Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

తేజ్‌ ఐ లవ్‌ యూ చిత్రసమీక్ష

tej i love u  movie review

చిత్రం: తేజ్‌ ఐ లవ్‌ యూ 
తారాగణం: సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జనయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, పృధ్వీ, సురేఖ వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌కుమార్‌ తదితరులు. 
సంగీతం: గోపీ సుందర్‌ 
సినిమాటోగ్రఫీ: ఆండ్రూ ఐ 
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌ 
నిర్మాత: కె.ఎస్‌.రామారావు 
నిర్మాణం: క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ 
విడుదల తేదీ: 6 జులై 2018 
క్లుప్తంగా చెప్పాలంటే 
తేజ్‌ (సాయిధరమ్‌తేజ్‌) మ్యూజిక్‌ బ్యాండ్‌ నడుపుతుంటాడు స్నేహితులతో కలిసి. ఇంకోపక్క విదేశాల నుంచి వస్తుంది నందిని (అనుపమ పరమేశ్వరన్‌). తేజ్‌, నందినితో ప్రేమలో పడతాడు. నందిని కూడా తేజ్‌ని ఇష్టపడుతుంది. అయితే, అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఈ ఇద్దరి జీవితాల్లోనూ పెను మార్పులకు కారణమవుతుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? తేజ్‌ తన ప్రేమని గెలిపించుకున్నాడా? నందినిని తేజ్‌ ఎలా సొంతం చేసుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 
మొత్తంగా చెప్పాలంటే 
సాయిధరమ్‌ తేజ్‌ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. సరదాగా కన్పించాడు, ఎమోషనల్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఎనర్జిటిక్‌గా చేశాడు. డాన్సులు బాగున్నాయి. ఓవరాల్‌గా సాయిధరమ్‌ తేజ్‌ బాడీ లాంగ్వేజ్‌లో సినిమా సినిమాకీ ఆహ్వానించదగ్గ మార్పులు చాలా కన్పిస్తున్నాయి. నటన పరంగా చాలా మెచ్యూరిటీ సొంతం చేసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే, తేజు తన ఫిజిక్‌ మీద ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం వుంది. 
హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. చాలా క్యూట్‌గా కన్పించింది. ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి నటనా ప్రతిభ చూపించింది. తేజు, అనుపమ కాంబినేషన్‌ తెరపై ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. మిగతా పాత్రదారులంతా తమ పాత్రల పరిధి మేర బాగాశ్రీనే చేశారు. 
కథ మరీ కొత్తదేమీ కాదు, అలాగని పాతదీ కాదు. కానీ, పాత సినిమాల రిఫరెన్స్‌లు చాలా కన్పిస్తాయి. కథనం పరంగా కొన్ని లోపాలున్నాయి. డైలాగ్స్‌ బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ ఓకే. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. 
కరుణాకరన్‌ సినిమా అనగానే అందరికీ 'తొలిప్రేమ'నే గుర్తుకొస్తుంది. ఆ తర్వాత కొన్ని హిట్‌ సినిమాలు, కొన్ని ఫెయిల్యూర్స్‌ తీసినా, ఇంకా 'తొలిప్రేమ' గుర్తుండిపోవడానికి కారణం, ఆ సినిమాలోని ఫీల్‌. కొన్ని సినిమాల్లో కరుణాకరన్‌ ఆ ఫీల్‌ని క్యారీ చేయగలుగుతున్నా, 'తొలి ప్రేమ' మ్యాజిక్‌ని అయితే రిపీట్‌ చేయలేకపోతున్నాడు. 'తేజ్‌ ఐ లవ్‌ యూ' ప్రమోషన్స్‌ చూస్తే, 'తొలి ప్రేమ' మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందేమోనన్న అభిప్రాయం కలిగింది. కానీ, గత సినిమాల్ని గుర్తుకు తెచ్చేలా సినిమాలో చాలా సీన్స్‌ని నింపేసి, నిరాశపరిచాడు దర్శకుడు. హీరో, హీరోయిన్లలో మంచి ఎనర్జీ వున్నా దాన్ని వాడుకోలేకపోయాడు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని పండించలేకపోయాడు దర్శకుడు. ఎలా చూసినా, కరుణాకరన్‌ నిరాశ పరిచాడనే చెప్పాల్సి వుంటుంది. తేజు, ఇటీవలి వైఫల్యాల నుంచి కొంచెం ఊపిరి పీల్చుకునే సినిమా మాత్రమే అన్పిస్తుంది. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
తేజ్‌ని ఓ మోస్తరుగా లవ్‌ చేయొచ్చు! 
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

 
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka