Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
thailand

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

"పీటర్-ఏ వర్క్ హాలిక్"

పోయినవారం మనం పనంటే పడిచచ్చే మూర్తి గురించి చదివారు కదా! ఇప్పుడు అలాంటి వ్యక్తినే మరొకరిని పరిచయం చేస్తాను.

నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరునైనా రెండేళ్ల పాటు బ్యాటరీల విభాగంలో పనిచేయాల్సి వచ్చింది. మూడు షిఫ్టులు నడిచేవి. ఒక్కో షిఫ్ట్ లో ఇద్దరు పర్మనెంట్ ఎంప్లాయీస్, ఒక క్యాజువల్ ఉండేవారు. మేము పనిచేసే విభాగం సిల్వర్ (వెండి) తో ముడిపడి ఉంటుంది కాబట్టి అందరం చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి వచ్చేది.

ఇదిలా ఉండగా ఒకసారి పి అండ్ ఎ డిపార్ట్ మెంట్, నా సెక్షన్ కు నలుగురు ఐ టి ఐ అప్రెంటిస్ కుర్రాళ్లని పంపింది. నేను వాళ్లలో ముగ్గుర్ని షిఫ్ట్ కు ఒక్కరు చొప్పున విభజించి మిగిలిన ఒక్కతన్ని నేను నా జనరల్ షిఫ్ట్ కోసం పెట్టుకున్నాను. అతనే పీటర్.

మూర్తి ఆటోమొబైల్ చదివి ఎలక్ట్రానిక్స్ రంగం పట్ల ఆసక్తి చూపితే పీటర్ ఎలెక్ట్రానిక్స్ చదివి తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాటరీల రంగంలో చేరాడు. అతనికి ఎలెక్ట్రానిక్స్ అంటే ప్రాణం.

బ్యాటరీలకు సంబంధించిన పని కాంప్లికేటేడ్ కాకపోయినా శ్రద్ధగా, జాగ్రత్తగా చెయ్యాల్సిందే. పైగా బల్క్(పెద్ద ఎత్తున) ప్రొడక్షన్. పనిలోని ముఖ్యమైన అంశాన్ని ముందుగా చక్కగా అవగాహన చేసుకునేవాడు. తర్వాత పనిచేయడంలో మెళకువల్ని, సులువుల్ని గ్రహిస్తాడు. ఆ తర్వాతే పనిచేస్తాడు. ఇహ అందులో ఎంత వెతికినా తప్పు దొరకదు. మొదట్నుంచి నాకు అలాంటి పనిమంతులంటే ఇష్టం. వాళ్లకి కావలసిన రీసోర్సులు అందించడంతో పాటు ఉద్యోగపరంగా ఇతర అధికారుల్నుంచి ఒత్తిడి/ ఇబ్బంది కలగకుండా, జాగ్రత్తగా షీల్డ్ చేస్తా. మానిటరీ బెనిఫిట్స్ సమయానికి అందేలానూ చూసుకుంటాను. అప్పుడు వాళ్ల దృష్టి అంతా పనిమీదే ఉంటుందని నా భావన. అలాగే ఉండేది కూడా.

ఏదైనా సమస్య వస్తే నేను చెప్పేలోగానే అతను సొల్యూషన్ తో రెడీగా ఉండేవాడు. వర్క్ ఎంత నీట్ గా చేసేవాడంటే మనం వంక చూపించడానికి వీసమెత్తు అవకాశం ఉండేది కాదు. పైగా రిపోర్ట్స్, వర్క్ డైరీలు ఎప్పటికప్పుడు చక్కగా నింపేవాడు. అతనివల్ల నా టార్గెట్స్ ఇన్-టైంలో పూర్తయ్యేవి. నేను ఎప్పుడూ, ఎక్కడా టెన్షన్ పడేవాణ్ని కాదు. నేను అవసరార్థం ఏ షిఫ్ట్ లో రమ్మన్నా మారు మాట్లాడకుండా వచ్చేవాడు. సెలవులు కూడా పెట్టేవాడు కాదు. ఒక మేనేజరుకు ఇంతకంటే మంచి వర్కర్ ఎక్కడ దొరుకుతాడు?

