Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
prize-for-best-comment

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్పోరేట్లు - వాసుదేవమూర్తి శ్రీపతి

corporates
అప్పిచ్చువాడు వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ

ఇది సుమతీ శతకంలోని పద్యం. అప్పిచ్చువాడు, వైద్యుడు, సమృద్ధిగా నీరు, బ్రాహ్మణుడు మొదలైనవి దొరికే ఊళ్ళోనే ఉండాలి. అవి లేని ఊళ్ళో ఉండకూడదు అని ఈ పద్యం యొక్క అర్థం. క్రమంగా ఆ పద్యంలోని మొదటి పాదం అప్పిచ్చేవాడు వైద్యుడు అనే అర్థంతో వాడుకలోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు మనచేత అప్పులు చేయించేవాడు వైద్యుడు అనుకోవాల్సి వస్తోంది. వైద్యం మాత్రమే కాదు విద్య కూడా...

మన మనుగడకి గాలి, నీరు, ఆహారము ఎంత ముఖ్యమో విద్యా, వైద్యం కూడా అంతే ముఖ్యం. కానీ, అవి రెండూ కార్పోరేట్ కబంధ హస్తాలలో ఇరుక్కుని సగటు మనిషి జీవితాన్ని ఇక్కట్లపాలు చేస్తున్నాయి. ఒక మధ్య తరగతి వ్యక్తి తన నెల సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి వస్తోంది. మిగిలిన సంపాదన కూడు, గుడ్డ, గూడు వంటి అవసరాలకి సరిపోక అప్పులు చేయ్యాల్సి వస్తోంది. ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే, సంవత్సరం పాటు చిట్టీల రూపంలోనో, మరో రూపంలోనో దాచుకున్న డబ్బుకి రెక్కలొచ్చేస్తాయి. సంవత్సరాల పొదుపు ఒక్క "హార్ట్ ఎటాక్" మింగేస్తోంది. లేదా పిల్లల కాలేజీ చదువుకోసం కట్టాల్సిన డొనేషన్ మింగేస్తుంది. ఒక్కొక్కసారి సరిపోక అప్పులు చెయ్యవలసి వస్తోంది.

దేవతలతో సమానంగా పూజింపబడవలసిన వైద్యులు సామాన్యులని భయపెట్టే స్థాయికి దిగపోయారు. కార్పోరేట్ హాస్పిటల్స్ లో పని చేసే వైద్యులకి టార్గెట్స్ ఉంటాయట! ఎంత బాధా కరమైన విషయం!? ఆ టార్గెట్ చేరుకోవడం కోసం వాళ్ళు ఒక్క చిన్న మాత్రతో తగ్గిపోయే జబ్బుని భూతద్దంలో చూపించి వేలు, వీలైతే లక్షలు రాబడతారు. అవసరమున్నా లేకపోయినా స్కానింగులు, రకరకాల పరీక్షలు రాసేస్తారు. సాధారణ జ్వరాన్ని మలేరియానో, టైఫాయిడో.. మరొకటో, అయ్యుండచ్చునని చెప్పి రోగిని లేదా రోగి తాలూకు వాళ్ళని బయపెట్టి వేలకి వేలు ఖర్చు పెట్టించి చివరికి ఏదీ లేదు అని, సాధారణమైన జ్వరమని తేల్చి చెప్పేస్తారు. కోపం కట్టలు తెంచుకున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి.

ఇక బడుల విషయానికి వస్తే లక్షలు, లక్షలు డొనేషన్స్, లక్షలు, లక్షలు ఫీజులతో పాటు, ఐఐటీలనీ, అబాకస్‌ అనీ, వేదిక్ మాక్స్ అనీ, ఆ పుస్తకాలనీ, ఈ మాగజైన్సనీ వేలు వసూలు చేస్తారు. అవసరమున్నా, లేకపోయినా అడ్డమైనవన్నీ పిల్లలపై రుద్దేస్తారు. ఉన్న చదువుల ఒత్తిడి సరిపోనట్టు కొత్త కొత్త కాంపిటేటివ్ పరీక్షలు పెట్టి మళ్ళీ వాటికి డబ్బు వసూలు చేస్తారు. ఒక్క సరైన పుస్తకం కూడా లేని గ్రంధాలయాలను చూపించి లైబ్రరీ ఫీ పేరుతో డబ్బు వసూలు చేసే పాఠశాలలెన్నో ఉన్నాయి. వాళ్ళ స్కూల్ కి పేరు రావడం కోసం పరీక్షల్లో వాళ్ళే కాపీలు కొట్టించేసే ప్రబుధ్ధులు కూడా ఉన్నారు.

ఒకప్పుడు ఘోరీ, ఘజనీలు మన దేశాన్ని కొల్లగొట్టారు. ఆతరువాత ఆంగ్లేయులు, ఇప్పుడు విద్యాలయాలు, వైద్యులు. అంత ఖర్చుపెట్టినా వైద్యాలయాలలో ప్రాణాలకి పూచీ ఉండదు. విద్యాలయాలలో చదువుకి హామీ ఉండదు. ప్రార్థనా స్థలాలతో సమానమైన విద్యా, వైద్యాలయాలు ఆర్ధికంగా, సామాజికంగా, సాంకేతికంగా ఎంతో అభివృధి చెందుతున్నాయి కానీ నైతికంగా పూర్తిగా పతనమౌతున్నాయి.                             
మరిన్ని శీర్షికలు
premikudu short flim review