క్రిష్ రాకతో 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగ్ పరుగులు పెట్టేస్తోంది. ఓ పక్క నటీనటుల ఎంపిక జరుగుతూనే, మరోపక్క షూటింగ్ పనులకు ఆటంకం లేకుండా చకచకా కానిచ్చేస్తున్నాడు క్రిష్. క్రిష్ అంటే అంతే. ఓ ప్రాజెక్టును ఎత్తుకున్నాడంటే ఆ ప్రాజెక్టును అనుకున్న టైంకి కంప్లీట్ చేసి తీరాల్సిందే. అలాగే 'ఎన్టీఆర్' ప్రాజెక్టును కూడా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు క్రిష్. దాంతో షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసే యోచనలో ఉన్నాడు. మొదట తేజ చేతికెళ్లిన ఈ ప్రాజెక్ట్ ఇటీవలే క్రిష్ చేతికొచ్చింది. బాలయ్యతో 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి చారిత్రాత్మక చిత్రాన్ని విజయవంతంగా తెరకెక్కించిన క్రిష్ ఈ బయోపిక్‌కి సమర్ధుడని భావించి బాలయ్య ఏరి కోరి క్రిష్‌ని లైన్‌లోకి తీసుకొచ్చాడు.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రధారుల ఎంపిక జరిగిపోయినట్లే. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది. రానా చంద్రబాబు పాత్ర పోషిస్తుండగా, నాగ చైతన్య తాత ఏఎన్నార్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక కృష్ణ పాత్రను మహేష్‌బాబు పోషించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఆళూరి చక్రపాణి పాత్ర కోసం సీనియర్ నటుడు మోహన్‌బాబును ఎంపిక చేసుకున్నారు. అన్నట్లు ఈ సినిమాలో యంగ్ ఎన్టీఆర్ పాత్ర కోసం బాలయ్య తనయుడు మోక్షజ్ఞను తీసుకునే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే తాత బయోపిక్‌తోనే మనవడి తెరంగేట్రం జరుగనుందన్నమాట.
|