Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారంవారం వారివారి వార ఫలాలు - ఈడూరి

vaaram varaam vari vari varaphalalu

వారంవారం వారివారి వార ఫలాలు శీర్షికలో ఒకో వారం ఒకో అంశం తీసుకుని సరదా వారఫలాలు అందించే ఈ శీర్షికలో ఈ వారం ఫేస్ బుక్ యూజర్స్ వారఫలాలు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రాన్ని కించపరచడం కాకుండా ఆ శాస్త్రాన్ని లేనివాటికి ఆపాదించడం ద్వారా హాస్యం పుట్టించడానికి  మాత్రమే ఈ ప్రక్రియ. 

మేషం
ఈరాశి వారికి ఈ వారం కుటుంబపరంగా చిన్నచిన్న సమస్యలు తప్పవు కానీ భయపడాల్సిన పనిలేదు సర్దుబాటు కాగలవు. మీరు పెట్టిన పోస్టులు కానీ మీరు లైక్ చేసిన పోస్టులు కానీ మీ కుటుంబ సభ్యులకి నచ్చని కారణంగా కాస్త యుధ్ధ వాతావరణం ఇంట్లో ఏర్పడినా నెమ్మదిగా సర్దుకుంటుంది. చాకచక్యంగా ఇంట్లొవారి పోస్టులకి కూడా కామెంట్సూ లైకులూ కొడుతూ సమస్యని చక్కదిద్దుకుంటారు. శని అదివారాల్లో రావి చెట్టుకి ప్రదక్షిణ చెయ్యండి.

వృషభం
ఈవారం మీరు పెట్టినదల్లా బంగారం. ఎంత చెత్త పోస్టుకైనా కనీసం వందకి తక్కువ కాకుండా లైకులూ యాభైకి తక్కువ కాకుండా కామెంట్సూ వస్తాయి. రాజకీయ చర్చల్లోనూ మీకు స్పందన బాగుంటుంది. మీరు మరొకరి పోస్టు షేర్ చేసినా ఆ పోస్టు ఒరిజినలుగా పెట్టినవారికంటే మీకే ఎక్కువమంది స్పందిస్తారు. ఆ విధంగా మీకు అనుకూలమైన వారం. గురువారం సాయిబాబా గుళ్ళో బిర్యాని ప్రసాదం వీతరణ చేస్తే ఫలితాలు మరింత బాగుంటాయి. ఏ రంగు బట్టలైనా ఈవారం మీకు అనుకూలమే

మిధునం
అనుకున్న పోస్టులు నిదానంగా పెడతారు. ఏనాటినుండో మీ పోస్టులు చూడని వారు ఈవారం మీకు లైక్స్, కామెంట్స్ పెట్టడం మీకు ఆనందం కలిగిస్తుంది. కొత్త ఆభరణాలు, స్థిరాస్తులు సమకూరు తాయి, కానీ వాటి ఫొటోలు మీరు ఫేస్ బుక్కులోనూ వాట్సాప్ లోనూ ట్విట్టరులోనూ పెట్టకండి ఎందుకంటే మీకు నరఘోష ఎక్కువ. ఈ నరఘోష ప్రభావం తగ్గడానికి ఏడు శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. పసుపు రంగు బట్టలు ధరించడం ఉత్తమం కానీ ఆ బట్టలతో ఫొటోలు పోస్ట్ చెయ్యకండి, మీరు ఫలానా పార్టీ మనిషి అనుకుని మిగిలిన పార్టీలవాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకునే ప్రమాదం వుంది.

కర్కాటకం
ఈవారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరొక లైక్ కొడితే వీరికొక లైక్ లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సమానం. కానీ దిగులు పడాల్సిన పనిలేదు. ఒకటి రెండు కొత్త గ్రూపులు మొదలుపెట్టే సూచనలు కనబడుతున్నాయి. ఇంతకాలం ఇతరుల గ్రూపుల్లో పోస్టులు పెట్టినమీరు ఇకనుండీ స్వంత గ్రూపుల్లో పోస్టులు పెట్టుకుంటారు. శనివారం వేంకటేస్వర స్వామి గుడీలో కొబ్బరికాయ కొడితే మంచిది. నల్లని దుస్తులు సత్ఫలితాలు యిస్తాయి