నాదీ ఎలెక్ట్రానిక్స్ సబ్జెక్టే కాబట్టి ఎప్పుడైనా లంచ్ టైం. టీ టైం లో ఖాళీ దొరికితే సబ్జెక్ట్ కు సంబంధించిన ఏ ప్రశ్నలు అడిగినా ఇట్టే సమాధానాలు చెప్పేవాడు. ఒకరోజు పీటర్ని ’నీకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం కదా, మరి ఐ టి ఐ తర్వాత చదువెందుకు కొనసాగించలేదు? అడిగాను.

’నాకూ చదువుకోవాలనే ఉందండి. కాని మా ఇంటి పరిస్థితులు ఆ అవకాశం ఇవ్వలేదు’ అని పేలవంగా నవ్వాడు.

నన్ను వాళ్లింటికి రమ్మని ఎప్పుడూ ఆహ్వానిస్తూ ఉండేవాడు. ఒకసారి పనిమీద నేను వాళ్లుండే కాలనీకి వెళ్లాను. పని చూసుకున్నాక పీటర్ ఇంటికి వెళ్లాను. ఎంతో ఆనంద పడిపోయాడు. మర్యాదలు చేస్తూ హడావుడి పడిపోయాడు. రెండు గదుల చిన్న ఇల్లది. రెంటుకు ఉంటున్నారు. వాళ్ల నాన్న, అన్నా వదిన, తను ఉంటారట. తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోయిందట. వాళ్ల నాన్న ఐ డి పి ఎల్ చేసేవారట, అది మూసేశాక ఏం చేయలేక ఇంట్లోనే ఉంటున్నారట. అన్నయ్యకి, తనకి వచ్చే అరకొర జీతాలతో ఇల్లు గడవాలట. తర్వాత తనకు ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం కాబట్టి తనకొచ్చే డబ్బులోంచి కొద్దిగా మిగుల్చుకుంటూ చిన్న చిన్న హాబ్బీ సర్యూట్స్ చేశాట్ట. అవన్నీ చూపించేసరికి నాకు మతిపోయింది. తనకిష్టమైన రంగంలో ముందుకెళ్లాలంటే ప్రోత్సహించే దిక్కులేదు. ఇంటి పరిస్థితులూ అనుకూలంగా లేవు.

ఒకసారి నేను మరో బ్యాటరీ సెక్షన్ ఇంఛార్జ్ తో లంచ్ కోసం క్యాంటీన్ కి వెళుతున్నాను. దారిలో ఆయన ’రాయుడు గారూ, నాకు ఐ టి ఐ చదివిన ఇద్దరు కుర్రాళ్లు కావాలి. పేపర్ యాడ్ ఇద్దామనుకుంటున్నా’నంటూ నాతో మాటల సందర్భంలో అన్నారు. వెంటనే నేను ’ గోపాల్ గారూ, మీరు పేపర్ యాడ్ ఇచ్చి బయటి కుర్రాళ్లని ఇంటర్వ్యూ చేసి తీసుకుంటే, ఆ వచ్చేవాళ్లు మన బ్యాటరీ వాతావరణానికి ఇమడనూవచ్చూ, లేకపోనూవచ్చూ. అదే మన దగ్గర అప్రెంటిస్ చేస్తున్న కుర్రాళ్లని తీసుకుంటే, వాళ్లకి ఈ వాతావరణమూ తెలుసు, పైగా అప్రెంటిస్ చేస్తుండగానే జాబ్ వచ్చిందని ఆనందంగా పనిచేస్తారు’ అన్నాను.

