Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

విజేత చిత్రసమీక్ష

vijeta movie review

చిత్రం: విజేత 
తారాగణం: కళ్యాణ్‌ దేవ్‌ (తొలి పరిచయం), మాళవిక నాయర్‌, మురళీ శర్మ, నాజర్‌, సత్యం రాజేష్‌, రాజీవ్‌ కనకాల 
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ 
సినిమాటోగ్రఫీ: సెంథిల్‌ కుమార్‌ 
నిర్మాణం: వారాహి చలన చిత్రం 
నిర్మాత: సాయి కొర్రపాటి 
దర్శకత్వం: రాకేశ్‌ శశి 
విడుదల తేదీ: 12 జులై 2018

కుప్తంగా చెప్పాలంటే.. 
ఇంజనీరింగ్‌ చేసి, ఉద్యోగ వేటలో వుంటాడు రామ్‌ (కళ్యాణ్‌ దేవ్‌). అత్తెసరు మార్కుల స్టూడెంట్‌ కావడంతో, ఉద్యోగం రాదు. బాధ్యతలేవీ లేకుండా తిరుగుతుండే రామ్‌ కోసం అతని తండ్రి శ్రీనివాసరావు (మురళీశర్మ) ఆందోళన చెందుతుంటాడు. జీవితంలో సీరియస్‌నెస్‌ చాలా ముఖ్యమని కొడుక్కి పదే పదే చెబుతుంటాడు. మరోపక్క రామ్‌, తన కాలనీలోనే వుండే జైత్ర (మాళవిక నాయర్‌)తో ప్రేమలో పడతాడు. ఇంతకీ రామ్‌కి తన తండ్రి విలువ ఎలా తెలిసింది.? ప్రేమించిన జైత్రను దక్కించుకున్నాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొత్తంగా చెప్పాలంటే.. 
తొలి సినిమానే అయినా కెమెరా అంటే బెరుకు లేకుండా నటించాడు కళ్యాణ్‌ దేవ్‌. మొదటి సినిమానే కాబట్టి, చిన్న చిన్న లోపాలు మామూలే. ఆ చిన్న చిన్న విషయాల్ని పక్కన పెడితే, తొలి సినిమాతో మంచి మార్కులే వేయించుకున్నాడు నటుడిగా కళ్యాణ్‌ దేవ్‌. అయితే తొలి సినిమానే బరువైన సినిమా కావడంతో, కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మాళవికా నాయర్‌ చాలా బాగా చేసిందిగానీ, ఆమెది అంతగా ప్రాధాన్యత లేని పాత్ర అయిపోయింది.

మురళీ శర్మ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఓ మంచి తండ్రిగా అతని పాత్ర, ఆ పాత్రలోని నటన గుర్తుండిపోతుంది. నాజర్‌, రాజీవ్‌ కనకాల, సత్యం రాజేష్‌, పృధ్వీ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. మిగతా పాత్రధారులంతా కథలో తమకిచ్చిన పాత్రల్లో బాగానే చేశారు.

కథ కొత్తదేమీ కాదు. చాలా సినిమాల్లో చూసేసిందే. ఎంత పాత కథ అయినా, ట్రీట్‌మెంట్‌ కొత్తగా వుంటే ఈ పాయింట్‌ ఎప్పుడూ సేలబిలిటీ వున్నదే. అయితే కథనం పరంగా దర్శకుడు పెద్దగా ఫోకస్‌ పెట్టినట్లు అన్పించదు. ట్రీట్‌మెంట్‌ విషయమై సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. డైలాగ్స్‌ బాగానే వున్నాయి. కొన్ని డైలాగ్‌లు బాగా ఆకట్టుకుంటాయి. సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకోవాలంటే సినిమాటోగ్రఫీనే సినిమాకి హైలైట్‌. పాటలు బాగున్నాయి. నిర్మాణం పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా వున్నాయి. ఎడిటింగ్‌ అక్కడక్కడా ఇంకాస్త అవసరం అన్పిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది.

ఫస్టాఫ్‌ సరదా సరదాగా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో ఎమోషనల్‌ కంటెంట్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ని టచ్‌ చేసే అవకాశాలున్నాయి. అయితే పాత కథే కావడం, కొత్తగా తెరంగేట్రం చేస్తున్న హీరో సినిమా కావడంతో.. ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ సినిమాలో వుండేలా చూసుకోవాల్సింది దర్శకుడు. కానీ ఎక్కడా కొత్తదనం కన్పించదు. సాదా సీదా ఫ్యామిలీ కథాంశం అన్న ఫీలింగ్‌ మాత్రమే తీసుకొచ్చిన దర్శకుడు, ఈ తరం యూత్‌కి కావాల్సిన అంశాల్ని లైట్‌ తీసుకున్నాడు. స్లో నెరేషన్‌ సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. 
విజేత కాలేకపోయాడుగానీ... 
అంకెల్లో చెప్పాలంటే.. 
2.5/5

 

 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka