Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రసమీక్ష

movie review

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చిత్రం: నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 
తారాగణం: అల్లు అర్జున్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌, శరత్‌కుమార్‌, అర్జున్‌, బోమన్‌ ఇరానీ, రావు రమేష్‌, చారుహాసన్‌, వెన్నెల కిషోర్‌, నదియా, ప్రదీప్‌ రావత్‌ తదితరులు. 
సంగీతం: విశాల్‌ శేఖర్‌ 
సినిమాటోగ్రఫీ: రాజీవ్‌ రవి 
దర్శకత్వం: వక్కంతం వంశీ 
నిర్మాతలు: శ్రీధర్‌ లగడపాటి, బన్నీ వాసు, సుశీల్‌ చౌదరి, నాగబాబు 
నిర్మాణం: రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 04 మే 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
సూర్య (అల్లు అర్జున్‌) ఓ సైనికుడు. అతనికి కోపం ఎక్కువ. తన చుట్టూ ఎక్కడ చెడు జరిగినా సహించలేడు. ఆ కోపాన్ని అదుపులో వుంచుకోలేకపోవడమే అతనికి పెద్ద సమస్య. ఆ సమస్య కారణంగానే సైన్యం నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తిరిగి సైన్యంలో కొనసాగడానికి ఓ పరీక్ష పెడతారు. సైకియాట్రిస్ట్‌ రఘురామ కృష్ణంరాజు (సీనియర్‌ నటుడు అర్జున్‌) దగ్గరనుంచి సర్టిఫికెట్‌ తీసుకురావడమే ఆ పరీక్ష. అయితే తనను కలిసిన సూర్యకి రఘురామ కృష్ణంరాజు ఇంకో పరీక్ష పెడతాడు. 21 రోజులు సహనంతో వుండమని చెబుతాడు. ఆ పరీక్షలో సూర్య నెగ్గాడా? రఘురామ కృష్ణం రాజు ఎవరు? సూర్య తిరిగి సైన్యంలో చేరాడా? లేదా అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 
మొత్తంగా చెప్పాలంటే 
సిన్సియర్‌గా అల్లు అర్జున్‌ ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ప్రతి ఫ్రేమ్‌లోనూ అల్లు అర్జున్‌ కష్టం కన్పిస్తుంది. ఫిజిక్‌ని మలచుకున్న తీరు, గెటప్‌, ఆహార్యం.. ఇలా ఒకటేమిటి, అన్నీ టాప్‌ క్లాస్‌ అనేలాగానే వున్నాయి. నటుడిగా అతన్ని ఇంకో మెట్టు పైకెక్కించిన సినిమా. విమర్శకుల ప్రశంసల్ని అల్లు అర్జున్‌ ఖచ్చితంగా పొందుతాడు. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోశాడు అల్లు అర్జున్‌. 
అనూ ఇమ్మాన్యుయేల్‌ అందంగా కన్పించింది. గ్లామర్‌ ఒలకబోసింది. అంతకు మించి, నటిగా తన ఉనికిని చాటుకునేంత గొప్ప సన్నివేశాలేమీ ఆమెకు ఈ సినిమాలో లేవు. సీనియర్‌ నటుడు అర్జున్‌ చాలా బాగా చేశాడు. అతని స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఆకట్టుకుంటుంది. రావు రమేష్‌ కన్పించింది కాస్సేపే అయినా, బాగా రిజిస్టర్‌ అయ్యే పాత్ర అది. సాయికుమార్‌, శరత్‌కుమార్‌ పాత్రలు ఆకట్టుకుంటాయి. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. 

కథ మరీ కొత్తదేమీ కాదు. కానీ, దేశభక్తి నేపథ్యంలో సినిమా అంటే ఇంట్రెస్ట్‌ ఖచ్చితంగా వుంటుంది. దానికి తగ్గట్టుగా దర్శకుడు డైలాగ్స్‌ రాసుకున్నాడు. కథనం వేగంగా నడిపించడంలో కొంచెం తడబడ్డాడు. సీన్స్‌ వైజ్‌గా చూస్తే దర్శకుడి పనితనం కన్పిస్తుంది. మాటలు చాలా బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కించారు. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ నుంచి దర్శకుడికి మంచి సహకారం అందింది. 

సీరియస్‌ టోన్‌లో సాగే సినిమాలకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సినిమా స్టార్టింగ్‌ హై ఓల్టేజ్‌ ఎనర్జీతో వుంటుంది. కాస్సేపటికే కొంత డల్‌నెస్‌ కన్పిస్తుంది. మళ్ళీ ఇంటర్వెల్‌ దగ్గర సినిమా గ్రాఫ్‌ పెరుగుతుంది. సెకెండాఫ్‌ బోరింగ్‌ అనే ఫీల్‌ కలగడం, చివర్లో మళ్ళీ మంచి సీన్స్‌తో ఆకట్టుకోవడం - ఇలా కన్సిస్టెన్సీ లేకుండా పోయింది. ఓవరాల్‌గా సినిమా ఓ మోస్తరు అనుభూతిని ప్రేక్షకులకు మిగుల్చుతుంది. ఎమోషనల్‌ కంటెంట్‌ పేరు చెప్పి క్లాసులు తీసుకోవడం, లవ్‌ ట్రాక్‌ని తీసుకొచ్చి డిస్ట్రబ్‌ చేయడం ఇలాంటి సినిమాలకు స్ప్రీడ్‌ బ్రేకర్లుగా మారతాయని తెలుసుకోలేకపోయాడు దర్శకుడు. సినిమా కోసం అల్లు అర్జున్‌ పడ్డ కష్టం, యాక్షన్‌ సీక్వెన్సెస్‌, కొత్త తరహా డాన్సులు.. ఇవన్నీ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌. పేట్రియాటిజం బాగా ఎలివేట్‌ అయ్యింది. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
నా పేరు సూర్య - అప్స్‌, డౌన్స్‌ అండ్‌ అప్స్‌ 
అంకెల్లో చెప్పాలంటే: 3/5

 
మరిన్ని సినిమా కబుర్లు
churaka