ఆయన ’మీరన్నది చాలా బాగుంది. అయితే నేను ఏ సెక్షన్ నుంచి వాళ్లని తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి?’ అన్నారు.

’అది నాకొదిలేయండి’ నవ్వుతూ అని.

ఆతర్వాత మా జి ఎం ని కలిసి ’సార్, గోపాలం గారి సెక్షన్ లో రెండు జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. నా దగ్గర పనిచేసే ఇద్దరు అప్రెంటీస్ క్యాండిడేట్స్ కు ఆ అవకాశం ఇప్పిద్దామనుకుంటున్నాను. మీరు హెల్ప్ చేయాలి. ప్లీజ్’ అన్నాను.

’నో, ఐ కుదరదు. నువ్వు ఎప్పటి నుంచో మ్యాన్ పవర్ అడుగుతుంటే, నేను పి అండ్ ఎ ను రిక్వెస్ట్ చేసి తెప్పించి, వాళ్లను నీకిచ్చాను’ అన్నాడు కాస్త కోపంగా.

’అలా అనకండి సార్. వాళ్ల లైఫ్ సెటిలై పోతుంది’ అని ప్రాధేయపడ్డాను.

అలా చాలా సేపు రిక్క్వెస్ట్ చేశాక ’ఓ కే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ రెండు కండీషన్లు. 1. వీళ్లకు బదులుగా ఇద్దరు కావాలని పి అండ్ ఎ వాళ్లను నేను రిక్క్వెస్ట్ చేయను. అంచేత ఉన్న మ్యాన్ పవర్ తోనే నువ్వు స(ఎ)ఫీసియెంట్ గా వర్క్ చేయాలి, మ్యాన్ పవర్ లేదని నువ్వెప్పుడూ అనకూడదు .2 ఆ సెక్షన్ కి వాళ్లని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ నువ్వే ఫేస్ చెయ్యాలి’ అన్నాడు.’

‘అలాగే అన్నాను’ ఆయన ఒప్పుకున్నాడన్న ఆనందంతో.

తర్వాత పి అండ్ ఏ ని ఒప్పించే సరికి తల ప్రాణం తోక్కొచ్చింది. మొత్తానికి నానాతిప్పలూ పడి వాళ్లకి అక్కడ స్థానం కల్పించాను. వాళ్లిద్దరి ఆనందానికి అవధిలేదు. వాళ్ల చేత మా జి ఎం కు కూడా థాంక్స్ చెప్పించాను. పీటర్ మా ఇంటికి వచ్చి నాకు బట్టలు పెట్టాడు. అతను నా పట్ల చూపిన గౌరవాభిమానాలకు కళ్లు చెమర్చాయి.

తర్వాత పీటర్ తన వర్క్ తో ఆ సెక్షన్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. గోపాల్ గారు నన్ను కలిసి ‘నేను పేపర్ యాడ్ ఇచ్చి, ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి, క్యాండిడేట్లను తీసుకున్నా పీటర్ లాంటి మంచి ఉద్యోగి బహుశా నాకు దొరికేవాడు కాదేమో. చాలా చాలా థాంక్స్’ అన్నాడు.

కొసమెరుపు: ఆ కుర్రాళ్లు నా సెక్షన్ నుంచి వెళ్లిపోయాక బొంగరంలా తిరుగుతూ అన్ని పనులూ నేనే చేసుకుంటుంటే, రెండు మూడుసార్లు చూసిన మా జి ఎం ఏవనుకున్నాడో, పి అండ్ ఏ ను రిక్వెస్ట్ చేసి ఇద్దర్ని ఇప్పించి ’వీళ్లను మాత్రం ఎవరికీ రికమెండ్ చేయకు’ అని వెళ్లిపోయాడు. ఆయన మంచి మనసుకు నా మనసులోనే జోహార్లు అర్పించాను.***

మరిన్ని శీర్షికలు
vaaram varaam vari vari varaphalalu