సింహం
ఎంతసేపూ మీ లైక్సూ కామెంట్సు కోసం ఎదురు చూసేవారే తప్ప మీకు లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టేవారు లేరు అన్న చింత ఇకముందు తొలగిపోతుంది. అనుకోని విధంగా ఒక గ్రూపుకి మిమ్మల్ని ఎడ్మిన్ గా వుండమని కోరడంతో మీ గొప్పతనం జనానికి తెలిసొస్తుంది. గ్రూపుని సమర్ధవంతంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తప్పవని మీరు గ్రహిస్తారు. మొదట్లో వ్యతిరేకత వచ్చినా అతితక్కువ సమయంలోనే మిమ్మల్ని సమూహ సభ్యులు అర్ధంచేసుకుని అలవాటుపడిపోతారు. మీరు కూడా ప్రపంచాన్ని మార్చడం తేలిక కాదు అని గ్రహించి మిమ్మల్ని మీరు ఈజీగా మార్చేసుకుంటారు, అదే మీలో వున్న గొప్పతనం. రోజూ వుదయం ఫేసుబుక్కు లాగిన్ అయ్యేముందు గణపతికి మొక్కుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఎరుపు, పసుపు తప్ప ఏ రంగు బట్టలైనా మీకు నప్పుతాయి.

కన్య
ఈవారం మీపోస్టులు ప్రోత్సాహకరంగా ఉం టాయి. ఆశించిన రీతిలో మీ నెట్వర్కులో సభ్యులు స్పందిస్తారు. కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు. మహిళా సభ్యుల నుండి ఫ్రెండ్ రిక్వెస్టులు రావడం మీకు ఆనందాన్నిస్తుంది. మీరు ఎడ్మిన్ గా వున్న సమూహాల్లో కొంత తిరుగుబాటు తనం కనబడినా త్వరలోనే మీదైన రీతిలో పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకుంటారు. ఎన్నాళ్ళుగానో సమూహసభ్యుల రాతలన్నిటినీ పుస్తకంగా అచ్చువేసి డబ్బు సంపాదించాలన్న మీ ఆశ నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కుబేర పూజ చేసి ఆకుపచ్చ దుస్తులు ధరించడం ద్వారా మీ ఆశలకి పచ్చజెండా ఊపుకొనగలరు.

తుల
ఆర్ధికంగా కొద్ది ఒడిదుడుకులుంటాయి. కానీ ఫేసుబుక్కు ఫ్రెండ్సుని వుపయోగించుకుని మీ ఇబ్బందులని అధిగమిస్తారు. గ్రూపు వ్యవహారాలందు అనుకూలత ఉంటుంది. ఇదివరలో మీ కామెంట్సుకి వ్యతిరేక కామెంట్సు పెట్టినవారు కూడా ఈవారం మీకు అనుకూలగా కామెంట్లు పెట్టడం ఆనందాన్నిస్తుంది. అందరితోనూ కలిసిపోయే మీ మనస్తత్వం కొందరికి కంటకింపుగా వుంటుంది అందుకే చిన్నచిన్న స్పర్ధలొచ్చినా అవి తొలగిపోతాయి. శ్రీలంకలో దొరికిన హనుమంతుడి గధ ఫొటోని 108 మందికి షేర్ చేస్తే మీరు మూడు గ్రూపులకి ఎడ్మిన్ అయ్యే అవకాశాలు కలుగుతాయి. రాత్రులప్పుడు తెల్లబట్టలూ, పగలు నల్లబట్టలు ధరించడం ఈరాశి వారికి లాభం.

వృశ్చికం
అనుకున్న పనులు ఆలశ్యంగా నెరవేరుతాయి. మీరు ఉదయం పెట్టినపోస్టుకి సాయంత్రానికి కానీ లైకులు కామెంట్లు రావు. అయినా విచారించాల్సినపనిలేదు. గతంలో మీరు పెట్టిన మంచి కామెంట్లే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకుంటాయి. ఎవరెలా పోతే మనకేంటి అనుకోకుండా అందరి పోస్టులకీ మీరు లైక్ కొట్టేవారు, మీ మంచి తనాన్ని ప్రజలు గుర్తించి మీ అవసరానికి ఆదుకుంటారు. వాట్సాప్ గ్రూపు ఎడ్మిన్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. రోజులు బాగాలేవు. వినాయకుడికి రెండు కేజీల వుండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. నీలం రంగు దుస్తుల్లో ఉంటే మీకు మేలు జరుగుతుంది.

