేం జరుగుతోందో ప్రేక్షకుడికి తెలిసిపోతూ వుంటే, సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. సెకెండాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ పెట్టి వుంటే ఇంకొంచెం బెటర్ ప్రాజెక్ట్ అయి వుండేది. సినిమా చూస్తున్నంతసేపూ చాలా సినిమాల రిఫరెన్స్‌లు గుర్తుకురావడం మరో మైనస్. హీరో ఈజ్‌నీ, హీరోయిన్‌కి వున్న ఇమేజ్‌నీ దర్శకుడు ఇంకొంచెం బాగా వాడుకుని వుండాల్సింది. ఓవరాల్‌గా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఫర్వాలేదన్పిస్తుంది. కొత్తదనం కోసం ఆశిస్తే మాత్రం భంగపడక తప్పదు.
ఒక్క మాటలో చెప్పాలంటే
కమర్షియల్ ఎమ్మెల్యే, పనితనం తక్కువే!
అంకెల్లో చెప్పాలంటే: 2.5/5
|