అక్కినేని నాగార్జునని మన్మధుడు అంటాం. కింగ్ అని పిలుస్తాం. కానీ కొత్తదనాన్ని ప్రోత్సహించే విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. నటుడిగానే కాదు నిర్మాతగానూ కొత్తదనాన్ని కోరుకుంటాడాయన. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. తెలుగులో నాగార్జున చేసినన్ని మల్టీ స్టారర్స్ ఇంకెవరూ చేయలేదనడం అతిశయోక్తి కాదేమో. శ్రీకాంత్, మోహన్‌బాబు, విష్ణు, సుమంత్ ఇలా పలువురితో మల్టీ స్టారర్స్ చేసిన నాగార్జున, నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ 'దేవదాస్'. దేవదాస్ అనగానే చేతిలో మందు బాటిలు, పక్కనే ఓ కుక్క గుర్తుకొస్తాయి అందరికీ.
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమా అది. ఆ తర్వాత ఇంకో 'దేవదాస్' వచ్చింది. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రమది. ఇప్పుడు ఈ 'దేవదాస్'. ఇంతకీ ఈ దేవదాస్ ఒకప్పటి 'దేవదాస్'ని పోలి ఉంటుందా? లేక నిన్న మొన్నటి దేవదాస్‌లా ఉంటుందా? అవేమీ కాదు, ఇది సమ్‌థింగ్ స్పెషల్. ఒక డాక్డరుకూ ఒక క్రిమినల్‌కీ సంబంధించిన స్టోరీ ఇది అనే సంకేతాలు పంపింది టైటిల్ లుక్. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి విలక్షణ యంగ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో రూపొందిస్తున్నారు. చూడాలి మరి ఈ 'దేవదాస్'తో నాగ్, నాని ఎలా ఆకట్టుకుంటారో.!
|