Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నేలటికెట్ చిత్రసమీక్ష

nelaticket movie review

చిత్రం: నేల టిక్కెట్టు 
తారాగణం: రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, అలీ, పృధ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులు 
సంగీతం: శక్తినాథ్‌ కార్తీక్‌ 
సినిమాటోగ్రఫీ: ముఖేష్‌ 
దర్శకత్వం: కళ్యాణ్‌ కృష్ణ కురసాల 
నిర్మాత: రామ్‌ తాళ్ళూరి 
నిర్మాణం: ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 25 మే 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
నేల టిక్కెట్‌ (రవితేజ) ఓ అనాధ. జనం మధ్యలో వుంటాడు. ఆ జనం కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడడు. ఈ క్రమంలోనే హోంమంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు)తో గొడవ మొదలవుతుంది. హోంమంత్రికీ నేల టిక్కెట్‌కీ జరిగే గొడవ ఎంలాంటి పరిణామాలకు దారి తీసింది? హోంమంత్రికి నేల టిక్కెట్‌ ఎలా బుద్ధి చెప్పాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 
మాస్‌ మహరాజా రవితేజ, తనకు కొట్టిన పిండి లాంటి పాత్రలో ఈజీగా చేసుకుంటూ పోయాడు. కొత్తగా ఏమీ చేయడానికి లేకుండా పోయింది అతని పాత్రలో. తన వరకు తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రవితేజ. అయితే ఈ పాత్రని ఇంకాస్త జాగ్రత్తగా దర్శకుడు రాసుకుని వుండాల్సింది. ఎందుకంటే ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా ఒదిగిపోతాడు కదా మాస్‌ మహరాజా. 

హీరోయిన్‌ విషయానికొస్తే, గ్లామరస్‌గా కన్పించిందిగానీ, రవితేజ పక్కన మరీ చిన్న పిల్లలా వుంది. నటన పరంగా ఆమె చెయ్యడానికేమీ లేదు. జగపతిబాబు బాగా చేసినా, అతని పాత్రనీ దర్శకుడు సరిగ్గా డిజైన్‌ చేసుకోలేకపోయాడు. మిగతా పాత్రధారులదీ అదే పరిస్థితి. చెప్పుకోడానికి స్టార్‌ కాస్టింగ్‌ బాగున్నా, ఎవర్నీ దర్శకుడు వాడుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కథ మరీ పాత కాలం నాటిది. కథనం అంతకన్నా పాతకాలం నాటిదే అన్నట్టు తయారైంది. డైలాగ్స్‌ అక్కడక్కడా బాగున్నాయన్పించినా, ఓవరాల్‌గా నిరాశపర్చాయనే చెప్పొచ్చు. సంగీతం జస్ట్‌ ఓకే. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతంతమాత్రంగానే 'స్కోర్‌' చేస్తుంది. సినిమాటోగ్రఫీ గురించీ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. సినిమాలో క్వాలిటీ కూడా కన్పించకపోవడం ఆశ్చర్యకరం. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ తదితర విభాగాల గురించీ చెప్పుకోడానికి ఏమీ లేదు. 

రవితేజతో సినిమా అంటే ఆటోమేటిక్‌గా దర్శకుల్లో ఏదో తెలియని ఎనర్జీ వచ్చేస్తుంటుంది. ఆల్రెడీ సక్సెస్‌లలో వున్న కళ్యాణ్‌ కృష్ణ మాత్రం ఆ ఎనర్జీని మిస్‌ అయ్యాడు. రవితేజ లాంటి ఎనర్జిటిక్‌ స్టార్‌ నుంచి ఇంకా స్ఫూర్తి పొంది, ఇంకా ఎనర్జిటిక్‌ సినిమా తీయాల్సింది పోయి, నీరసంగా సాగే సినిమా తీశాడు. ఏ సన్నివేశంలోనూ 'వారెవ్వా' అన్పించలేకపోయాడు దర్శకుడు. కథ, కథనాల విషయంలోనూ, డైలాగ్స్‌ విషయంలోనూ, సన్నివేశాల చిత్రీకరణలోనూ ఎక్కడా దర్శకుడి గత చిత్రాల్లో కన్పించిన 'స్పార్క్‌' లేకపోవడం శోచనీయమే. మాస్‌ని మెప్పించే యాక్షన్‌ సన్నివేశాలు, హీరోయిన్‌ గ్లామర్‌ లాంటివి తప్ప సినిమాలో చెప్పుకోడానికేమీ లేవు. జగపతిబాబు పాత్ర మాత్రం కాస్త ఆకట్టుకుంటుంది. అయితే ఆ పాత్ర కూడా చాలావరకు అభాసుపాలైపోవడం బాధాకరం. ఓవరాల్‌గా ఈ సినిమా పూర్తిగా నిరాశపర్చుతుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
నేల టిక్కెట్‌.. కంప్లీట్‌ డిజ్పాయింట్‌మెంట్‌ 
అంకెల్లో చెప్పాలంటే: 2/5

నేలటికెట్ చిత్ర విశేషాలు....ఆసక్తికరమైన కథనాల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.....

http://www.ratingdada.com/1047/nela-ticket-movie-review-rating

మరిన్ని సినిమా కబుర్లు
churaka