ధనుస్సు
కొత్త గ్రూపులు పెట్టేందుకు, వున్నవాటిని విస్తరంచేందుకు అవకాశాలు దొరుకుతాయి. తద్వారా ఆదాయం పెంచుకోగలుగుతారు. ఒత్తిడి కొద్దిగా ఉంటుంది. సందర్భాన్ని అనుసరించి ప్రవర్తించండి. ప్రముఖులను, ముఖ్యవ్యక్తులను కలుసుకొంటారు. వారితో సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తే మీ పరపతి మరింత పెరుగుతుంది. హామీలను, అప్పులను తొందరపడి ఇవ్వవద్దు. ఈవారం మీరు ఒంటరిగా వున్న సెల్ఫీలను పెట్టవద్దు. నరదృష్టి తగిలే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. విభూతి నుదుట ధరించడం మంచిది. వీలైతే ఆంజనేయస్వామి తోకకి సింధూరం పూస్తూ వుండండి. ఆరెంజ్ రంగు బట్టలు కట్టుకోవడం ద్వారా నరదృష్టి నుండి తప్పించుకోవచ్చును.

మకరం
అసలు సోషల్ మీడియా అంటే ఏమిటో మీ దగ్గర నేర్చుకున్నవారే నేడు మీకు పోటీగా పోస్టులు పెడుతూ మీ గురించి మీ ఫ్రెండ్ లిస్టులో వున్నవారికి చెడుగా చెబుతూ మీ ఫ్రెండ్సుని తన ఫ్రెండ్సుగా మార్చుకోవడం మీకు బాధ కలిగిస్తుంది. నిజం నిప్పులాంటిది నిలకడగా అన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. మిమ్మల్ని వదిలి వెళ్ళినవారు మీరేంటో తెలుసుకుని మళ్ళీ మీవద్దకే వస్తారు. మీరు చెయ్యవల్సిందల్లా మీ పోస్టులు మీరు మానకుండా పెట్టడమే. లైకులు ఎన్ని వచ్చాయి, ఎవరెవరు కామెంట్స్ పెట్టారు అని కాకుండా మన పోస్టులో ఎంత మంచి వుంది అన్నది మాత్రమే చూసుకుంటూ ముందుకి పోవాలి. ఏరోజు ఏ దేవుడి ప్రభావముంటుందో ఆ రోజు ఆ దేవుడి బొమ్మతో అందరికీ గుడ్ మార్నింగ్ మెసేజీలు పెట్టండి. ఏ రంగువైనా బట్టలు కట్టుకోండి.

కుంభం
ఈరాశివారు ఛాటింగులో జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా మీ మాటలకి వక్రభాష్యాలు చేసి మిమ్మల్ని ఫ్లర్టింగు చేసేవారిలా చిత్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మగవారు జాగ్రత్తగా వుండాలి. మీకు పాటలు రికార్డ్ చేసి మీ స్నేహితులందరికీ వినిపించాలని కోరిక వుంటుంది కానీ మీపాట మీకు నచ్చినంతగా మీ స్నేహితులకి నచ్చకపోవచ్చు, అందువల్ల మీ స్నేహితుల లిస్టు సగానికి సగం తగ్గిపోయే ప్రమాదముంది గనక ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఏదిఏమైనా ఈవారం మీకు కాస్త కష్టకాలమే జాగ్రత్తగా మెలిగి పరిస్థితులు చక్కదిద్దుకోవాలి. మీ ఇష్టదైవానికి దద్దోజనం నైవేద్యం పెట్టడం ద్వారా కొంత ఉపశమనం కలుగవచ్చు. ఆకుపచ్చ బట్టలు ధరించండి కానీ మరీ ఆసుపత్రిలో కర్టెన్లలాంటివి కాకుండా మంచివి కొనుక్కోండి.

మీనం
ఈరాశివారికి కొత్త బాధ్యతలు, పనిభారం ఉంటుంది. గ్రూపులో మీరు చేసిన మంచి పోస్టింగులు చూసి మిమ్మల్ని కూడా గ్రూప్ ఎడ్మిన్ చెయ్యడంతో మీ గొప్పతనం ఇనుమడిస్తుంది. మీ సలహాలు, మీ నిర్ణయాలు ఎదుటివారికి అంగీకారమై, మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు. గ్రూపులో మీ ఎదుగుదల కొందరికి మింగుడుపడకపోవడంతో మీకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా మంగళవారం ఆంజనేయస్వామికి ఆకుపూజచేయించి ఎలాంటి మేకప్పులేకుండా తీసుకున్న సెల్ఫీని ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకుంటే నరదిష్టి నివారణలో బాగా ప్రభావముంటుంది.   

మరిన్ని శీర్షికలు
weekly horoscopemarch 30th to april 5th